సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల బరికి గులాబీ దళం సిద్ధమైంది. మంచిర్యాల మినహా జిల్లాలోని తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈ జాబితాలో చోటు దక్కింది. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, ముథోల్ నుంచి ఎస్.వేణుగోపాలాచారి, చెన్నూరు నుంచి నల్లాల ఓదెలు, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య ఈసారి కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. పనితీరు బాగా లేని, ప్రజల్లో అసంతృప్తి ఉన్న సిట్టింగ్ స్థానాల్లో ప్రత్యామ్నాయంగా అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో జిల్లాలో ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ ఈ ఉహాగానాలకు తెరదించుతూ కేసీఆర్ సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఖరారు చేశారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన వారికి కూడా టిక్కెట్లు దక్కాయి. నిర్మల్ నుంచి శ్రీహరిరావు, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్ నుంచి రేఖాశ్యాంనాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. రేఖా శ్యాంనాయక్ ఎస్టీ కాదని కొన్ని గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయమై కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆరోపణలను అధినేత కేసీఆర్ పట్టించుకోలేదు. రేఖాశ్యాంనాయక్‌నే అభ్యర్థిగా ప్రకటించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా దుర్గం చిన్నయ్య పేరు తెరపైకి వచ్చింది. నేతకాని సామాజికవర్గానికి చెందిన చిన్నయ్య గతంలో నెన్నెల మండల ఎంపీపీగా పనిచేశారు.
ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని భావించిన గోడం నగేష్‌ను బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన బోథ్ ఎమ్మెల్యే గోడం నగేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు నగేష్‌ను బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఏ క్షణంలోనైనా ఆయన తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మంచిర్యాలపై వీడని సస్పెన్స్
మంచిర్యాల నియోజకవర్గం విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ఇక్కడ బీసీలకే టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉండటంతో ఈ సీటును ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన నడిపెల్లి దివాకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా మంచిర్యాల టిక్కెట్ బీసీలకే ప్రకటించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేయడం, తెలంగాణ భవన్‌ను ముట్టడించడం జరిగింది. ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ సీటును ప్రకటించలేదు. కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ముఖ్య నాయకుడు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉండటంతోనే ఈ స్థానం నుంచి బరిలో దిగనున్న అభ్యర్థి పేరును అధినేత వెల్లడించలేదనే ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కేసీఆర్‌కు సన్నిహితుడైన ఫిలీం డిస్ట్రిబ్యూటర్ రాంమోహన్‌రావు కూడా ఈ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్న అభ్యర్థి పేరు కూడా వెల్లడించక పోవడంతో సస్పెన్స్ వీడటం లేదు. మొత్తం మీద నాలుగు జనరల్ స్థానాల్లో సిట్టింగ్‌లైన ముగ్గురు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ బరిలోకి దించుతోంది. ఈ జాబితాలో ముస్లిం మైనార్టీల నుంచి ఏ ఒక్క అభ్యర్థి లేకపోవడం పట్ల ఆ వర్గాల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు
Published Sat, Apr 5 2014 12:31 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement