Surendra Singh
-
రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ దారుణ హత్య
చండీగఢ్: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. పంచగావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ డంపర్ డ్రైవర్ డీఎస్పీపై నుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకే డీఎస్పీ వెళ్లారని, తన వెంట బలగాలను తీసుకువెళ్లే సమయం లేదని పేర్కొన్నారు. నిందితులు హత్యకు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. Haryana | Tawadu (Mewat) DSP Surendra Singh Bishnoi, who had gone to investigate an instance of illegal mining in Nuh, died after being run over by a dumper driver. Search operation is underway to apprehend the accused. Details awaited: Nuh Police pic.twitter.com/Q1xjdUPWE2 — ANI (@ANI) July 19, 2022 వదిలిపెట్టేది లేదు.. డీఎస్పీ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా మైనింగ్ మినిస్టర్ మూల్ చంద్ శర్మ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా చర్చించినట్లు చెప్పారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కూడా నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సురేంద్ర సింగ్ కుటుంబానికి రూ.50లక్షలు బ్యాంకు ద్వారా , మరో రూ.50లక్షలు ప్రభుత్వం తరఫున పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోలీసు శాఖ మొత్తం డీఎస్పీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనా వైరస్ బారిన పడి కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావటంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జీనా ఆరోగ్యపరిస్థితి బాగా క్షిణించి తుది శ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో ఆయన జన్మించారు. 2007లో మొదటి సారి బిక్యాసెన్ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాల్ట్ నియోజవర్గంనుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన భార్య గుండెపోటు కారణంగా మృతి చెందారు. -
రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..
బల్లియా: అత్యాచారాలు ఆగాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్ల్లకు మర్యాదగా ప్రవర్తించడం నేర్పించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మంచి విలువలతో మాత్రమే ఇలాంటి చర్యలు ఆగుతాయని, ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల లేదా శిక్షల వల్ల ఆగవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధర్మం రక్షణ కల్పించడమేనని, తమ కూతుళ్ళు మర్యాదగా నడుచుకునేలా పెంచడం తల్లిదండ్రుల ధర్మమని చెప్పారు. మంచి విలువలే ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తాయని అన్నారు. హాథ్రస్ ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘మమతా నాయకురాలు కాదు.. ఓ దెయ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి శ్రీలంకలోని రాక్షసి లంకిణి లక్షణాలు ఉన్నాయని, ఆమె దెయ్యాల రాణి అని అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టం-2019పై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీకి సంపూర్ణమైన దెయ్యాల లక్షణాలున్నాయి. ఆమెలో మానవత్వ విలువలు, మహిళలకు ఉండాల్సిన లక్షణాలు లేవు. వేలాది మంది హిందువులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను ఆమె రక్షిస్తున్నారు.ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటాం. మమతా ఓ నాయకురాలు కాదు.. శ్రీలంకలోని రాక్షసి లంకిణి. ఓ దెయ్యానికి ఉండాల్సిన లక్షణాలను అన్ని మమతకు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేవతల పార్టీ అంటూ.. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ రాక్షస జాతికి చెందినవని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నామని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సురేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముస్లింలు ఇష్టమొచ్చినట్టుగా జంతువుల్లా కనిపారేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ముస్లిం కుటుంబాల్లో ఒక్కొక్కరికీ 50 మంది పెళ్లాలుంటారు. వాళ్లు 1050 మంది పిల్లల్ని కంటారు. ఇది వారి మత సాంప్రదాయం కూడా కాదు. ఇష్టమొచ్చినట్టు కంటూ జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా అయితే.. ఓ కుంటుంబంలో ఇద్దరు లేదా నలుగురు పిల్లలు మాత్రమే ఉంటారు. కానీ ముస్లిం కుటుంబాల్లో ఇందుకు భిన్నంగా ఉంది. అంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. సురేంద్రసింగ్ నోరు పారేసుకోవటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు నోరు జారి విమర్శలపాలయ్యారు. గతంలో హిందూ దంపతులు కనీసం ఐదుగురి పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీని ద్వారా హిందుత్వాన్ని కాపాడిన వారవుతారని ఆయన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గత మార్చి నెలలో సైతం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి అనుచిత సలహానిస్తూ పతాక శీర్షికల్లోకెక్కారు. రాహుల్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ తల్లి ఇటలీలో ఉన్నప్పుడు ఏ వృత్తిలో కొనసాగిందో, హర్యాన్వి గాయని, డ్యాన్సర్ సప్న చౌదరి కూడా అదే వృత్తిలో ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అని కామెంట్స్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాతి కాలంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై కూడా మాటల దాడికి దిగారు. మాయావతి వయస్సు 60 సంవత్సరాలు దాటినా అందంగా కనిపించడం కోసం ఫేషియల్ చేయించుకుంటుందని ఎద్దేవా చేశారు. యవ్వనంగా కనిపించడం కోసం జుట్టుకు రంగులు వేసుకుంటుందని విమర్శించారు. ఇక దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు పెరిగిపోవటానికి పిల్లల తల్లిదండ్రులు, మొబైల్ ఫోన్లే ప్రధాన కారణమంటూ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు. -
‘దీదీ రాక్షసి..అఖిలేష్ కసాయి’
లక్నో : తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ రాక్షసి, అఖిలేష్ ఓ కసాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఎస్పీతో పొత్తును బీఎస్పీ అధినేత్రి మాయావతి తెగతెంపులు చేసుకున్నారని ఆరోపించారు. లంకను సందర్శించిన హనుమంతుడిని అడ్డుకున్న రాక్షసిలా ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని రాకాసిలా దీదీ అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. యోగి ఆదిత్యానాథ్ రూపంలో దేశానికి హనుమంతుడు లభించాడని, ప్రధాని మోదీని ఇక అడ్డుకునేవారు ఎవరూ లేరని, రాక్షసులను అంతం చేసే రోజులు వచ్చాయని, విభీషణుడి యుగం మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పైనా సింగ్ విరుచుకుపడ్డారు. ఆయనను కసాయిగా బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అభివర్ణించారు. -
స్మృతీ ఇరానీ అనుచరుడి హత్య
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ కార్యకర్తపై కాల్పులు కలకలం రేపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అమేథీ నుంచి ఎంపీగా ఎంపికైన స్మృతీ ఇరానీ అనుచరుడు, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ (50)పై శనివారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేంద్ర అతని స్వగృహంలో నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సురేంద్రను లక్నో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, రాజకీయ శత్రుత్వం వల్లే హత్య జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పాడె మోసిన స్మృతీ ఇరానీ సురేంద్ర మృతి విషయం తెలియగానే స్మృతి ఇరానీ హుటాహుటిన అమేథీకి చేరుకున్నారు. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. వారిని ఓదార్చారు. రాష్ట్ర మంత్రి మోసిన్ రజా కూడా సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా స్మృతి, రజాలు సురేంద్ర పాడె మోశారు. సురేంద్ర మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విచారం వ్యక్తం చేశారు. -
కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ
-
వీడియో : కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సరేంద్రసింగ్ అంతిమయాత్రలో అమేథీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా తన భుజాలపై మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. (చదవండి : స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత) బరూలియా గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ : అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ను బరూలియ గ్రామంలో శనివారం రాత్రి దుండగలు కాల్చిచంపారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా సురేంద్ర సింగ్ స్మృతి ఇరానీకి సన్నిహితులని గ్రామస్తులు చెప్పారు. కాగా స్మృతి ఇరానీ ఆదేశాల మేరకు ఆమె తరపున స్ధానికులకు సింగ్ చెప్పులు పంపిణీ చేశారని చెబుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మెజారిటీ సంతానం
ఉత్తరప్రదేశ్ భాలియా జిల్లాలోని భైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దేశభక్తుడు. అంతేకాదు. హిందూ దేశభక్తుడు. నానా టికీ నియంత్రణ పేరిట తగ్గి పోతున్న హిందూ జనాభాకి ఆయన బాధపడి ఒక మార్గాన్ని సూచించారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తీ– హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అయిదుగురు పిల్లల్ని కనాలని. మరి ఆ అయిదుగురూ ఎవరు? ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. మరొక బిడ్డ? స్పేర్ట! అప్పుడు మెజా రిటీ హిందువులకి దక్కుతుందని వారు వాక్రుచ్చారు. జాతీయ జనాభా ప్రణాళిక ప్రకారం జనాభాను నియంత్రించే పనిని ఒక పక్క ప్రభుత్వం చేస్తుండగా సింగ్ వంటి దేశభక్తులు ‘స్పేర్’ పిల్లల్ని కని పెంచా లని సందేశాన్నిస్తున్నారు. ఇలాంటి వారికి– జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలీదు! నా పెళ్లి నాటికి మా నాయనమ్మకి 90 ఏళ్లు. ఇది 57 సంవత్సరాల కిందటిమాట. నాకు పెళ్లయి, ఆమె ఆశీర్వాదానికి వస్తే– మా ఇద్దర్నీ తడివి ‘వందమంది సంతానాన్ని’ కనమని ఆశీర్వదించింది. ఇందులో తేలికగా 50 స్పేర్లున్నాయి. అంటే సురేంద్రసింగ్ ఆలోచనా ధోరణి– 57+90 నాటిది. ఈ దేశానికి రెండో లోక్‌సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ని నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చూసేవాడిని. వారికి 14 మంది సంతానం. వారి అల్లుడు, ఆనాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు ఆత్మీయులు– కె. రామస్వామి అయ్యంగార్‌కి 18 మంది సంతానం అనుకుంటాను. స్పేర్ల ఆలోచన లేని రోజులవి. కాలాన్ని బట్టి, మారే వ్యవస్థని బట్టి, వర్తమాన జీవన సరళిని బట్టి– ఆలోచనా ధోరణిని సవరిం చుకోలేని ఎందరో సింగులు మనకి ఉత్తర దేశంలో– ముఖ్యంగా బీజేపీలో కనిపిస్తారు. బీజేపీలోనే ఎందుకు? బాలెట్ పెట్టెనుంచి, పదవి దాకా ‘పాకే’ అవకాశాన్ని– వీరి ప్రమేయం లేకుండా నరేంద్ర మోదీ అనే పెను తుఫాన్ ఇలాంటి వారికి కల్పిం చింది కనుక. ‘హిందూ’ ప్రాముఖ్యతపై వీరు చేసే ఆలోచనలకు ఇన్నాళ్లకి రోజులొచ్చాయని అనుకునే సింగులు బోలెడంతమంది ఉన్నారు. లేకపోతే ‘స్పేర్’ ఆలోచనలతో– ఇలాంటివారు– తమ మాట లని ప్రజలు వినే అర్హతని కూడా సంపాదించుకోలేక పోయేవారు. ఈ సింగు గారే– నిన్నటికి నిన్న– బీఎస్పీ నాయ కురాలు మాయావతిని గౌడు గేదెతో పోల్చారు. అప రిశుభ్రత, దుర్వాసన ఇలాంటి వాటిని ఉటంకిం చారు. చాలా అమర్యాదకరమైన, అహంకారపూరి తమైన– ఇలాంటి ప్రసంగాలు– అటు పార్టీకీ, ఇటు వ్యక్తికీ చెప్పరాని అన్యాయం చేస్తాయి. మరి వీరి ‘వాచాలత్వానికి’ అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎవరయి నా– కేంద్ర నాయకులు చేస్తున్నారా? మనకు తెలీదు. వీరు కాలదోషం పట్టిన ఊరగాయలాంటివారు. ఒక ప్పుడు ‘రుచి’గా ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు పూర్తిగా మురిగిపోయింది. ఇవాళ– ‘హిందూ మెజా రిటీకి స్పేర్ సంతానాన్ని కనే ఆలోచన– హాస్యాస్ప దమే కాక, కొంతలో కొంత ప్రమాదకరం కూడా. ఈ ఊరగాయలన్నింటినీ ఒకచోట సమావేశపరిచి– గట్టి పాఠాన్ని అమిత్ షా పీకాలని నాకనిపిస్తుంది. ఈ సందర్భంలో అతి ఉదాత్తమైన, అపురూ పమైన– జ్ఞాపకాన్ని ఉటంకించాలని మనస్సు ఆరా టపడుతోంది. చాలా దశాబ్దాల కిందట ఢిల్లీలో జరి గిన ప్రపంచ చలన చిత్రోత్సవంలో జపాన్ దేశపు చిత్రాన్ని చూశాను. ఆ ఉత్సవాలకి వచ్చే చిత్రాలు– ఆ దేశ స్థాయిలో ఉన్నవి, దేశ వైభవాన్ని చాటేవి. ప్రపం చానికి సందేశాన్నిచ్చేవి. ఈ చిత్రం ఒక దేశ భక్తుడి కథ. ఎటువంటి దేశ భక్తుడు? అప్పుడున్న రాజకీయ వాతావరణంలో తమ దేశాన్ని కాపాడే దమ్ము, శక్తి, ఆదర్శాన్ని పుణికిపుచ్చుకోగల వీరులను ప్రస్తుతం కనే అవసరం ఉందని నమ్మే ఒక వ్యక్తి. ఆనాటి యువ తరం వీర్యాన్ని పరిపుష్టం చేసే వీరవనితలను సమీక రించి– ఆనాటి యువ కిశోరాలు కొత్త తరానికి జన్మ నిచ్చే ఉద్యమాన్ని చేపట్టిన వీరుడు. ఆలోచనలో ఎక్కడా అపశ్రుతి లేదు. ఆచరణలో ఎక్కడా అప భ్రంశం లేదు. ఎంతసేపూ దేశ భవిష్యత్తు, దేశభక్తుల ఆదర్శానికి ఏ మాత్రమూ తీసిపోని– ఓ వ్యక్తి కథ. తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే చిత్రోత్సవంలో భాగం. అస్మదాదులం ఒక్క క్షణం బిత్తరపోయాం. కానీ ఆనాటి 3 గంటల చిత్రంలో ఎక్కడా ఎబ్బెట్టు తనం లేదు. సినిమా ఆద్యంతమూ కత్తిమీద సాము. ఒక్క ఫ్రేము ఎక్కువైతే కథా నాయకుడు తార్పుడు గాడు అయిపోతాడు. తూకంలో నడిస్తే దేశభక్తుడవు తాడు. ఇది దేశభక్తుడి కథ. ఒక మహర్దర్శకుని సృష్టి ఆనాటికి. న్యాయంగా ఈ కథకీ, సింగుగారి వాచాల త్వానికీ పొంతన లేదు. కానీ అపశ్రుతిని, అశ్లీలతని సమాజయోగ్యం చేసి, కళగా మలిచిన ఓ మహా దర్శ కుని కృషిని ఈ క్షణంలో గుర్తు చేసుకోవడం అసం దర్భం కాదనుకుంటాను. గొల్లపూడి మారుతీరావు -
రౌడీని దేవుడిగా కీర్తించిన బీజేపీ ఎమ్మెల్యే
లక్నో : ‘అత్యాచారాలను నివారించడం శ్రీరాముని వల్ల కూడా కాదం’టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీని చంపిన మరో గ్యాంగ్ స్టర్ సునీల్ రాతీని ‘ఉగ్రవాదాన్ని అణచిన దేవుడి’గా వర్ణించారు. కొన్నేళ్ల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన గ్యాంగ్ స్టర్ మున్నా బజరంగీ రెండు రోజుల క్రితం బాగ్పట్ జైలులో మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీ చేతిలో హత్యకు గురి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని ఎవరో ఒకరు రూపుమాపాలి. ఆ పని సునీల్ రాతీ చేశాడు. హింసను రూపుమాపడానికి భగవంతుడు ఎవరో ఒకరిని.. ఏదో ఒక సమయంలో పురమాయిస్తాడు. అలా ఈ సారి సునీల్ రాతీని ఎంచుకున్నాడు. దేవుడు సునీల్ రాతీ చేతిలో మున్నా బజరంగీ అనే ఉగ్రవాది అంతం అవ్వాలని అనుకున్నాడు. అందుకే సునీల్ రాతీ, బజరంగీని హత్య చేశాడు. కనుక హింసను రూపుమాపిన సునీల్ రాతీ భగవంతుడు. నేరస్తుల విషయంలో సాధారణ చట్టాలు ఆలస్యం చేయవచ్చు. కానీ భగవంతుడు ఆలస్యం చేయడు. అందుకే మున్నా బజరంగీని ఇంత తొందరగా అంతమొందించాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగక ఏకంగా స్వపక్షాన్ని ఇరుకున పెట్టేలా ‘జైల్లలో నియమించిన అధికారులు అవినీతిపరులు. లంచం తీసుకుని జైలు లోపలికి ఆయుధాలను అనుమతిస్తున్నారు. అందుకు సునీల్ రాతీనే ఉదాహరణ’ అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘డబ్బు ఉంటే చాలు జైలులో ఉండి కూడా ఏమైనా చేయవచ్చు. ఆఖరికి జైలు లోపలికి ఆయుధాలు కూడా తీసుకురావచ్చు. సునీల్ రాతీ అధికారులకు డబ్బు ఇచ్చి, ఆయుధాలు తెప్పించుకుని బజరంగీని అంతమొందించాడు’ అని ఆరోపించారు. బజరంగీ భార్య సీమా సింగ్ తన భర్త హత్యకు యోగి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం మున్నా కుటుంబానికి లేద’న్నారు. 2024 నాటికి భారత దేశం హిందూ రాజ్యంగా మారుతుందంటూ గతంలో సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు. అంతేకాక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రావణాసురిడి సోదరి శూర్పణకతోనూ, అధికారులను వేశ్యలతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా : బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఇటీవల తరుచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలోకి ఎక్కడం పరిపాటిగా మారింది. తాజాగా మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకంటే ప్రాస్టిట్యూట్లు(వేశ్యలే) నయమని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తూ.. మనల్ని సంతోష పరుస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాక లంచాలు అడిగిన ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు కూడా. బైరియా తహసీల్దార్ ఆఫీసులో అధికారులు లంచాలు అడిగారనే ఆరోపణలపై మండిపడ్డ సింగ్, ఈ మేర ఆదేశాలు జారీచేశారు. సింగ్ తన మద్దతుదారులతో కలిసి ‘వార్నింగ్ డే’ ను నిర్వహించారు. లంచాలు అడిగిన అధికారుల వాయిస్‌లను కూడా రికార్డు చేయాలని మద్దతుదారులను కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, వారి సంక్షేమం కోసం తాను జైలుకి వెళ్లడానికైనా సిద్దమన్నారు. సురేంద్ర సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర కామెంట్లు చేశారు. కొంతమంది మంత్రులను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీసేయాలని, లేదంటూ యూపీలో పతనం తప్పదని హెచ్చరించారు. పోలీసు స్టేషన్లలో, తహసీల్దార్ ఆఫీసుల్లో, బ్లాక్ ఆఫీసుల్లో పేద ప్రజల బాధలను వినకపోతే, వారు బీజేపీకి ఓటు వేయరన్నారు.