చెన్నై: 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన కొత్త పార్టీల్లో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపినట్లు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. తమిళనాడులోని 11 లోక్‌సభ స్థానాల్లో ఎంఎన్‌ఎం అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి కమల్ నిరాకరించినప్పటికీ ఎంఎన్‌ఎం పార్టీకి 3.72 శాతం ఓట్లు లభించాయి. ‘కొన్ని ప్రాంతాల్లో మా అభ్యర్థులు 12 శాతం ఓట్లు సాధించారు. ఇంత తక్కువకాలంలో అన్నిచోట్ల బరిలోకి దిగి ఈ ఫలితాలు సాధించడం మంచి ఆరంభమే’ అని కమల్‌హాసన్ హర్షం వ్యక్తం చేశారు.
దేశమంతా నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పటికీ తమిళ ఓటర్లు మాత్రం తమ రాష్ట్ర పార్టీలకే పట్టంకట్టడం గర్వంగా ఉందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, తాము చాలా దూరం ప్రయాణించాల్సివుందని చెప్పారు. అతి తక్కువ సమయం ఉండటంతో ఈ ఎన్నికల్లో అనుకున్నవిధంగా రాణించలేకపోయామని అంగీకరించారు. తమ అంకితభావం చూసి ఏమీ ఆశించకుండా ప్రజలు తమకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అత్యధిక ఓట్లు సాధించిన తమ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో విజేతలుగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలతో సమానంగా తమిళనాడును చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి కమల్‌హాసన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment