
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీరు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి శశిథరూర్ ప్రశంసించారు. అలాగే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు కథనాలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు.
తాజాగా శశిథరూర్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. కానీ, నేను దేశం, కేరళ భవిష్యత్ కోసం మాట్లాడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నేను కాంగ్రెస్‌కు విధేయుడినే. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకానీ, పార్టీ మారే ఆలోచన నాకు లేదు. ప్రజల సేవ పట్ల నిబద్ధతతో ఉన్నాను. నేను రాజకీయాల్లోకి రా ముందే ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా పనిచేశాను. అనంతరం.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరిన తర్వాతే పార్టీలో చేరాను’ అని తెలిపారు.
పార్టీకి నేను అవసరం అనుకుంటే నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. పార్టీకి అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతేకానీ ఇతర పార్టీల్లో చేరడంపై నేను ఆలోచించడం లేదు. పుస్తకాలు.. ప్రసంగాలు.. సదస్సుల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు.. ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రజాస్వామ్యవాదిగా ఉంటాను. మతతత్వాన్ని వ్యతిరేకిస్తాను. అలాగే, సామాజిక న్యాయాన్ని నమ్ముతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త అయిన శశిథరూర్.. పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ నాయకత్వానికి రుచించలేదు. కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలను శశిథరూర్ ఇటీవల ప్రశంసించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ట్రంప్‌తో భేటీ ఫలితాలను శశిథరూర్ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment