టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచే పూరిస్తున్నారు. స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలో ఆదివారం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
కరీంనగర్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచే పూరిస్తున్నారు. స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలో ఆదివారం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుని కలెక్టరేట్ హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడినుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణమైన ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ప్రధానంగా తెలంగాణ వికాసం గురించే ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని, రాష్ట్ర వికాసం సైతం తమతోనే సాధ్యమనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సహకరించిన పార్టీగా బీజేపీ ఎన్నికల గోదాలో ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో తలపడాలంటే తెలంగాణ రాష్ర్టం తీసుకురావడమే కాద ు, వచ్చిన తెలంగాణను తీర్చిదిద్దడం కూడా తమతోనే సాధ్యమనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
ఇదితొలి బహిరంగ సభ కావడంతో సుమారు లక్ష మందిని సమీకరించి తెలంగాణ ప్రజలు తమవెంటే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలని గులాబీ బాస్ ఉబలాటపడుతున్నారు. ఇందుకోసం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జనమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుండటంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.