
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల గురించి జరిపిన అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గతంలోకన్నా ఈసారి ఎక్కువ మంది గెలుపొందారు. 2004 నుంచి 2014 వరకు కొనసాగిన ఎంపీల్లో 25 శాతం మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే అయితే, ఇప్పుడు 17వ లోక్‌సభలో వారి సంఖ్య 30 శాతానికి చేరుకున్నట్లు ‘సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటీవ్స్ ప్రాజెక్ట్’ కోసం సేకరించిన డేటాలో వెల్లడయింది.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లోనే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎక్కువ ఉంటారని అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఈసారి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి 31 శాతం మంది రాజకీయ వారసులు పోటీ చేయగా, బీజేపీ నుంచి 22 శాతం మంది పోటీ చేశారు. బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవడంతో ఆ పార్టీ తరఫునే రాజకీయ వారసులు ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెస్ తరఫున తక్కువ మంది గెలిచారు. అయితే శాతం ప్రకారం చూసుకుంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎంపీలే ఎక్కువ మందని తేలుతుంది. 303 బీజేపీ ఎంపీల్లో 75 మంది రాజకీయ వారసులుకాగా 52 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 23 మంది రాజకీయ వారసులు ఉన్నారు. ఆ తర్వాత 23 మంది డీఎంకే ఎంపీల్లో పది మంది, 22 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల్లో ఏడుగురు రాజకీయ వారసులు ఉన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన వారికంటే గెలిచిన ఎంపీల్లో రాజకీయ వారసులు ఎక్కువగా ఉన్నారు. అంటే, రాజకీయ వారసులే ఎక్కువ మంది గెలిచారన్నమాట. ఇక్కడ మరో విశేషముంది. లోక్‌సభకు మొట్టమొదటిసారి 78 మంది (14 శాతం) మహిళా ఎంపీలు ఎన్నికకాగా వారిలో రాజకీయ వారసులే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం మహిళా ఎంపీల్లో సగం మంది ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా...నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. సాధారణంగా రాజకీయ పార్టీలు రిజర్వ్‌డ్ సీట్లకే మహిళల పేర్లను ప్రతిపాదిస్తాయి. మొత్తం 78 మంది మహాళా ఎంపీల్లో 24 మంది మహిళా ఎంపీలు రిజర్వ్‌డ్ స్థానాల నుంచి విజయం సాధించిన వారే. బిజూ జనతా దళ్ నుంచి ఏడుగురు మహిళలు పోటీ చేయగా, వారిలో ఆరుగురు రిజర్వ్‌డ్ స్థానాల నుంచే పోటీ చేశారు. మొత్తం పురుష ఎంపీల్లో 15 శాతం మంది రాజకీయ కుటుంబం వారసులుకాగా, 42 శాతం మంది మహిళలు రాజకీయ కుటుంబం వారసులు.
Comments
Please login to add a commentAdd a comment