ahammad babu
-
ఓటు ప్రాధాన్యతపై అవగాహన
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై, వినియోగంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎన్నికల పరిశీలకులు వివిధ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల కోరకు 260 మంది సెక్టోరల్ అధికారులు, 400 వాహనాలు ఎన్నికల విధుల కొరకు వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో 420 ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపు 1100 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో నియోజకవర్గాలవారీగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 26,27వ తేదీల్లో మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన పెంచుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు జాబితా పంపించామని, రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితా అందజేయాలని రిటర్నింగ్ ధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టి ఇప్పటివరకు రూ.58 లక్షల విలువ చేసే లిక్కర్‌ను సీజ్ చేయడం జరిగిందన్నారు. పోలింగ్‌శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, 95 శాతం పోలింగ్ నమోదు చేసిన నోడల్ అధికారులకు రూ.10 వేల చొప్పున పారితోషకం ఇస్తాం. అనంతరం ఎన్నికల పరి శీలకులకు పంకజ్ జోషి మాట్లాడుతూ సింగిల్ విండో విధానం ద్వారా అభ్యర్థుల వాహనాలకు అనుమతి తీసుకోవాలని, ఖర్చుల వివరాలు పూర్తిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,241 మందిని బైండోవర్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.50 వేల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు 6 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు 11 కంపెనీల సీఆర్పీఎఫ్, 18 సెక్షన్ల పారామిలటరీ బృందాలను వినియోగించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, సబ్ కలెక్టర్‌ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, రిటర్నింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు ఉంటే తెలపాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులకు సమస్యలు, సందేహాలు ఉంటే తెలపాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సీడీలను, హార్డ్ కాపీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల జాబితా కూడా అతికించడం జరుగుతుందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఈవీఎంల కమిషనింగ్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుందన్నారు. ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పోలింగ్ ఏజెంట్ల జాబితా ఈ నెల 28న ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలను సక్రమంగా అందజేయాలని, అనుభవం గల అకౌంటెంట్లను నియమించుకోవాలన్నారు. ప్రచార కార్యక్రమాలకు అనుమతి తీసుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సారి 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 30న పోలింగ్ ఉండడం వల్ల జిల్లా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈనెల 28లోగా తిరిగి వెళ్లిపోవాలన్నారు. అక్రమ మద్యం రవాణాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి సమాచారమైన ఫోన్ ద్వారా తెలపవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, పార్టీల నాయకులు ఎం. ప్రభాకర్‌రెడ్డి, యూనిస్ అక్బానీ, ప్రశాంత్ కుమార్, బండి దత్తాత్రి, సురేష్ జోషి, ఓంకార్ మల్ శర్మ, లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పోల్‌చిట్టీలు లేవని బయటకు పంపొద్దు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటర్ల వద్ద పోల్ చిట్టీలు లేవని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించొద్దని కలెక్టర్ అహ్మద్ బాబు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారులకు స్థానిక పీఎమ్మార్సీ భవనంలో ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రెండో రోజు సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి ఉన్న గుర్తింపుకార్డుల్లో ఓటర్ స్లిప్పు ఒక ఆధారం మాత్రమేనని చెప్పారు. పోల్ చిట్టీ లేకున్నా ఓటరు జాబితా ప్రకారం ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. సాధారణ ఎన్నికల నిర్వహణ రోజున పోలింగ్‌కు గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తప్పనిసరిగా లోక్‌సభ, శాసనసభకు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకువాలని పేర్కొన్నారు. గర్భిణులు, అంధులు, వికలాంగులు నేరుగా ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, జాబ్‌కార్డు వంటివి ఓటరు గుర్తింపుకార్డు కిందికి రావని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించిందని అన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ సాధారణ పరిశీలకులు పంకజ్ జోషి, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆర్డీవో రామచంద్రయ్య, పోలింగ్ నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక భేరి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్ అహ్మద్‌బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. పదుల సంఖ్య లో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 5నప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 9వ తేదీగా గడువు విధించా రు. ఈనెల 10న పరిశీలన, 12న ఉపసంహరణతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోనుంది. పోలింగ్ 30న ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 16న ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. రెండు చోట్ల నామినేషన్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయ న తరఫున ఆయన భార్య సుమన్ రాథోడ్ కలెక్టరేట్లోని ఎంపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అహ్మద్‌బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ స్థానానికి ఆయన కొడుకు రితేష్‌రాథోడ్ కూడా నామినేషన్ వేశారు. ఆయన కూడా అహ్మద్‌బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయన తరఫున సివిల్ కాంట్రాక్టర్ అబ్దుల్ ఫయాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్పాటిల్కు నామినేషన్ సమర్పించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్‌తోపాటు, ఆయన కొడుకు రాథోడ రితేష్ నామినేషన్ వేశారు. ఉట్నూర్ ఆర్డీవో, ఖానాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాంచంద్రయ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జిల్లాలో ఉన్నా.. నామినేషన్‌కు దూరం.. బుధవారం రాథోడ్ రమేష్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను మాత్రం ఆయన భార్య సుమన్ రాథోడ్‌తో పంపారు. ఆయనతోపాటు, ఆయన కొడుకు రితేష్‌రాథోడ్ నామినేషన్ సమర్పించిన సమయంలో ఆయన ఇచ్చోడలో ఉన్నారు. అక్కడి బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఉండి కూడా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. జిల్లావ్యాప్తంగా ఓటర్లు 19.18 లక్షలు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. -
విద్యాశాఖలో కలకలం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. మొదటి రోజు 9, రెండో రోజూ ఐదుగురు, మూడో రోజూ 13 మంది డిబార్ అయ్యారు. ఈ మేరకు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ల వివరాలు, కేంద్రాలను డీఈవో వద్ద తీసుకుని 24 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. దీంతో మిగతా ఇన్విజిలేరట్లు, సీఎస్‌లు, డీవోలు భయాందోళనకు గురవుతున్నారు. వీరితోపాటు ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించిన 18 మందిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీకి, ఐటీడీఏ పీవోకు, సాంఘీక సంక్షేమ శాఖ డీడీకి ఉత్తర్వులు పంపారు. వీరిపై కూడా సస్పెషన్ వేటు పడే అవకాశాలు లేకపోలేదు. జంకుతున్న ఉపాధ్యాయులు పదో తరగతి ఇన్విజిలేషన్ చేయడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని కొంత మంది సీఎస్, డీవోలు మామూళ్లకు ఆశపడి పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయిం గ్ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంతో ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి రెండు పరీక్షలకే 24 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో మిగతా పరీక్షల పరిస్థితి ఎలా ఉం టుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ చేయడం సరికాదు.. - రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారని ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోయేది. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బ తింటుంది. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు సస్పెన్షన్ విషయంలో మరోసారి ఆలోచించాలి. -
నేడు ‘పరిషత్’ అభ్యర్థుల ఖరారు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బరిలో నిలిచే జిల్లా, మండల పరిషత్ అభ్యర్థుల జాబితా సోమవారం ఖరారు కానుంది. పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించనున్నారు. కాగా, జెడ్పీటీసీలకు దాఖలైన నామినేషన్లలో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైనా అభ్యర్థులు అప్పీలు చేసుకున్నారు. అప్పీలును ఆదివారం పరిశీలించిన కలెక్టర్ అహ్మద్ బాబు తిరస్కరించిన 24 నామినేషన్లలో 14 ఆమోదించారు. మిగతా పది నామినేషన్లు తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారి లో అందల్వార్ కృష్ణస్వామి (నార్నూర్), చిట్టి స్వప్న (సారంగాపూర్), జి. సుమలత (సారంగాపూర్), కాసు రాధిక (భైంసా), శ్రీమల్లే రాజయ్య (ఉట్నూర్), తోటి గంగమ్మ (ఉట్నూర్), తోటి ఆశన్న (ఉట్నూర్), వందనబాయి (ఇంద్రవెల్లి), మోత్కూరి వెంకటస్వామి (లక్సెట్టిపేట), మెస్రం భాగ్యలక్ష్మీ (జైనథ్) ఉన్నారు. బీ-ఫారం సమయం 3 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు బీ-ఫారాలను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వరకు సమర్పించాలి. ఎంపీటీసీ అభ్యర్థి అయితే మండల కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి, జెడ్పీటీసీ అభ్యర్థి అయితే జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రాజకీయ ప్రజాప్రతినిధులు తమ అభ్యర్థులకు జారీ చేసే బీ-ఫారాలను సమయం దృష్టిలో ఉంచుకొని జారీ చేయాలని జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్‌లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల అనంతరం బీ-ఫారాలను స్వీకరించమని తెలిపారు. అనంతరం ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. -
పెరిగిన ఓటర్లు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మున్సిపాలిటీల్లో ఏడాదికే భారీగా ఓటర్లు పెరిగారు. 2013 జూలైలో మున్సిపాలిటీ వారీగా ఓటర్ల జాబితా ప్రకటించగా ఆరు మున్సిపాలిటీల్లో సుమారు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా కొత్తగా నమోదు చేసుకున్నారు. ఈ ఆరు మున్సిపాలిటీల్లో 55 వేలకు పైగా కొత్తగా చేరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రత్యేక దృష్టి సారించి అన్ని చోట్ల ఓటరు నమోదు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. పెరిగిన తీరు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 2013 జూలై ఓటరు జాబితాలో 75,997 ఓటర్లు ఉండగా 2014 జనవరి 1కి 95,372కు చేరుకుంది. 19,375 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. మంచిర్యాలలో 60,725 ఉండగా 73,985కు పెరిగారు. 13,220 కొత్తగా చేరారు. నిర్మల్‌లో 57,103 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 10 వేలకు పైగా పెరిగి 67,576కు చేరుకుంది. కాగజ్‌నగర్‌లో 7 వేలకు పైగా, భైంసాలో 6 వేలకు పైగా, బెల్లంపల్లిలో 1500కు పైగా కొత్త ఓటర్లు వచ్చారు. పెరిగిన ఓటర్ల సంఖ్యతో మున్సిపాలిటీల్లో సమీకరణాలు కొంత మారే అవకాశాలు ఉన్నాయి. ఆయా కులాల ఓటర్ల సంఖ్యాబలం పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు.. మున్సిపాలిటీలో ప్రతి 1,400 మందికి ఒక పోలింగ్ బూతును పరిగణలోకి తీసుకుంటారు. అయితే.. ఆయా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గతంలో పోలింగ్ కేంద్రాలను నిర్ణయించారు. తాజాగా ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో గత ఓటర్ల సంఖ్య ప్రకారం 81 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా తాజాగా 19 వేలకు పైగా ఓటర్లు పెరగడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య మరింత పెరగనుంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. కాగా ఆదివారం రాత్రి ఓటర్ల జాబితాను అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శించారు. -
వంద రోజులు పని కల్పించాలి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని కల్పించాలని, అప్పుడే సిబ్బందికీ పని కల్పించడం సాధ్యమవుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. మండలంలోని దస్నాపూర్ పంచాయతీ పరిధి పిట్టబొంగరం గ్రామంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్వీరాన్మెంట్ , ఫుడ్‌సెక్యూరిటీ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ డాక్టర్ పరశురాంరాయ్ ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి హామీ పథకం అమలు తీరు, పనులతో రై తులు పొందుతున్న లబ్ధిపై పరిశీలన కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ కూలీకి వంద రోజులు పని కల్పిస్తూనే రైతుల వ్యవసాయ భూముల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో రోడ్డు సౌకర్యానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం రూ.75 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇంద్రవెల్లిలో పోలీసు కాల్పుల్లో గాయపడిన తనను ఆదుకోవాలని పిట్టబొంగరం గ్రామానికి చెందిన కినక మాన్కుబారుు కలెక్టర్‌కు వినతిపత్రం అందించగా, ఆశ్రమ వసతి గృహంలో వర్కర్ ఉద్యోగం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం సంస్థ డెరైక్టర్ పరుశురామ్రాయ్ ఆధ్వర్యంలో దస్నాపూర్ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు పొందుతున్న లాభాలను తెలుసుకున్నారు. ఈజీఎస్ అధికారులు తమ వ్యవసాయ భూముల్లో అభివృద్ధి పనులు చేయకపోతే వారిని నిలదీసే అధికారం రైతులకు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ‘ఉపాధి’ చెల్లింపుల పరిశీలన మండల కేంద్రంలోని పోస్టాఫీసులో బయోమెట్రిక్ విధానంలో ఉపాధి హామీ చెల్లింపులు, పింఛన్ల తీరును కలెక్టర్ అహ్మద్‌బాబు పరిశీలించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులను సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. వివరాలు రోజువారీగా రిజిస్టర్లో నమోదు చేయూలన్నారు. చెల్లింపుల్లో జాప్యం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, కూలీలు సహకరించాలని కోరారు. ఆహార భద్రత సంస్థ అసిస్టెంట్ డెరైక్టర్ ప్రకాశ్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి,అదనపు పీడీ గణేశ్, ఉట్నూర్ క్లస్టర్ ఏపీడీ అనిల్ చౌహాన్, ఎంపీడీవో రమాకాంత్, తహశీల్దార్ సూర్యనారాయణ, ఏపీవో చంద్రయ్య, ఏపీఎం మల్లేశ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీంరావ్, పిట్టబోంగరం గ్రామ పటేల్ వెట్టి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరం సన్యాసులమే.. ‘వేర్వేరు కారణాలతో పెళ్లికి దూరంగా ఉన్న మనమిద్దరం సన్యాసులమే.’ అని న్యూఢిల్లీకి చెందిన సంస్థ డెరైక్టర్ పరశురామ్‌రాయ్ పిట్టబొంగరం వాసి కినక మాన్కుబారుుతో అన్నారు. పోలీసు కాల్పుల్లో గాయపడి పెళ్లికి దూరంగా ఉన్న ఆమెనుద్దేశించి మాట్లాడారు. ఇద్దరం అన్నాచెల్లెళ్లలాంటివారమని పేర్కొన్నారు. -
వసతిగృహాలకు గ్యాస్ సిలిండర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేసే నిర్వాహకుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి వీరు గ్యాస్‌పై చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2,967 కొత్త గ్యాస్ కనెక్షన్లు కేటాయిస్తూ కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రొసిడింగ్ ఆయా సంబంధిత అధికారులకు అందా యి. పాఠశాలల్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఒక గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్, రెగ్యులెటర్ చొప్పున కేటాయించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు 890, పాఠశాలలకు 1,951, సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు 102, గురుకుల పాఠశాలలకు 22, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు రెండు చొప్పున కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పాఠశాలలకు కనెక్షన్లు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వంటచేసి పెట్టేందుకు జిల్లాలోని పాఠశాలలకు 1,951 గ్యాస్ కనెక్షన్లు కేటాయించారు. గుడిహత్నూర్, బేల, జైనథ్, తాంసి మండలాలకు 126, కౌటాల, లోకేశ్వరం మండలాలకు 45, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు 222, ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణికి 192, ముథోల్, తానూర్‌కు 69, బెజ్జూర్‌కు 36, బెల్లంపల్లి, నెన్నెలకు 44, జన్నారంకు 43, దిలావర్పూర్, సారంగాపూర్లకు 33, తలమడుగుకు 33, వాంకిడి, కెరమెరిలకు 94, బోథ్, బజార్హత్నూర్లకు 79, నేరడిగొండ, ఇచ్చోడకు 70, దహెగాం, సిర్పూర్(టి)లకు 38, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లిలకు 111, నిర్మల్‌కు 44, మందమర్రికి 15, కాసిపేటకు 40, తాండూర్, భీమినిలకు 45, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్లకు 99, రెబ్బెనకు 34, ఆదిలాబాద్‌కు 86, భైంసా, కుభీర్‌కు 83, దండేపల్లి, కాగజ్‌నగర్‌కు 75, లక్సెట్టిపేటకు 7, ఖానాపూర్, కడెంకు 94, మామాడ, లక్ష్మణచాందకు 35, జైపూర్‌కు 39, మంచిర్యాల మండలానికి 20 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు 12 కనెక్షన్లు మంజూరు చేశారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్లో గల వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు మూడు, లక్సెట్టిపేటలోని బీసీ బాలు గురుకల పాఠశాలకు మూడు, మామడలోని కస్తూర్భా గాంధీ విద్యాలయానికి(కేజీబీవీ) నాలుగు గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వసతిగృహాలు, అంగన్వాడీలకు కేటాయింపు.. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు 102 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఒక్కొ వసతిగృహానికి ఆరు కనెక్షన్ల చొప్పున కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం(బాలుర, బాలికలు) ఆదిలాబాద్‌కు 12, మందమర్రికి 12, మంచిర్యాలకు, 12, లక్సెట్టిపేటకు 12, నిర్మల్‌కు 12, కాగజ్‌నగర్‌కు 12, ఉట్నూర్‌కు ఆరు, బెల్లంపల్లికి 12, ఆసిఫాబాద్‌కు 12 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి తాంసి, తలమడుగు, ఆదిలాబాద్, గుడిహత్నూర్ మండలాలకు 252 కనెక్షన్లు మంజూరు చేశారు. బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడలకు 147, నేరడిగొండ, ఇచ్చోడలకు 77, సిర్పూర్(టి), కాగజ్‌నగర్‌లకు 68, కౌటాల, బె జ్జూర్లకు 129, భీమినికి 41, బేల, జైనథ్లకు 126, దహెగాం మండలానికి 50 చొప్పున 890 కనెక్షన్లు మంజూరయ్యాయి. -
అర్హులకు దీపం కనెక్షన్లు ఇవ్వాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అర్హులైన నిరుపేదలకు దీపం పథకం కింద మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీ పథకం అమలుపై జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహాలకు 2,943 కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలోని పిల్లలకు భోజనం అందించేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. 890 అంగన్వాడీలు, 1951 పాఠశాలలు, 102 సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్టౌలు త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు నగదు బదిలీ పథకం 84.73 శాతం సీడింగ్ పూర్తయిందని, కొన్ని బ్యాంకులు ఈ విషయంలో శ్రద్ధ వహించడం లేదని పేర్కొన్నారు. సీడింగ్ చేయాల్సిన కేసులు జిల్లాలో 13 వేలు తిరస్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, అరుణశ్రీ, డీఎస్వో వసంత్‌రావు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బ్యాంకర్లు, గ్యాస్ డీలర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పాల్గొన్నారు. -
‘తెల్ల’బోయే
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలు, తగ్గిన దిగుబడి, కరువైన గిట్టుబాటు ధరలు రైతులను ‘తెల్ల’బోయేలా చేస్తే.. ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు దూరంగా ఉన్నాయి. జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మంగళవారం నాటికి ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు. మార్కెట్లో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లలో రోజు గరిష్టంగా రూ.4,400 నుంచి రూ.4,300 ప్రకటిస్తున్నా తేమ పేరిట రూ.340 నుంచి రూ.520 వరకు కోత విధిస్తుండటంతో క్వింటాల్‌కు రూ.3,850 కూడా గిట్టుబాటు కావడం లేదు. జిల్లాలో అంచనాకు మించి సాగైనా వర్షాలకు 1.20 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మృగ్యం కాగా, చేతికందిన పంటలకు గిట్టుబాటు దక్కడం లేదు. ‘గిట్టుబాటు’ పేరు.. ‘తేమ’తో కోత.. పత్తి కొనుగోళ్లు పద్ధతి ప్రకారం జరిగే విధంగా కలెక్టర్ అహ్మద్ బాబు గాడిన పెట్టారు. ఒకేసారి జిల్లాలోని మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,000 కాగా అక్టోబర్ 30న కొనుగోళ్ల సందర్భంగా రూ.4,520 ప్రకటించారు. ఆదిలాబాద్, భైంసా, లక్సెట్టిపేట, బోథ్, మంచిర్యాల తదిత ర మార్కెట్లలో రోజు పత్తి ధర మద్దతును ప్రకటిస్తున్నా, ఆ ధరను వ్యాపారులు కేవలం 15 నుం చి 20 క్వింటాళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆ త ర్వాత తేమ పేరిట కిలోకు ఆ రోజు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కోత విధిస్తున్నారు. మం గళవారం ఆదిలాబాద్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,431 ప్రకటించిన వ్యాపారులు కొందరికి పత్తి రకాల పేరిట చివరకు రూ.3,850 చెల్లించా రు. తేమ 12శాతంకు మించితే కిలోకు రూ. 44.31 చొప్పున కోత విధించారు. ఒకే రోజు రెం డు వేల క్వింటాళ్లకు వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇదే పద్ధతిని కొనసాగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఇ దే తంతు కొనసాగిస్తుండటంతో పత్తి రైతులు బిక్కు బిక్కుమంటున్నారు. ఓ వైపు కరువు, మరోవైపు ‘మద్దతు’ కరువై ఇప్పటికే జిల్లాలో 36 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ప్రభుత్వం కనీసంగానైనా స్పందించడం లేదు. పెట్టుబడులు, విత్తులు, ఎరువుల కోసం పెద్దమొత్తంలో వెచ్చించిన పత్తిరైతులు ఆశలసౌధం నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, దళారుల దోపిడీ పత్తి రైతులను చిత్తు చేస్తుంది. కొనుగోళ్లకు సీసీఐ ‘సున్న’ం అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పె రుగుతుండగా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నార ని రైతులు ఆరోపిస్తున్నారు. ఎగుమతులపై స్ప ష్టత లేదన్న సాకుతో సిండికేట్‌గా మారిన పత్తి వ్యాపారులు జిల్లాలో పత్తి ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతుల నుంచి గతేడాది నవంబర్ 20 వరకు 12,70,215 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే ఈ సారి 3,36,472 క్వింటాళ్లే తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఆల స్యంగా రాగా, కొనుగోళ్లను కూడా ఆలస్యంగానే ప్రారంభించారు. అయితే గతేడాది ప్రైవేట్ వ్యా పారులకు తోడు సీసీఐ, నాఫెడ్‌లు బాసటగా నిలిస్తే, ఈసారి 17 మార్కెట్లలో మొత్తం 3,36,474 క్వింటాళ్లు వ్యాపారులే ఖరీదు చేశా రు. సీసీఐ మాత్రం ఇప్పటికే దూదిపింజను ము ట్టలేదు. తేమ పేరిట పాయింట్‌కు రూ.42 నుం చి 46 వరకు కోత విధిస్తూ ప్రభుత్వ మద్దతు ధ రకు మంగళం పాడుతున్న సందర్భంలో కూడా సీసీఐ రంగంలోకి దిగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లక్సెట్టిపేట మార్కెట్లో రైతులకు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3,800 దక్కడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన పత్తి వ్యాపారుల ‘సిండికేట్’ దోపిడీకి రైతులు ఎన్ని రూ.లక్షలు నష్టపోయారో అంచనా వేయవచ్చు. అధికార యంత్రాంగం పత్తి మార్కెట్లలో ధరల వ్యత్యాసాలను నిరోధించి సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలని కోరుతున్నారు.