మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఓటు హక్కును వినియోగించుకోవడంలో లక్షలాది మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెబుతున్నా ఓటు వేయడానికి చాలా మంది మందుకు రావడం లేదు. దీనికి తాజాగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికలే నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో 1,17,381 మంది.. మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో 1,41,288 మంది.. రెండో విడత పరిషత్ ఎన్నికల్లో 1,17,325 మంది అంటే మొత్తంగా 4,35,994 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఒక్క మన జిల్లాలోనే ఇంత మంది ఓటుకు దూరమైతే ఇతర జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఇంక ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారో ఒక్కసారి పరిశీలిస్తే ఓటు వేయని వారు కోట్ల సంఖ్యలో ఉంటారు. ప్రధానంగా పట్టణాల్లో నిర్లక్ష్యం అధికంగా కనిపిస్తుంది. పల్లెల్లో కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి వచ్చి ప్రజలు ఓటు వేశారు. చదువుకున్న వారు నిర్లక్ష్యం వీడితే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
ఒక్క రోజు కేటాయించండి..
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయని వారు ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎన్నికలకు మ రో 15 రోజుల సమయం ఉన్నందున దూర ప్రాంతాల్లో ఉండే వారు, ఓటు వేసేందుకు ఒక రోజు ముందుగానే వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఓటరు కా ర్డు లేకున్నా, ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లాలని మరవకండి. ఓటు వేసేందుకు క్యూలో గంటల తరబడి నిలబడడం తమవల్ల కాదని, నిర్లక్ష్యం చేయకండి.
ఐదేళ్లకు ఒకసారి మాత్రమే మనం ఓటు వేస్తామని, అందుకు ఒక్క రోజును మనం కేటాయించాలనే విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాలించే నాయకున్ని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకండి. ఏ నాయకుడు నచ్చకపోతే ‘నోటా’ అనేది ఉంటుం దని మరవకండి. నచ్చిన అభ్యర్థికే వేస్తారో... అభ్యర్థులు నచ్చలేదని తిరస్కరించే ‘నోటా’కే మీ ఓటు వేస్తారో మీ ఇష్టం. కాని ఓటు మాత్రం వేయడం మరవద్దు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే పొరపాటు, అలా అనుకునే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో 4.36 లక్షల మంది ఓటు వేయలేక పోయారనే విషయాన్ని గ్రహించాలి.
అధికారుల పాత్రే కీలకం
ఓటు హక్కుపై ప్రజల్లో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఓటరును పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అధికారులకు అసలైన సమస్య. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్న ప్రజలు ఓటు వేసేందుకు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. వాగులు, వంకలు, రాళ్లు తేలిన రోడ్లపై నడిచి కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు ఓటర్లు వస్తున్నా, పూర్తిస్థాయిలో రావడం లేదనే విషయాన్ని గ్రహించాలి. గతంలో లాగా పోటీలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను తరలించేందకు ఆస్కారం లేకపోవడంతో, ఇప్పుడు దూర ప్రాంతంలోని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సరైన వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. పోలింగ్ రోజుతో పాటు, అంతకంటే ముందు రోజు గానీ, తరువాత రోజు గానీ ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటిస్తే, దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు వారి స్వస్థలాలకు చేరుకుని ఓటు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారిలో యువత ఎక్కువ శాతం ఉంది. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి. పోల్ చీటీలను పోలింగ్‌కు మూడు రోజుల ముందుగానే ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలి.
మేల్కొనకపోతే ఐదేళ్లు కష్టమే..
Published Mon, Apr 14 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement