సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. బరిలో దిగనున్న అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అధిష్టానం తలమునకలవుతోంది. ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వగల నాయకులను బరిలో దించాలని భావిస్తోం ది. ఆదిలాబాద్ ఎంపీతోపాటు జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారని జిల్లా నాయకులు స్పష్టం చేస్తున్నారు. విజయావకాశాలు అధికంగా ఉన్న రెండు, మూడు అసెంబ్లీ స్థానాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోందని, త్వరలోనే ప్రకటన ఉండే అవకాశాలున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి తెలిపారు.
నిరుపేదల సంక్షేమం కోసం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదలు ప్రతీ గ్రామంలో వేలాది మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులు వైఎస్సార్ సీపీనే ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మంలో ఇప్పటికే నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైన విషయం విధితమే. ఈ సభ తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. మిగతా జిల్లాల్లో కూడా అధినేత పర్యటిస్తే శ్రేణుల్లో ఉత్సాహం నిండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ ఆశావహులు
క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉన్న నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి పోటీలో ఉండే అవకాశాలున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరు నిర్మల్ స్థానానికి పోటీ చేయనున్నారు. ఆదిలాబాద్ స్థానం నుంచి ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బి.అనిల్‌కుమార్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ ఆదిలాబాద్ మండల శాఖ అధ్యక్షుడు గో పాల్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ముథోల్ నుంచి నియోజకవర్గ సమన్వయకర్త రవిప్రసాద్ పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు.
ఇక్క డ జిల్లా అధికార ప్రతినిధి సమతా సుదర్శన్ కూడా రవిప్రసాద్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్టీలకు రిజర్వు అయిన ఖానాపూర్ నుంచి గోండు సామాజిక వర్గానికి చెందిన తొడసం నాగోరావు పేరు వినిపిస్తోంది. శ్రీరాంనాయక్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ మంచిర్యాల నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నూర్ నుంచి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రేమల టిక్కెట్ రేసులో ఉన్నారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. బెల్లంపల్లిలో విద్యావేత్త రాజ్‌కిరణ్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సిర్పూర్, ఆసిఫాబాద్‌ల నుంచి బ్రహ్మయ్య, మోహన్ నాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ సన్నద్ధం
Published Wed, Apr 2 2014 1:51 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement