కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులకు సమస్యలు, సందేహాలు ఉంటే తెలపాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సీడీలను, హార్డ్ కాపీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల జాబితా కూడా అతికించడం జరుగుతుందన్నారు.
ఈ నెల 22, 23 తేదీల్లో ఈవీఎంల కమిషనింగ్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుందన్నారు. ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పోలింగ్ ఏజెంట్ల జాబితా ఈ నెల 28న ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలను సక్రమంగా అందజేయాలని, అనుభవం గల అకౌంటెంట్లను నియమించుకోవాలన్నారు. ప్రచార కార్యక్రమాలకు అనుమతి తీసుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ సారి 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 30న పోలింగ్ ఉండడం వల్ల జిల్లా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈనెల 28లోగా తిరిగి వెళ్లిపోవాలన్నారు. అక్రమ మద్యం రవాణాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి సమాచారమైన ఫోన్ ద్వారా తెలపవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, పార్టీల నాయకులు ఎం. ప్రభాకర్‌రెడ్డి, యూనిస్ అక్బానీ, ప్రశాంత్ కుమార్, బండి దత్తాత్రి, సురేష్ జోషి, ఓంకార్ మల్ శర్మ, లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు ఉంటే తెలపాలి
Published Sat, Apr 19 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement