ఢిల్లీ: రాజకీయ అరంగేట్రంలోనే భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ భారీ విజయం సాధించారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన గంభీర్ మూడు లక్షల తొంబై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం నమోదు చేశారు. గంభీర్‌కు సుమారు ఆరు లక్షల తొంభై వేలకు పైగా ఓట్లు వస్తే, ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత అరవిందర్ సింగ్ లవ్లీ మూడు లక్షల నాలుగు వేల భారీ ఓట్లతో వెనుకబడి పరాజయం చవిచూశారు. ఇక ఆప్ అభ్యర్థి అతీషి రెండు లక్షలకు పైగా ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంభీర్ స్థానికుడు కాకపోయినా ఆయనపై ఓటర్లు నమ్మకం ఉంచారు. ప్రధానంగా తనకున్న వ్యక్తిగత స్టార్‌డమ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గంభీర్‌కు కలిసొచ్చింది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంలో ముందు వరుసలో ఉండే గంభీర్ తన విజయంపై ఆది నుంచీ నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అరవింద్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రెస్‌కు చేరడం కూడా గంభీర్ ప్రధానంగా కలిసొచ్చిన అంశగా చెప్పాలి. గంభీర్ ఘన విజయంపై వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్‌లు అభినందనలు తెలియజేశారు. ‘ ఈ మెగా విజయంపై నీకు ఇవే శుభాకాంక్షలు. ప్రజలు ఆశలయాలకు అనుగుణంగా పని చేస్తావని ఆశిస్తున్నా’ అని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, నా బ్రదర్ గంభీర్ సాధించిన ఘన విజయానికి అభినందనలు’ అని భజ్జీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన గౌతం గంభీర్ రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరిని బీజేపీ పక్కన పెట్టి.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం.. స్థానికుడు కాకపోవడం ఆయనకు మైనస్‌గా తొలుత అనుకున్నప్పటికీ తనకున్న వ్యక్తిగత స్టార్‌డమ్‌తో పాటు దేశ భద్రత, మోదీ కరిష్మాపైనే గంభీర్ ఘన విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన అరవింద్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రె్‌సకు చేరడంతో ఆయనపై వ్యతిరేకత కూడా గంభీర్‌కు కలిసొచ్చింది.
‘రెండు ఫైనల్స్’ హీరో!
2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్లో 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు... 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు... నాలుగేళ్ల వ్యవధిలో భారత జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన సందర్భాల్లో గౌతం గంభీర్ పోషించిన పాత్ర క్రికెట్ అభిమానులు మరచిపోలేనిది. ఈ రెండు టోర్నీల తుది పోరులో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గావస్కర్ తర్వాత భారత అత్యుత్తమ ఓపెనర్ గంభీరే అంటూ సహచరుడు సెహ్వాగ్ నుంచి ప్రశంసలు అందుకున్న గౌతీ మూడు ఫార్మాట్‌లలో కూడా ఓపెనర్‌గా రాణించడం విశేషం. టీమిండియా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. మైదానంలో ఎక్కడా వెనక్కి తగ్గని అతని దూకుడైన శైలి కూడా క్రికెట్ ప్రపంచానికి సుచిరపరిచితం. ఈ ఏడాది గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్.. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment