
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా వెల్లడి అయ్యాయి. దీంతో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంత ఖచ్చితత్వంతో వాస్తవ రూపం దాల్చాయని పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యాలను పరిశీలిస్తే.. ఎన్డీయే 347, యూపీఏ 90, ఇతరులు 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియా టుడే–మై ఆక్సిస్, చాణక్య–న్యూస్24 అంచనాలు చాలావరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.
ఎన్డీయేకి 339 నుంచి 365 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే యూపీఏకి 77–108, ఇతరులకు 69–95 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. కానీ చాణక్య సరిగ్గా అంచనా వేసింది. ఎన్డీయేకి 350, యూపీఏకి 95, ఇతరులకు 97 వస్తాయని స్పష్టమైన అంకెలు ఇచ్చింది. ఒకవేళ ఆధిక్యతలే కనుక య«థాతథంగా ఫలితాలుగా మారినట్టయితే చాణక్యకి, ఎన్డీయే సంఖ్య (350)కి మధ్య కేవలం మూడు సీట్ల తేడాయే ఉంటుంది. అలాగే యూపీఏ సంఖ్య (95)కు 5, ఇతరుల సంఖ్య (97)కు 8 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఎన్డీయే, యూపీఏ ట్యాలీలు రెండూ కూడా ఇండియా టుడే అంచనా వేసిన సీట్ల పరిధిలోనే ఉండటం గమనార్హం.
గత ఎన్నికలను పరిశీలిస్తే..
► 2004లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించింది.
► 2009లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేపై యూపీఏకి స్వల్ప మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ ఆయా సంస్థల అంచనాలు మరోసారి తప్పయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 100కు పైగా సీట్ల మెజారిటీ సాధించింది.
► 2014లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని ఊహించాయి.
అయితే టుడేస్ చాణక్య మినహా ఏదీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పలేకపోయాయి. అసలు ఫలితాలు వచ్చేశాయి.. మరి వివిధ చానళ్లలో ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్‌లో ఏది నిజమయ్యాయి? ఏది తప్పాయి? జనం మూడ్‌ను అవి పసికట్టగలిగాయా.
Comments
Please login to add a commentAdd a comment