సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్ అహ్మద్‌బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. పదుల సంఖ్య లో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 5నప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 9వ తేదీగా గడువు విధించా రు. ఈనెల 10న పరిశీలన, 12న ఉపసంహరణతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోనుంది. పోలింగ్ 30న ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 16న ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది.
రెండు చోట్ల నామినేషన్లు
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయ న తరఫున ఆయన భార్య సుమన్ రాథోడ్
కలెక్టరేట్‌లోని ఎంపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అహ్మద్‌బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ స్థానానికి ఆయన కొడుకు రితేష్‌రాథోడ్ కూడా నామినేషన్ వేశారు. ఆయన కూడా అహ్మద్‌బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయన తరఫున సివిల్ కాంట్రాక్టర్ అబ్దుల్ ఫయాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్‌కు నామినేషన్ సమర్పించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్‌తోపాటు, ఆయన కొడుకు రాథోడ రితేష్ నామినేషన్ వేశారు. ఉట్నూర్ ఆర్డీవో, ఖానాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాంచంద్రయ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
జిల్లాలో ఉన్నా.. నామినేషన్‌కు దూరం..
బుధవారం రాథోడ్ రమేష్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను మాత్రం ఆయన భార్య సుమన్ రాథోడ్‌తో పంపారు. ఆయనతోపాటు, ఆయన కొడుకు రితేష్‌రాథోడ్ నామినేషన్ సమర్పించిన సమయంలో ఆయన ఇచ్చోడలో ఉన్నారు. అక్కడి బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఉండి కూడా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
జిల్లావ్యాప్తంగా ఓటర్లు 19.18 లక్షలు
జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు.
సార్వత్రిక భేరి
Published Thu, Apr 3 2014 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement