ఓటుహక్కు వినియోగించుకునేందుకు మంగళవారం నగరం నుంచి వేలాది మంది జిల్లావాసులు పల్లెబాట పట్టారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటుహక్కు వినియోగించుకునేందుకు మంగళవారం నగరం నుంచి వేలాది మంది జిల్లావాసులు పల్లెబాట పట్టారు. తమ తమ వృత్తులు, వ్యాపారాల రీత్యా నగరంలో వీరంతా ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్లకు బయలుదేరివెళ్లారు. బుధవారం ఎన్నికలు, గురువారం మే డే రోజున సెలవు కూడా కలిసి రావడంతో స్వగ్రామాలకు బయలుదేరారు. రాజధాని నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మంగళవారం సాయంత్రం నుంచి కిటకిటలాడాయి.
ఆర్టీసీ చాలా బస్సులను పోలింగ్ సిబ్బంది కోసం కేటాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ల నుంచి జిల్లాలోని నలుమూలలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది.
కుటుంబాలతో ఇళ్లకు బయలుదేరిన వారు బస్సుల్లేక ప్రత్యామ్నాయ వాహనాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన విస్త్రృత ప్రచారం కారణంగా ఈసారి ఓటర్లలో చైతన్యం పెరిగింది. దీనికి తోడు రెండు రోజుల వరుస సెలవులు రావడంతో సుదూర ప్రాంత ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు.