సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది.
సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్‌షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్‌షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్‌రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్‌కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment