Election 2019 Trivia
-
ఆ నోటా ఈ నోటా
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే... ► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే. ► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది. ► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది. ► ఈ నోటాఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది. -
ఈసారి రికార్డు 6.89 లక్షలు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సీఆర్ పాటిల్ గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో రికార్డు మెజారిటీకి చేరువగా వచ్చారు. గుజరాత్‌లోని నవ్సారీ లోక్‌సభ స్థానంనుంచి ఆయన 6.89 లక్షల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. 2014లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపినాథ్ ముండే మరణంతో ఖాళీ అయిన బీడ్ స్థానంనుంచి ప్రీతమ్‌ముండే 6.96 లక్షల మెజారిటీ సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు మెజారిటీగా ఉంది. సీఆర్‌పాటిల్‌తో పాటు బీజేపీ నుంచి ఆరు లక్షల మెజారిటీ క్లబ్లో సంజయ్ భాటియా, క్రిష్ణపాల్, సుభాష్‌చంద్ర బెహరియా కూడా ఉన్నారు. మరో డజనుపైగా ఎంపీలు ఐదులక్షలకు మించి మెజారిటీ సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల మెజారిటీ సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసి 5.57 లక్షల మెజారిటీ సాధించారు. గతంలో ఇదే స్థానంలో పార్టీ సీనియర్ నేత అద్వానీ 4.83 లక్షల ఓట్లు సాధించారు. ఇక హర్యానాలోని కర్నాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంజయ్‌భాటియా 6.56 లక్షల ఓట్లు సాధించారు. అదే పార్టీకి చెందిన ఫరీదాబాద్ అభ్యర్థి క్రిష్ణపాల్ 6.38 లక్షల ఓట్లు సాధించడం విశేషం. అత్యల్ప ‘రికార్డులు’ఇవే 181 ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భోలేనాథ్ తన ప్రత్యర్థి, బీఎస్పీకి చెందిన త్రిభువన్‌రామ్‌పై 181 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇక లక్షద్వీప్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హమీదుల్లా సయీద్‌పై 823 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అండమాన్ నికోబాల్ స్థానం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌కు చెందిన కుల్దీప్‌రాయ్‌శర్మ, తన ప్రత్యర్థి, బీజేపీ చెందిన విశాల్ జోషిపై 1,407 ఓట్లతో విజయం సాధించారు. బిహార్‌లోని జనహాబాద్ స్థానం నుంచి జేడీ (యూ) నుంచి విజయం సాధించిన చండేశ్వర్ ప్రసాద్, ఆర్జే డీ నుంచి పోటీ చేసిన సురేంద్ర ప్రసాద్ యాదవ్‌పై 1,075 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. -
కీర్తి ఆజాద్‌కు తప్పని ఓటమి
ధన్‌బాద్: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ లోక్‌సభ నియోజకం వర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఘోర పరాజయం చవిచూశారు. బీజేపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ పశుపతినాథ్ సింగ్ చేతిలో కీర్తి ఆజాద్ సుమారు నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆజాద్ మూడోసారి లోక్‌సభకు పోటీ చేయగా, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున దర్భాంగా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పశుపతినాధ్ సింగ్ ఎనిమిది లక్షలకు పైగా ఓట్లు సాధించగా, కీర్తి ఆజాద్ మూడు లక్షల నలభై వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ బీజేపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 1990 నుంచి ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయం సాధించింది. బీజేపీ నుంచి ఫిరాయించిన కీర్తి ఆజాద్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించినప్పటికీ బీజేపీ ప్రభంజనం ముందు ఆయనకు ఓటమి తప్పలేదు. నాలుగేళ్ల క్రితం బీజేపీ నుంచి కీర్తి ఆజాద్ సస్పెన్షన్ గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించడంతో ఆయనపై వేటు పడింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2016లో ఆజాద్ భార్య పూనమ్ ఆప్ పార్టీలో చేరగా, 2017,ఏప్రిల్‌లో ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1980 నుంచి 1986 వరకూ భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన ఆజాద్..1983లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆయన 7 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. -
పొలిటికల్ రింగ్‌లో విజేందర్ ఘోర ఓటమి
ఢిల్లీ: తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజేందర్ సింగ్.. పొలిటికల్ రింగ్‌లో మాత్రం ఘోర ఓటమి చవిచూశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచిన విజేందర్ సింగ్ ఎటువంటి పోటీ ఇవ్వకుండా పరాజయం పాలయ్యారు. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన విజేందర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం లక్షా అరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది ఓట్లకు మాత్రమే పరిమితమైన విజేందర్ సింగ్ ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ ఘన విజయం సాధించారు. రమేష్ బిధూరీ 6, 83, 578 ఓట్లు సాధిస్తే, ఆప్ నుంచి పోటీ చేసిన రాఘవ్ చాధా 3,18, 584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా విజేందర్ తనదైన మార్కును చూపెట్టారు. వరుసగా పది బాక్సింగ్ ఫైట్లలో విజయం సాధించడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇందులో 7 విజయాల్ని నాకౌట్ రూపంలో సాధించడం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్కు హర్యాన ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. రాజకీయాల్లోకి రావడంతో ఆయన తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్న విజేందర్... 2014లో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశారు. ఫగ్లీ సినిమా ద్వారా వెండితెరకు ఈ బాక్సర్ పరిచయయమ్యారు. అక్షయ్ కుమార్, అశ్విని యార్డిల సొంత ప్రొడక్షన్ గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం యావరేజ్ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక 2015 అక్టోబర్‌లో తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలిచిన విజేందర్.. తాజాగా రాజకీయ పంచ్ విసురుదామనుకుని బరిలోకి దిగినప్పటికీ ఆయన ఆశలు ఫలించలేదు. -
రాజ్యవర్థన్ రాజసం
జైపూర్: కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మరోసారి ఘన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్తాన్ లోని జైపూర్ రూరల్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన రాజ్యవర్థన్ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ గెలుపును అందుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యవర్థన్ సింగ్ ఎనిమిది లక్షల పదకొడు వేలకు పైగా ఓట్లు సాధించి అఖండ విజయం సాధిస్తే, కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మాజీ అథ్లెట్ కృష్ణ పూనియా నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానానికే పరిమితమయ్యారు. వీరిద్దరే మధ్య ప్రధాన పోటీ జరగగా రాజ్యవర్థన్ తన గత మెజారిటీని మరింత పెంచుకోవడం విశేషం. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. క్రీడామంత్రిగా సేవలందించిన రాజ్యవర్థర్.. బికనీర్ లోని రాజ్‌ఫుత్ వంశానికి చెందిన వారు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున తొలి రజత పతకం సాధించిన క్రీడాకారిణుగా ఘనత సాధించారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్.. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు. మొత్తంగా 25 అంతర్జాతీయ పతకాలను రాజ్యవర్థన్ సాధించారు.పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్.. ఇప్పుడు దేశానికి క్రీడా మంత్రిగా పని చేశారు. ఫలితంగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. రాజ్యవర్థన్పై కాంగ్రెస్ తరఫున పోటికి దిగిన కృష్ణ పూనియా మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. -
రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ
తన గ్లామర్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఊపేసిన ఊర్మిళ మతోండ్కర్ ఈ జనరల్ ఎలక్షన్స్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే తొలి ప్రయత్నం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఉత్తర ముంబై నుంచి పోటి చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య శెట్టి కన్నా నాలుగున్న లక్షల ఓట్ల వెనకపడ్డారు. దీంతో ఓటమిని అంగీకరించిన ఊర్మిళ.. ‘ఇది తొలి అడుగు మాత్రమే ఓడిపోయినా రాజకీయాల్లో కొనసాగుతా’ అన్నారు. సినీ రంగ ప్రముఖులు ఎక్కువగా బీజేపీకి జై కొడుతుంటే ఊర్మిళ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఊర్మిళ ముంబై నార్త్ నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి ప్రయత్నంలో బలమైన బీజేపీ నేత గోపాల్ చినయ్య శెట్టితో ఆమె తలపడ్డారు. గత ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధించిన ఆయన ఈ సారి కూడా అదే స్థాయిలో ఘనవిజయాన్ని అందుకున్నారు. -
రాజకీయ అరంగేట్రంలోనే భారీ విజయం
ఢిల్లీ: రాజకీయ అరంగేట్రంలోనే భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ భారీ విజయం సాధించారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన గంభీర్ మూడు లక్షల తొంబై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం నమోదు చేశారు. గంభీర్‌కు సుమారు ఆరు లక్షల తొంభై వేలకు పైగా ఓట్లు వస్తే, ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత అరవిందర్ సింగ్ లవ్లీ మూడు లక్షల నాలుగు వేల భారీ ఓట్లతో వెనుకబడి పరాజయం చవిచూశారు. ఇక ఆప్ అభ్యర్థి అతీషి రెండు లక్షలకు పైగా ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంభీర్ స్థానికుడు కాకపోయినా ఆయనపై ఓటర్లు నమ్మకం ఉంచారు. ప్రధానంగా తనకున్న వ్యక్తిగత స్టార్డమ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గంభీర్‌కు కలిసొచ్చింది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంలో ముందు వరుసలో ఉండే గంభీర్ తన విజయంపై ఆది నుంచీ నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అరవింద్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రెస్‌కు చేరడం కూడా గంభీర్ ప్రధానంగా కలిసొచ్చిన అంశగా చెప్పాలి. గంభీర్ ఘన విజయంపై వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్‌లు అభినందనలు తెలియజేశారు. ‘ ఈ మెగా విజయంపై నీకు ఇవే శుభాకాంక్షలు. ప్రజలు ఆశలయాలకు అనుగుణంగా పని చేస్తావని ఆశిస్తున్నా’ అని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, నా బ్రదర్ గంభీర్ సాధించిన ఘన విజయానికి అభినందనలు’ అని భజ్జీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. క్రికెట్లో తనదైన ముద్ర వేసిన గౌతం గంభీర్ రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరిని బీజేపీ పక్కన పెట్టి.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం.. స్థానికుడు కాకపోవడం ఆయనకు మైనస్‌గా తొలుత అనుకున్నప్పటికీ తనకున్న వ్యక్తిగత స్టార్డమ్తో పాటు దేశ భద్రత, మోదీ కరిష్మాపైనే గంభీర్ ఘన విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన అరవింద్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రె్‌సకు చేరడంతో ఆయనపై వ్యతిరేకత కూడా గంభీర్‌కు కలిసొచ్చింది. ‘రెండు ఫైనల్స్’ హీరో! 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్లో 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు... 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు... నాలుగేళ్ల వ్యవధిలో భారత జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన సందర్భాల్లో గౌతం గంభీర్ పోషించిన పాత్ర క్రికెట్ అభిమానులు మరచిపోలేనిది. ఈ రెండు టోర్నీల తుది పోరులో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గావస్కర్ తర్వాత భారత అత్యుత్తమ ఓపెనర్ గంభీరే అంటూ సహచరుడు సెహ్వాగ్ నుంచి ప్రశంసలు అందుకున్న గౌతీ మూడు ఫార్మాట్లలో కూడా ఓపెనర్‌గా రాణించడం విశేషం. టీమిండియా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. మైదానంలో ఎక్కడా వెనక్కి తగ్గని అతని దూకుడైన శైలి కూడా క్రికెట్ ప్రపంచానికి సుచిరపరిచితం. ఈ ఏడాది గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్.. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు. -
జయప్రద ఓటమి
రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన సీనియర్ హీరోయిన్ జయప్రద ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని రామ్‌పూర్ నుంచి బరిలో నిలిచిన జయప్రదపై ఆమె సమీప ప్రత్యర్థి, సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్ లక్ష 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. తెలుగు, హిందీ సినిమాలతో నటిగా తార స్థాయిని అందుకొని తరువాత జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముంద్ర వేసిన సీనియర్ నటి జయప్రద. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయప్రద తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ సమాజ్ వాది పార్టీలో చేరి రెండు సార్లు ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలు రావటంతో అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని స్థాపించారు. 2011లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన ఈ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. తరువాత కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన జయప్రద అడపాదడపా సినిమాల్లో నటించారు. మూడేళ్ల విరామం తరువాత అమర్ సింగ్‌తో కలిసి ఆర్ఎల్డీ పార్టీలో చేరిన జయప్రద 2014 జనరల్ ఎలక్షన్స్‌లో బిజ్నూర్ నియోజిక వర్గం నుంచి లోక్‌సభకు పోటి చేసి ఓడిపోయిన ఆమె 2019 జనరల్ ఎలక్షన్స్ కు ముందుకు బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోసారి రామ్‌పూర్ నుంచి పోటిచేసి ఓటమి పాలయ్యారు. -
నిజం గెలిచింది : నటుడు రవికిషన్
బహు భాషా నటుడు, భోజ్‌పురి హీరో రవికిషన్ 2019 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ బరిలో దిగారు. 2014లో కాంగ్రెస్‌పార్టీ తరుపున జౌన్సూర్ నుంచి బరిలో నిలిచిన రవికిషన్, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటి చేశారు. దాదాపు 3 లక్షలకు పైగా మేజార్టీతో ఘన విజయం సాధించారు. 1998 నుంచి 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ప్రస్తుత ఎలక్షన్లలోనూ రవికిషన్ తరుపున ప్రచార బాధ్యతను కూడా యోగినే తీసుకున్నారు. దీంతో రవికిషన్ గెలుపు మరింత సులువైంది. అయితే రవికిషన్ గోరఖ్‌పూర్ వాస్తవ్యూడు కాకపోవటంతో కాస్త తొలుత కాస్త ప్రతికూలత వాతావరణం కనిపించిన చిరవకు ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో పోటి చేసిన సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో డిగ్రీ పట్టభద్రుడిగా పేర్కొన్న రవికిషన్ ఈ ఎన్నికల్లో మాత్రం తాను ఇంటర్మీడియట్ పాసైనట్టుగా అఫిడవిట్ దాఖలు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే అన్ని అడ్డంకులను చేధించిన 3,01,664 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రవికిషన్ నిజం గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. -
పనిచేయని సురేష్ గోపి స్టార్ ఇమేజ్
మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగారు. త్రిస్సూర్ నుంచి తన స్టార్ ఇమేజ్ను నమ్ముకొని పోటి చేసిన సురేష్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సురేష్ గోపి ఈ సారి త్రిస్సూర్ నుంచి లోకసభ బరిలో అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. విద్యార్థి నాయకుడిగా సీపీయం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ తరపున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఎన్నికల్లో సురేష్ గోపికి ప్లస్ అవుతుందని భావించారు. 2006 ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన సురేష్ గోపి, ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో నిలిచారు. సురేష్ గోపికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్, సీపీఐ అభ్యర్థి రాజాజీ మాథ్యూ థామస్‌ల నుంచి గట్టిపోటి ఎదురైంది. ముందుగా త్రిస్సూర్ నుంచి తుషార్‌ను బరిలో దించాలని భావించిన బీజేపీ చివరి నిమిషంలో తుషార్‌ను వాయ్‌నాడ్ నుంచి, సురేష్ గోపిని త్రిస్సూర్ నుంచి బరిలో నిలిపారు. -
వైఎస్ జగన్ ఘనవిజయం.. ‘యాత్ర 2’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. వైఎస్ జగన్ విజయం ఖాయమైపోవటంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సుధీర్ బాబు, రవితేజ లాంటి సినీ హీరోలు కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇక దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వీ రాఘవ కూడా వైఎస్ఆర్సీపీ సునామీపై స్పందించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘మీరు భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు యాత్ర 2 (#Yatra2) అనే ట్యాగ్‌ను కూడా జోడించారు. Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. :) #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh — Mahi Vraghav (@MahiVraghav) 23 May 2019 Congratulations to the youngest CM of AP @ysjagan garu. Looking forward for good Governance...wishing you all the good luck🙏 — Ravi Teja (@RaviTeja_offl) 23 May 2019 Congratulations @ysjagan garu. The people of Andhra Pradesh have given you both, the victory and the responsibility. Sending my best wishes. Let's all work together for a greater AP. #APElectionResults2019 — Sudheer Babu (@isudheerbabu) 23 May 2019 -
ముఖ్యమంత్రి తనయుడి ఓటమి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుమలత ఈ ఎలక్షన్లలో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించారు. అంబరీష్ మరణంతో రాజకీయ తెర మీదకు వచ్చిన సుమలత, తన భర్త పోటి చేసిన మాండ్య నియోజిక వర్గం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పోత్తు కారణంగా మాండ్య సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు వదిలేసింది. అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, యువ హీరో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో నిలిచాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. కన్నడ చిత్రసీమలోని స్టార్ హీరోలంతా సుమలతకు మద్ధతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. అంబరీష్ పై ఉన్న అభిమానంతో పాటు సింపతీ కూడా కలిసి రావటంతో సుమలత ఘన విజయం సాధించారు. అధికార పార్టీ నిఖిల్ ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని తిప్పి కొట్టి సుమలత విజయం సాధించారు. -
భారీ విజయం దిశగా గంభీర్
ఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచిన భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన గంభీర్.. ప్రత్యర్థి నేతలకు అందనంత మెజార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం గంభీర్‌కు ఐదు లక్షల పైచిలుకు ఓట్లు రాగా, అతని సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్ లవ్లీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తారని భావించిన లవ్లీ పెద్దగా ప్రభావంగా చూపలేదు. ఇక ఆప్ అభ్యర్థి అతీషి లక్షా డబ్బై వేల ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. దాంతో గంభీర్ ఘన విజయం ఖాయంగా కనబడుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంభీర్ స్థానికుడు కాకపోయినా ఆయనపై ఓటర్లు నమ్మకం ఉంచారు. తనకున్న వ్యక్తిగత స్టార్డమ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గంభీర్‌కు కలిసొచ్చింది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంలో ముందు వరుసలో ఉండే గంభీర్ తన విజయంపై ఆది నుంచీ నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అరవింద్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రెస్‌కు చేరడం కూడా గంభీర్ ప్రధానంగా కలిసొచ్చిన అంశగా చెప్పాలి. -
కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడిన ప్రకాష్ రాజ్ కనీస పోరాటపటిమ చూపించలేకపోయారు. ఈ స్థానం నుంచి పోటి చేసిన బీజేపీ అభ్యర్థి 6 లక్షలకు పైగా ఓట్లు సాధించగా ప్రకాష్ రాజ్‌కు కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు. లెక్కింపు పూర్తి కాకముందే తన ఓటమి గురించి తెలుసుకున్న ప్రకాష్ రాజ్ కౌటింగ్ కేంద్ర నుంచి వెళ్లిపోయారు. ఫలితాలపై ట్విటర్లో స్పందించారు. ‘బలమైన చెంపదెబ్బ.. ఇక నాపై మరిన్ని అవమానాలు, ట్రోల్స్ వస్తాయి. అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. సెక్యులర్ ఇండియా కోసం నా పోరాటం కొనసాగుతుంది. ముందున్నదంతా కఠిన ప్రయాణం’ అంటూ ట్వీట్ చేశారు. గత పదేళ్లుగా పీసీ మోహన్ బెంగళూరు సెంట్రల్ ఎంపీగా కొనసాగుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న రిజ్వాన్ అర్షద్‌కు 5 లక్షల 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. తన స్నేహితురాలు, జర్నలిస్ట్ అయిన గౌరీ లంకేష్ హత్య విషయంలో తీవ్రంగా స్పందించిన ప్రకాష్ రాజ్, గౌరీ హత్య తరువాతే తనలో సామాజిక బాధ్యత మరింత పెరిగిందంటు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే తొలి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌ను ప్రజలు తిరస్కరించారు. a SOLID SLAP on my face ..as More ABUSE..TROLL..and HUMILIATION come my way..I WILL STAND MY GROUND ..My RESOLVE to FIGHT for SECULAR INDIA will continue..A TOUGH JOURNEY AHEAD HAS JUST BEGUN ..THANK YOU EVERYONE WHO WERE WITH ME IN THIS JOURNEY. .... JAI HIND — Prakash Raj (@prakashraaj) 23 May 2019 -
నగరిలో రోజా వికాసం
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ దిశగా వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. సగానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 150కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రాలు సత్తా చాటుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీల తప్పుడు అంచనాలు, లెక్కలకు ధీటుగా ఆమె దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా మెజారిటీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్ హవాతో ఎంపీల పరంగా దేశంలోనే అదిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించనుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఇక జనసేన ప్రభావమే లేకుండా పోయింది. -
పొలిటికల్ పిచ్ అచ్చా హై.. ఆట షురూ
ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ ఒలింపిక్స్ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున డిస్క్ త్రోయర్ కృష్ణ పునియా పోటీ చేస్తుండగా, బీజేపీ.. ప్రముఖ షూటర్ రాజ్యవర్థన్‌సింగ్ రాథోర్‌ను నిలబెట్టింది. రాథోర్ ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. పునియా సదల్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. కాగా, ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన గౌతమ్.. అక్కడ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల బరిలో దింపడంతో పాటు గౌతమ్‌ను స్టార్ ప్రచారకర్తగా కూడా ఉపయోగించుకోవాలని, న్యూస్ చానళ్లలో ఆయన ద్వారా ప్రచారం చేయించాలని కూడా కమలనాథులు ఆలోచిస్తున్నారు. గతంలో కూడా వివిధ క్రీడల్లో రాణించిన పలువురు క్రీడాకారులు రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నించారు. వారిలో కొందరు పొలిటికల్ ప్లేగ్రౌండ్‌లో కూడా చెలరేగి విజేతలుగా నిలిస్తే మరి కొందరు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించినా నెగ్గుకురాలేక ‘డకౌట్’ అయిపోయారు. కీర్తి ఆజాద్ : కాంగ్రెస్‌లోకి జంపింగ్ 1973లో వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ముఖ్యుడైన కీర్తి ఆజాద్ 1993లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ 1998లో బిహార్‌లోని దర్బంగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా ఆయన దర్బంగా నుంచి నెగ్గారు. గత నెలలో ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. సిద్ధూ : హ్యాట్రిక్ వీరుడు క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన సిద్ధూ ఇప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దేశం తరఫున 50 టెస్ట్ మ్యాచ్‌లు, 100 వన్డేలు ఆడటమే కాక అంతర్జాతీయ క్రికెట్లో 7 వేల పరుగులు చేసి రికార్డు నెలకొల్పారు. సిద్ధూ తండ్రి భగవంత్ సింగ్ కూడా క్రికెటరే. ఆయన పాటియాలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. సిద్ధూ తల్లి నిర్మల కూడా రెండుసార్లు కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక సిద్ధూ బీజేపీ తరఫున మూడుసార్లు (2004, 2007, 2009) అమృతసర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొద్ది కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2007లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. మహ్మద్ అజహరుద్దీన్ : ఒక గెలుపు.. ఒక ఓటమి వరసగా మూడు వరల్డ్ కప్ పోటీల్లో ఆడిన భారత క్రికెటర్ అజహరుద్దీన్.. అప్పట్లో దేశంలోని గొప్ప క్రికెట్ కెప్టెన్లలో ఒకరిగా పేరొందారు. 2009లో ఆయన యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2014లో రాజస్తాన్‌లోని టాంక్ సవాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. దిలీప్ తిర్కే : తిరిగి వెనక్కే.. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన దిలీప్ తిర్కే మూడు ఒలింపిక్స్ సహా 400కుపైగా అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివాసీ అయిన దిలీప్ 2012లో ఒడిశా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో సుందర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, బీజేడీ అభ్యర్థి జాల్ ఓరమ్ చేతిలో ఓడిపోయారు. రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ : తప్పని గురి లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకున్న రాథోర్ సైన్యంలో పని చేసేవారు. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జైపూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత సీపీ జోషిపై గెలిచారు. 2017లో మోదీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా రాథోర్ జైపూర్ రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రసూన్ బెనర్జీ : ఫస్ట్ ‘పొలిటికల్ ఫుట్‌బాలర్’ భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ పార్లమెంటులో అడుగుపెట్టిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆయన 2013లో హౌరా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ తరఫున పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. జ్యోతిర్మయి సిక్దర్ : అలుపెరగని పరుగు పరుగుల రాణి అయిన జ్యోతిర్మయి దేశంలో గుర్తింపు పొందిన అథ్లెట్. 1998 ఆసియా క్రీడల్లో ఆమె రెండు బంగారు పతకాలు సాధించారు. 2004లో రాజకీయాల్లో చేరిన జ్యోతిర్మయి బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. పెవీలియన్‌కు చేరిన పాలిటిక్స్ మహ్మద్ కైఫ్ : రన్నౌట్ మాజీ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన కైఫ్ భారత క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే, రాజకీయ మైదానంలో మాత్రం నెగ్గుకు రాలేకపోయారు. 2014లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్ నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన రాజకీయాలను వదిలేశారు. బాయిచుంగ్ భుటియా : ‘గోల్’ పడలేదు భారత ఫుట్‌బాల్ జట్టుకు పదేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న భుటియా వంద మ్యాచ్‌లు ఆడారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు మూడు సార్లు దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్పు గెలుచుకుంది. 2014లో డార్జిలింగ్ నుంచి తృణమూల్ టికెట్‌పై పోటీ చేశారు. 2016లో సిలిగురి నుంచి బరిలో దిగారు. అయితే, రెండుసార్లూ ఆయన పరాజయం పాలయ్యారు. గతేడాది ఆయన హంరో సిక్కిం పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన గ్యాంగ్‌టక్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఎంఏకే పటౌడి: రాజకీయాల్లో ‘అవుట్’ టైగర్ పటౌడీగా సుపరిచితులైన మన్సూర్ అలీఖాన్ పటౌడీ 21 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారు. 1971లో గుర్గావ్ నుంచి, 1991లో భోపాల్ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండుసార్లూ కూడా విజయం సాధించలేకపోయారు. కృష్ణ పునియా : ఓడిన చోటే గెలుపు ప్రస్తుతం సదల్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో డిస్క్ త్రోలో బంగారు పతకం సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచారు. 2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో కంచు పతకం సాధించారు. 2013 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సదల్‌పూర్‌లో పోటీచేసి ఓడిపోయారు. ఐదేళ్ల తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచే గెలిచారు.