సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. 300 మంది మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం 542 మంది సభ్యులు ఎన్నికకాగా వారిలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం ఎంపీల్లో వారి శాతం 14 శాతం. గత లోక్‌సభలో వారి శాతం 12 శాతం ఉండగా, ఈసారి 14 శాతానికి చేరుకోవడం ఓ విశేషమే. మొదటిసారి ఎన్నికైన వారిలో అమిత్ షా భారతీయ రాజకీయాల్లో ఆరితేరిన వారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కరడుగట్టిన హిందూత్వ వాదిగా సుపరిచితురాలు. ఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీలు గౌతమ్ గంభీర్, హన్స్ రాజ్ హన్స్ సెలబ్రిటీలుగా ముందుగానే సుపరిచితులు. మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల గురించి కొన్ని విశేషాలు.
అమిత్ షా
బీజేపీ అధ్యక్షుడిగా, ఎన్డీయే చైర్మన్‌గా గత ఐదేళ్లుగా దేశ క్రియాశీలక రాజకీయాలను నిర్వహిస్తోన్న అమిత్ షా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్ వ్యాపారవేత్త కుమారుడైన అమిత్ షా చిన్నతనంలోనే ఆరెస్సెస్ శాఖలో చేరారు. 1986లో బీజేపీలో చేరారు. 1997లో తన 33వ ఏట మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మోదీ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. 2017లో రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయ్యారు. 1990 నుంచి మోదీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాయన అటు గుజరాత్, ఇటు దేశంలో బీజేపీ బలపడేందుకు కృషి చేశారు. సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసుతోపాటు పలు హత్య కేసుల్లో నిందితుడు. వేటిలోను శిక్ష పడలేదు.
జ్యోతిమని ఎస్.
తమిళనాడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ జ్యోతిమని. అన్నామలైన యూనివర్శిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ చదవిన 43 జ్యోతిమని ప్రముఖ కథా రచయిత్రి. ఆమె రాసిన చిన్న కథలు చాలా పాపులర్. 22వ ఏటనే కాంగ్రెస్ యువజన పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించిన ఆమె, నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబీదురైని ఏకంగా 4, 20,546 ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో తంబిదురై పైనే ఆమె పోటీచేసి ఓడిపోయారు.
రమ్య హరిదాస్
32 ఏళ్ల రమ్య హరిదాస్ దళిత మహిళ. కేరళలోని అలథూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేవరకు ఆమె పెద్దగా ఎవరికి తెలియదు. లైంగిక వేధింపులు, క్యారెక్టర్ హత్యా ప్రయత్నాలకు ఆమె ఎదురొడ్డి నిలిచారు. ఈసారి కేరళ నుంచి ఎన్నికైన ఏకైక మహిళ కాగా.. ఇంతవరకు కేరళ నుంచి ఎన్నికైన రెండో దళిత మహిళ.
మహువా మొహిత్రా
బీజేపీకి బాకా ఊదే టెలివిజన్ న్యూస్ యాంకర్ ఆర్నాబ్ గోస్వామికి ‘మధ్య వేలు’ చూపిస్తున్న వీడియో వైరల్ అవడంతో ఆమె గురించి మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. కోల్‌కతాలో జన్మించిన మొహిత్రా అమెరికాలో చదువుకుని జేపీ మోర్గాన్ వద్ద పనిచేశారు. బ్యాంకర్‌గా ప్రశంసలు అందుకున్న ఆమె తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి బీజేపీ అభ్యర్థి, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేను 65 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు.
తేజస్వీ సూర్య
బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడు తేజస్వీ సూర్య (28). వత్తిరీత్యా న్యాయవాది అయిన సూర్య, బీజేపీ నాయకులు బీఎస్ యడ్యూరప్ప, ప్రతాప్ సింహా కేసులను వాదించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీకి కార్యదర్శిగా పనిచేసిన సూర్య, ఆ తర్వాత బీజేపీ యువ మోర్చాలో కూడా పనిచేశారు. కర్ణాటక బీజేపీ ఐటీ సెల్‌లో కూడా పనిచేశారు.
ఇంతియాజ్ జలీల్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసీ ఇంతియాజ్ జలీల్ మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ జర్నలిస్ట్ అయిన జలీల్ 2014లో ఔరంగాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన ప్రముఖుడిగా మారిపోయారు. ఏఐఎంఐఎం కూటమి ఒప్పందాల్లో భాగంగా వేరే వ్యక్తిని నిలబెట్టాలనుకున్నారు. అలాగయితే తాను స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తానని హెచ్చరించడంతో జలీల్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయాల్సి వచ్చింది. జలీల్ సీనియర్ శివసేన నాయకుడు చంద్రకాంత్ ఖైరేను ఓడించారు.
Comments
Please login to add a commentAdd a comment