సురేంద్ర సింగ్ పాడె మోస్తున్న స్మృతీ ఇరానీ
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ కార్యకర్తపై కాల్పులు కలకలం రేపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అమేథీ నుంచి ఎంపీగా ఎంపికైన స్మృతీ ఇరానీ అనుచరుడు, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ (50)పై శనివారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేంద్ర అతని స్వగృహంలో నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సురేంద్రను లక్నో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, రాజకీయ శత్రుత్వం వల్లే హత్య జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు.
పాడె మోసిన స్మృతీ ఇరానీ
సురేంద్ర మృతి విషయం తెలియగానే స్మృతి ఇరానీ హుటాహుటిన అమేథీకి చేరుకున్నారు. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. వారిని ఓదార్చారు. రాష్ట్ర మంత్రి మోసిన్ రజా కూడా సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా స్మృతి, రజాలు సురేంద్ర పాడె మోశారు. సురేంద్ర మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment