కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. ‘పరిషత్’ ఎన్నికలకు సంబంధించి మంగళవారం జిల్లాకేంద్రం లోని అంబేద్కర్ భవనంలో సూక్ష్మ పరిశీలకుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూక్ష్మ పరిశీలకులంతా జనరల్ అబ్జర్వర్‌ల పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జరుగుతున్న తీరు, అధికారుల విధి నిర్వహణ తీరు, పోలింగ్ సిబ్బంది వ్యవహర శైలిని పరిశీలిస్తూ ఉండాలన్నారు.
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతలు నిర్వర్తించాలని తెలియజేశారు. పోలింగ్ రోజున పోలింగ్‌కు గంట ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకుల నివేదిక ఆధారంగా అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, నిష్ఫక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులందరికి సార్వత్రిక ఎన్నికలకు త్వరలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు. అంతకు ముందు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం మాట్లాడుతూ... పోలింగ్ రోజున బ్యాలట్ బాక్సులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలకు తప్పక పాటించాలన్నారు.
ఈసీ సూచనలకు అనుగుణంగా పోలింగ్ అధికారులు ఓటర్ల చేతివేళ్లపై మార్కింగ్ వేస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఓటర్లు కానివారు ఓటింగ్ కోసం వస్తున్నారా, కమిషన్ జారీచేసిన పాసులు లేకుండా పోలింగ్ కేంద్రాలకు ఎవరైనా వస్తున్నారా, ఏవైన లోపాలు దృష్టికి వస్తే ఎన్నికల పరిశీలకులకు సమాచారం అందిస్తుండాలని సూచించారు. పోలింగ్ అయిన పిదప నిర్ధేశించిన పట్టికలో వివరాలు నమోదు చేసి అబ్జర్వర్‌లకు అందచేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన పలు నిబంధనలను మైక్రో అబ్జర్వర్‌లకు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు వివరించారు. అవగాహన సదస్సులో 278 మంది మైక్రో అబ్జర్వర్‌లు, పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
Published Wed, Apr 2 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement