
చెన్నై : వేలూరు పార్లమెంట్ స్ధానానికి జరిగిన ఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని అన్నాడీఎంకే కాపాడుకోలేక పోయింది. డీఎంకే పార్టీ అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అన్నాడీఎంకే అభ్యర్ధి ఏసీ షణ్ముగంపై 8,142 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆనంద్‌కు 4,85,340 ఓట్లు రాగా, షణ్ముగం 4,77,199 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య మొదటి నుంచీ విజయం దోబూచులాండింది. తొలుత అన్నాడీఎంకే అభ్యర్ధి షణ్ముగం ఆధిక్యంలో కొనసాగగా డీఎంకే అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అనూహ్యంగా పుంజుకున్నారు. చివరి వరకు ఆయన ఆధిక్యంలో కొనసాగారు.
భారీ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ 24 రౌండ్లపాటు సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వేలూరులో గత ఏప్రిల్ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. డీఎంకే అభ‍్యర్ధి గోడౌన్‌లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడటంతో ఎన్నిక వాయిదా పడింది. డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈసీ అక్కడి ఎన్నికను వాయిదా వేసింది. ఇక ఆగస్టు 5న ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. ఏఐఏడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment