ఫలితాలపై సమీక్ష భవితకు ప్రణాళిక
- రంగంలోకి దిగనున్న వైఎస్సార్‌సీపీ త్రిసభ్య కమిటీ
- 31న వైఎస్సార్ కల్యాణ మండపంలో సమావేశం
- నియోజకవర్గాలవారీగా నిశిత చర్చలు
- జిల్లాలో పార్టీ పటిష్టతపై అభిప్రాయ సేకరణ
- జిల్లా నేతల సూచనలతో అధిష్టానానికి నివేదిక వాటి ఆధారంగా
- జిల్లాలవారీగా జగన్ సమీక్షలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ నిశిత సమీక్షకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఆశించినస్థాయిలో ఫలితాలు సాధించలేకపోడానికి కారణాలను సమీక్షించనుంది. భవిష్యత్తులో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలపై పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనుంది. ఎన్నికల ఫలితాలను సమీక్షించి నివేదిక సమర్పించేందుకు పార్టీ అధిష్టానం జిల్లాకు త్రిసభ్య కమిటీని నియమించింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
దీనికి ప్రాథమిక సన్నాహకంగా జిల్లాలో ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లాకు చెందిన యువనేత గుడివాడ అమర్‌నాథ్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ నెల 31న శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణ మండలంలో ఈ కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది. కమిటీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సహకరిస్తారు.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ కేంద్ర పాలకమండలి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జెడ్పీటీసీ అభ్యర్థులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల-పట్టణ కన్వీనర్లు, నియోజకవర్గాల్లోని ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరుకావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
31న రోజంతా సమీక్ష
త్రిసభ్య కమిటీ ఈ నెల 31న ఉదయం 10 గంటల నుంచి సమీక్ష సమావేశాలు ప్రారంభిస్తుంది. నియోజకవర్గాలవారీగా ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తారు. మొదట ఇచ్ఛాపురం నియోజకవర్గంతో ప్రారంభిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది.
ఫలితాలపై కూలంకుష చర్చ
ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల ఫలితాలపై నిశితంగా సమీక్షిస్తుంది. ప్రచార తీరు, అభ్యర్థుల పనితీరు, ఇతర నేతల పాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఇతరత్రా అంశాలపై లోతుగా చర్చించి వాస్తవాలను తెలుసుకుంటుంది. ఎన్నికల వ్యూహాల్లో ఎక్కడెక్కడ ముందున్నాం, ఏఏ విషయాల్లో వెనుకబడ్డాం, అందుకు కారణాలు, ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారు.. ఇలా అన్ని కోణాల్లోనూ కమిటీ విచారించనుంది.
పార్టీ అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల్లోని ఇతర ముఖ్య నేతలందరి అభిప్రాయాలనూ తెలుసుకోనుంది. ఒక్కో నియోజకవర్గానికి అరగంట నుంచి గంట సమయం కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం జిల్లాలో పరిస్థితిపె పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తుంది.
పార్టీ పటిష్టతకు ప్రణాళిక
గెలుపు ఓటముల సమీక్షకే పరిమితం కాకుండా భవిష్యత్తు కార్యాచరణకు కమిటీ ప్రాధాన్యమిస్తుంది. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చర్చిస్తుంది. పార్టీ పునర్నిర్మాణంపై నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ మేరకు నిర్మాణాత్మక చర్యలను సూచించాలని కమిటీ కోరుతోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఎలా పటిష్ట పరచాలి... పార్టీ నిర్వహణ తీరు ఎలా ఉండాలి.. ఏఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎటువంటి పోరాటాలు చేయాలి.
అనే కోణాల్లో పార్టీ నేతల అభిప్రాయాలతో త్రిసభ్య కమిటీ ఓ నివేదిక అధిష్టానానికి సమర్పిస్తుంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే జిల్లాస్థాయి సమీక్ష సమావేశాలకు ముందే ఈ నివేదిక సమర్పిస్తుంది. వీటిన్నింటినీ క్రోడీకరించి పార్టీ భవిష్యత్తు ప్రణాళికను అధిష్టానం రూపొందిస్తుంది. వీటిన్నింటికీ మూలమైనందునే త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
సమావేశాలకు హాజరుకండి: కృష్ణదాస్
ఈ నెల 31న శ్రీకాకుళంలో నిర్వహించనున్న పార్టీ సమీక్ష సమావేశాలకు పార్టీ అభ్యర్థులతోపాటు ముఖ్య నేతలందరూ హాజరుకావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని జిల్లాలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.