
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్‌డీ కుమారస్వామి సర్కార్‌ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు.
ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్‌ను విస్తరించడం లేదంటే పునర్‌వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్‌లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment