
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, అనంతర పరిణాలతో ఉమ్మడి రాజధాని(హైదరాబాద్)పై హక్కులను కాదనుకుని వెళ్లిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఓటు హక్కును కూడా వదులుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న నారావారు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు.
చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు కూడా తమ ఓట్లను బదిలీచేయించుకున్నారు. కృష్ణా నది ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక అధికారిక నివాసం(హౌస్ నంబర్ 3-781/1)లో ముఖ్యమంత్రి నివసిస్తున్నారు. అది తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఆమేరకు దరఖాస్తు చేసుకోగా, అధికారులు దర్యాప్తుచేసి, ధృవీకరించారు. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం తెలిసిందే.
ఓటరు జాబితాలో బాబు కుటుంబం
పేలుతున్న జోకులు :
కాగా, కొత్త ఓటరు జాబితాకు సంబంధిత ఫొటోలు వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు, మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘ఓటుహక్కు లేనోళ్లు కూడా ఇక్కడి సమస్యలపై మాట్లాడతారా?’ అన్న లోకేశ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘‘శభాష్ లోకేశ్.. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కును సాధించావ్..’ అని జోకులు వినిపిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసుకు భయపడి విభజన హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఉద్దేశించి.. ‘తెలంగాణలో ఉన్న చివరి హక్కునూ వదులుకురు..’ అనే అర్థంలో కామెంట్లు పేలాయి.
Comments
Please login to add a commentAdd a comment