Results of of the general elections
-
ఎవరి ధీమా వారిదే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నలభై రోజులకు పైగా ఎదురుచూసిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులతోపాటు సామాన్యుల్లో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రధానంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, కరీంనగర్ స్థానంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశంలో తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలే అందుకు ప్రధాన కారణం. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో కరీంనగర్ ఒకటని పేర్కొనడంతో ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితంపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్కు కంచుకోటగా భావించే కరీంనగర్ జిల్లాలో బీజేపీ పాగా వేస్తుందా? సర్వే ఫలితాలు నిజమవుతాయా? అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రెండు పార్టీల నేతలు తమ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతోపాటు నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించారు. ఎవరి ధీమా వారిదే లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కరీంనగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ సన్నిహితుడు బి.వినోద్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమరానికి కాలు దువ్వారు. హిందుత్వ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్న బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగినప్పటికీ, పోలింగ్ నాటి సరళి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు విజయంపై ధీమాను పెంచింది. కారు గుర్తు, కేసీఆర్ ఛరిష్మా, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వినోద్‌కుమార్ పూర్తి విశ్వాసంతో ఉండగా, ఈసారి హిందుత్వ ఎజెండాతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు ఉపయోగపడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల ఓటర్లు మొగ్గు చూపారనే ధీమాతో సంజయ్ ఉన్నారు. అదే సమయంలో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా ఆరింట టీఆర్ఎస్కు మెజారిటీ ఓట్లు లభిస్తాయని వినోద్‌కుమార్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేశారు. ఈ రెండు పార్టీలతోపాటు సైలెంట్ ఓటింగ్ మీద కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తనకు లాభించాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మూడు పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది సర్వే ఫలితాలతో బెట్టింగ్‌ల జోరు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కరీంనగర్‌ను చేర్చడంతో గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు తారాస్థాయిలో సాగుతున్నాయి. బీజేపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ స్థానంపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి చోట్ల కూడా భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో కూడా గెలుపుపై భారీ అంచనాలు ఉండడంతో ఫలితం ఆసక్తిని రేపుతోంది. టీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పెద్దపల్లి ఫలితంపై టీఆర్ఎస్ ధీమా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకగా టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్కే మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత గెలుపు కోసం అలుపెరుగని కృషి సాగించారు. అయితే సింగరేణి కోల్‌బెల్ట్‌లో కాంగ్రెస్‌కు కొంత అనుకూల వాతావారణం ఉన్నట్లు పోలింగ్ సరళిలో కనిపించినా, దాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు. సామాజిక సమీకరణల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ కన్నా వెంకటేష్ నేతకే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఆపార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయని, తమ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లోక్‌సభ ఓట్ల లెక్కింపు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరుగనుండగా, పెద్దపల్లి ఓట్ల లెక్కింపు మంథని జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనుంది. -
ఫలితాలపై సమీక్ష భవితకు ప్రణాళిక
- రంగంలోకి దిగనున్న వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ - 31న వైఎస్సార్ కల్యాణ మండపంలో సమావేశం - నియోజకవర్గాలవారీగా నిశిత చర్చలు - జిల్లాలో పార్టీ పటిష్టతపై అభిప్రాయ సేకరణ - జిల్లా నేతల సూచనలతో అధిష్టానానికి నివేదిక వాటి ఆధారంగా - జిల్లాలవారీగా జగన్ సమీక్షలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ నిశిత సమీక్షకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఆశించినస్థాయిలో ఫలితాలు సాధించలేకపోడానికి కారణాలను సమీక్షించనుంది. భవిష్యత్తులో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలపై పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనుంది. ఎన్నికల ఫలితాలను సమీక్షించి నివేదిక సమర్పించేందుకు పార్టీ అధిష్టానం జిల్లాకు త్రిసభ్య కమిటీని నియమించింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి ప్రాథమిక సన్నాహకంగా జిల్లాలో ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లాకు చెందిన యువనేత గుడివాడ అమర్నాథ్లను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ నెల 31న శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణ మండలంలో ఈ కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది. కమిటీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సహకరిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ కేంద్ర పాలకమండలి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జెడ్పీటీసీ అభ్యర్థులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల-పట్టణ కన్వీనర్లు, నియోజకవర్గాల్లోని ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరుకావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 31న రోజంతా సమీక్ష త్రిసభ్య కమిటీ ఈ నెల 31న ఉదయం 10 గంటల నుంచి సమీక్ష సమావేశాలు ప్రారంభిస్తుంది. నియోజకవర్గాలవారీగా ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తారు. మొదట ఇచ్ఛాపురం నియోజకవర్గంతో ప్రారంభిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. ఫలితాలపై కూలంకుష చర్చ ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల ఫలితాలపై నిశితంగా సమీక్షిస్తుంది. ప్రచార తీరు, అభ్యర్థుల పనితీరు, ఇతర నేతల పాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఇతరత్రా అంశాలపై లోతుగా చర్చించి వాస్తవాలను తెలుసుకుంటుంది. ఎన్నికల వ్యూహాల్లో ఎక్కడెక్కడ ముందున్నాం, ఏఏ విషయాల్లో వెనుకబడ్డాం, అందుకు కారణాలు, ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారు.. ఇలా అన్ని కోణాల్లోనూ కమిటీ విచారించనుంది. పార్టీ అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల్లోని ఇతర ముఖ్య నేతలందరి అభిప్రాయాలనూ తెలుసుకోనుంది. ఒక్కో నియోజకవర్గానికి అరగంట నుంచి గంట సమయం కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం జిల్లాలో పరిస్థితిపె పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తుంది. పార్టీ పటిష్టతకు ప్రణాళిక గెలుపు ఓటముల సమీక్షకే పరిమితం కాకుండా భవిష్యత్తు కార్యాచరణకు కమిటీ ప్రాధాన్యమిస్తుంది. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చర్చిస్తుంది. పార్టీ పునర్నిర్మాణంపై నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ మేరకు నిర్మాణాత్మక చర్యలను సూచించాలని కమిటీ కోరుతోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఎలా పటిష్ట పరచాలి... పార్టీ నిర్వహణ తీరు ఎలా ఉండాలి.. ఏఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎటువంటి పోరాటాలు చేయాలి. అనే కోణాల్లో పార్టీ నేతల అభిప్రాయాలతో త్రిసభ్య కమిటీ ఓ నివేదిక అధిష్టానానికి సమర్పిస్తుంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే జిల్లాస్థాయి సమీక్ష సమావేశాలకు ముందే ఈ నివేదిక సమర్పిస్తుంది. వీటిన్నింటినీ క్రోడీకరించి పార్టీ భవిష్యత్తు ప్రణాళికను అధిష్టానం రూపొందిస్తుంది. వీటిన్నింటికీ మూలమైనందునే త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశాలకు హాజరుకండి: కృష్ణదాస్ ఈ నెల 31న శ్రీకాకుళంలో నిర్వహించనున్న పార్టీ సమీక్ష సమావేశాలకు పార్టీ అభ్యర్థులతోపాటు ముఖ్య నేతలందరూ హాజరుకావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని జిల్లాలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.