నరేంద్ర మోదీ ఘన విజయ సంబరాలు స్టాక్‌మార్కెట్లో శుక్రవారం కూడా కొనసాగాయి. ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,800 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా గురువారం నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి.
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు లాభపడి 39,435 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఈ నెల 20న నెలకొల్పిన క్లోజింగ్ రికార్డ్‌లను సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం బ్రేక్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
సెంటిమెంట్‌కు జోష్...
ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఘన విజయం దక్కిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మక నిర్ణయాలు తీసుకోగలదనే అంచనాలు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. ఇది బిజినెస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో పెట్టుబడులకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు.. ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిపుణులంటున్నారు.
అంతకంతకూ పెరిగిన లాభాలు...
ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఉదయం పదిగంటల సమయంలో లాభాలు తగ్గాయి. ఆ తర్వాత అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
బ్యాంక్ షేర్ల జోరు...
ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మోనేటరీ పాలసీలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించనున్నదని, కొత్త ప్రభుత్వం మరిన్ని మూలధన నిధులను అందించనున్నదని, బలహీన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేసే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదన్న అంచనాలు బ్యాంక్ షేర్లను లాభాల బాట నడిపిస్తున్నాయి.
మరిన్ని విశేషాలు....
► 31 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభపడగా, 4 షేర్లు–ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభాల్లో, 6 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
► ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం లాభంతో రూ.432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.434ను తాకింది. ఈ షేర్‌తో పాలు 20కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్తి ఇండస్ట్రీస్, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, కల్పతరు పవర్, మణప్పురం ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► వాటా కొనుగోళ్ల విషయమై హిందుజా గ్రూప్, ఇతిహాద్ ఎయిర్‌వేస్‌ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ షేర్ 5 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది.
► రూ.616 కోట్ల ఆర్డర్లు రావడంతో జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్ షేర్ 14 శాతం లాభంతో రూ.135 వద్దకు చేరింది.
► గతంలోలాగానే ఇప్పుడు కూడా ఎన్‌డీఏ ప్రభుత్వం మౌలిక రంగంపై మరిన్ని నిధులు ఖర్చు చేయగలదనే అంచనాలతో సిమెంట్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో హెడెల్‌బర్గ్ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే సిమెంట్‌లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 3–11 శాతం రేంజ్‌లో ఎగిశాయి.
► 170కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్‌లను తాకాయి. దిలిప్ బిల్డ్‌కాన్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, అమృతాంజన్ హెల్త్‌కేర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, జేఎమ్‌టీ ఆటో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
5 రోజుల్లో.. రూ. 6 లక్షల కోట్ల సంపద
స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.2.54 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,53,830 కోట్లు పెరిగి రూ.1,52,71,407 కోట్లకు చేరింది. ఇక ఈ వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది.
చరిత్రాత్మక వారం...
వారంపరంగా చూస్తే, సెన్సెక్స్ 1,503 పాయిం ట్లు, నిఫ్టీ 437 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇరు సూచీలు దాదాపు 4% ఎగిశాయి. ఈ ఏడాది ఈ సూచీలు అత్యధికంగా లాభపడింది ఈ వారమే. ఈ వారంలోనే సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఆల్‌టైమ్ హై వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్టానికి ఎగసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 6% లాభపడింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయా న్ని ప్రతిబింబించే ఇండియా ఓలటాలిటీ ఇం డెక్స్ ఈ వారంలో 41 శాతం క్షీణించింది. ఈ వారంలో ఈ సూచీ 44 నెలల గరిష్ట స్థాయి, 30.18కు ఎగసినా, ఎన్నికల ఫలితాల కారణంగా 16.54 స్థాయికి దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment