కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై, వినియోగంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎన్నికల పరిశీలకులు వివిధ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల కోరకు 260 మంది సెక్టోరల్ అధికారులు, 400 వాహనాలు ఎన్నికల విధుల కొరకు వినియోగిస్తున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో 420 ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపు 1100 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో నియోజకవర్గాలవారీగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 26,27వ తేదీల్లో మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన పెంచుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు జాబితా పంపించామని, రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితా అందజేయాలని రిటర్నింగ్ ధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టి ఇప్పటివరకు రూ.58 లక్షల విలువ చేసే లిక్కర్‌ను సీజ్ చేయడం జరిగిందన్నారు.
పోలింగ్‌శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, 95 శాతం పోలింగ్ నమోదు చేసిన నోడల్ అధికారులకు రూ.10 వేల చొప్పున పారితోషకం ఇస్తాం. అనంతరం ఎన్నికల పరి శీలకులకు పంకజ్ జోషి మాట్లాడుతూ సింగిల్ విండో విధానం ద్వారా అభ్యర్థుల వాహనాలకు అనుమతి తీసుకోవాలని, ఖర్చుల వివరాలు పూర్తిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సక్రమంగా నిర్వహించాలన్నారు.
ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,241 మందిని బైండోవర్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.50 వేల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు 6 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు 11 కంపెనీల సీఆర్‌పీఎఫ్, 18 సెక్షన్ల పారామిలటరీ బృందాలను వినియోగించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, సబ్ కలెక్టర్‌ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, రిటర్నింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఓటు ప్రాధాన్యతపై అవగాహన
Published Sat, Apr 19 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement