ఉట్నూర్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటర్ల వద్ద పోల్ చిట్టీలు లేవని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించొద్దని కలెక్టర్ అహ్మద్ బాబు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారులకు స్థానిక పీఎమ్మార్సీ భవనంలో ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రెండో రోజు సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి ఉన్న గుర్తింపుకార్డుల్లో ఓటర్ స్లిప్పు ఒక ఆధారం మాత్రమేనని చెప్పారు.
పోల్ చిట్టీ లేకున్నా ఓటరు జాబితా ప్రకారం ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. సాధారణ ఎన్నికల నిర్వహణ రోజున పోలింగ్‌కు గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తప్పనిసరిగా లోక్‌సభ, శాసనసభకు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకువాలని పేర్కొన్నారు. గర్భిణులు, అంధులు, వికలాంగులు నేరుగా ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, జాబ్‌కార్డు వంటివి ఓటరు గుర్తింపుకార్డు కిందికి రావని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించిందని అన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ సాధారణ పరిశీలకులు పంకజ్ జోషి, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆర్డీవో రామచంద్రయ్య, పోలింగ్ నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.
పోల్‌చిట్టీలు లేవని బయటకు పంపొద్దు
Published Tue, Apr 15 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
Advertisement
Advertisement