రుణపడి ఉంటా
పులివెందుల, న్యూస్‌లైన్ : సుమారు 75వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించిన పులివెందుల ఓటర్లకు వందనం.. రాష్ట్రస్థాయిలో రికార్డు మెజార్టీతో మరోమారు పులివెందుల పేరును చరిత్రలో నిలిపినందుకు ధన్యవాదాలు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి పులివెందులలోని బాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. పులివెందుల ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగభరితంగా అన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల ప్రజలు అండగా ఉంటున్నార న్నారు.
ఉదయం నుంచి తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కొందరిని పేర్లతో పిలుస్తూ.. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డిలతో వైఎస్ జగన్ చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు :
పులివెందులలోని స్వగృహంలో ఉన్న వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ పక్షనేత వైఎస్ జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికాార్జునరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తదితరులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమస్యలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు చర్చించుకున్నారు. కమలాపురం నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డిలు వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు.
అభినందనలు తెలిపిన స్థానికులు :
క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పులివెందులకు చెందిన కార్యకర్తలు, నాయకులు, స్థానికులు వచ్చి అభినందనలు తెలియజేశారు. సుమారు 75వేలపైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అభినందనలతో ముంచెత్తారు. పులివెందులోని దినేష్ మెడికల్ సెంటర్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లుగా పనిచేస్తున్న రణధీర్‌రెడ్డి, జ్యోతి, సూపర్‌వైజర్ కనకరత్నమ్మ, ఆనంద్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌కు పుష్ప గుచ్చాలతోపాటు పూల బొకేలను అందించి అభినందనలు తెలియజేశారు.
మండలాల నాయకులతో మాటామంతి :
ఈ మధ్యనే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియటంతో ఏడు మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిశారు. సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, వేముల, పులివెందుల, లింగాల మండలాల కన్వీనర్లు, పరిశీలకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, వేల్పుల రాము, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, బలరామిరెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు వరప్రసాద్, చిన్నప్ప, కోడి రమణ, నూరుల్లా, సాతుపాటి వెంకటపతి, రామ లలిత, హేమలత, అ రుణకుమారి, కోళ్ల భాస్కర్, రామనాథ్ తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు.
చర్చిలో వివాహానికి హాజరైన వైఎస్ జగన్ :
పులివెందులలోని నగరిగుట్టకు చెందిన దేవదానం(దానమయ్య) వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో వివాహం జరుగుతున్న నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి గురువారం మధ్యాహ్నం నేరుగా చర్చికి చేరుకుని నూతన వధూవరులు దేవదానం, కెజియాలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీ వించారు. అనంతరం చర్చి బయట వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు జనాలు ఆరాటపడ్డారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా పులివెందుల అర్బన్, రూర ల్ సీఐలు భాస్కర్, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
భారీగా వచ్చిన జనం :
వైఎస్ జగన్‌ను కలిసేందుకు గురువారం వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలి వచ్చిన జనాలతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. అభిమాన నేతను కలుసుకునేందుకు తరలి వచ్చిన జనాలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.