
జైపూర్: కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మరోసారి ఘన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్తాన్ లోని జైపూర్ రూరల్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన రాజ్యవర్థన్ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ గెలుపును అందుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యవర్థన్ సింగ్ ఎనిమిది లక్షల పదకొడు వేలకు పైగా ఓట్లు సాధించి అఖండ విజయం సాధిస్తే, కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మాజీ అథ్లెట్ కృష్ణ పూనియా నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానానికే పరిమితమయ్యారు. వీరిద్దరే మధ్య ప్రధాన పోటీ జరగగా రాజ్యవర్థన్ తన గత మెజారిటీని మరింత పెంచుకోవడం విశేషం.
షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. క్రీడామంత్రిగా సేవలందించిన రాజ్యవర్థర్.. బికనీర్ లోని రాజ్ఫుత్ వంశానికి చెందిన వారు.
2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున తొలి రజత పతకం సాధించిన క్రీడాకారిణుగా ఘనత సాధించారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్.. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు.
మొత్తంగా 25 అంతర్జాతీయ పతకాలను రాజ్యవర్థన్ సాధించారు.పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్.. ఇప్పుడు దేశానికి క్రీడా మంత్రిగా పని చేశారు. ఫలితంగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. రాజ్యవర్థన్‌పై కాంగ్రెస్ తరఫున పోటికి దిగిన కృష్ణ పూనియా మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.