న్యూఢిల్లీ: రెండుసార్లు ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సీఆర్ పాటిల్ గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో రికార్డు మెజారిటీకి చేరువగా వచ్చారు. గుజరాత్‌లోని నవ్సారీ లోక్‌సభ స్థానంనుంచి ఆయన 6.89 లక్షల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. 2014లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపినాథ్ ముండే మరణంతో ఖాళీ అయిన బీడ్ స్థానంనుంచి ప్రీతమ్‌ముండే 6.96 లక్షల మెజారిటీ సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు మెజారిటీగా ఉంది. సీఆర్‌పాటిల్‌తో పాటు బీజేపీ నుంచి ఆరు లక్షల మెజారిటీ క్లబ్‌లో సంజయ్ భాటియా, క్రిష్ణపాల్, సుభాష్‌చంద్ర బెహరియా కూడా ఉన్నారు. మరో డజనుపైగా ఎంపీలు ఐదులక్షలకు మించి మెజారిటీ సాధించారు.
వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల మెజారిటీ సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసి 5.57 లక్షల మెజారిటీ సాధించారు. గతంలో ఇదే స్థానంలో పార్టీ సీనియర్ నేత అద్వానీ 4.83 లక్షల ఓట్లు సాధించారు. ఇక హర్యానాలోని కర్నాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంజయ్‌భాటియా 6.56 లక్షల ఓట్లు సాధించారు. అదే పార్టీకి చెందిన ఫరీదాబాద్ అభ్యర్థి క్రిష్ణపాల్ 6.38 లక్షల ఓట్లు సాధించడం విశేషం.
అత్యల్ప ‘రికార్డులు’ఇవే
181 ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి
ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భోలేనాథ్ తన ప్రత్యర్థి, బీఎస్‌పీకి చెందిన త్రిభువన్‌రామ్‌పై 181 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇక లక్షద్వీప్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హమీదుల్లా సయీద్‌పై 823 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అండమాన్ నికోబాల్ స్థానం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌కు చెందిన కుల్దీప్‌రాయ్‌శర్మ, తన ప్రత్యర్థి, బీజేపీ చెందిన విశాల్ జోషిపై 1,407 ఓట్లతో విజయం సాధించారు. బిహార్‌లోని జనహాబాద్ స్థానం నుంచి జేడీ (యూ) నుంచి విజయం సాధించిన చండేశ్వర్ ప్రసాద్, ఆర్జే డీ నుంచి పోటీ చేసిన సురేంద్ర ప్రసాద్ యాదవ్‌పై 1,075 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment