ధన్‌బాద్: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ లోక్‌సభ నియోజకం వర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఘోర పరాజయం చవిచూశారు. బీజేపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ పశుపతినాథ్ సింగ్ చేతిలో కీర్తి ఆజాద్ సుమారు నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆజాద్ మూడోసారి లోక్‌సభకు పోటీ చేయగా, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున దర్భాంగా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పశుపతినాధ్ సింగ్ ఎనిమిది లక్షలకు పైగా ఓట్లు సాధించగా, కీర్తి ఆజాద్ మూడు లక్షల నలభై వేల పైచిలుకు ఓట్లు మాత‍్రమే సాధించి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ బీజేపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 1990 నుంచి ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయం సాధించింది. బీజేపీ నుంచి ఫిరాయించిన కీర్తి ఆజాద్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించినప్పటికీ బీజేపీ ప్రభంజనం ముందు ఆయనకు ఓటమి తప్పలేదు.
నాలుగేళ్ల క్రితం బీజేపీ నుంచి కీర్తి ఆజాద్ సస్పెన్షన్ గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించడంతో ఆయనపై వేటు పడింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2016లో ఆజాద్ భార్య పూనమ్ ఆప్ పార్టీలో చేరగా, 2017,ఏప్రిల్‌లో ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1980 నుంచి 1986 వరకూ భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన ఆజాద్..1983లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆయన 7 టెస్టులు, 25 వన్డేలు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment