
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆదిలాబాద్ : ఆదివాసీ, లంబాడీల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం ఇరువర్గాలతో చర్చలకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం వారితో చర్చలు జరిపినవారిలో ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ వై.నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఉన్నారు. మొదట ఆదివాసీ నాయకులతో ఐటీడీఏ కార్యాలయం లో, ఆ తర్వాత రాత్రి కుమురంభీం కాంప్లెక్స్ లో లంబాడీ నాయకులతో అధికారులు చర్చించారు. జిల్లాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కలిసిరావాలని అధికారులు కోరారు. చర్చలు ముగిసిన తర్వాత వేర్వేరుగా మీడి యాకు వివరాలను తెలియజేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం ఆగదని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు అధికారులకు స్పష్టం చేశారు. కుమురంభీం విగ్రహానికి చెప్పులదండ వేసిన వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు మర్సకోల తిరుపతి, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వలస లంబాడీలకు వ్యతిరేకమే...
లంబాడీలకు పూర్తిస్థాయి రక్షణ ప్రభుత్వం కల్పించాలని ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్‌సింగ్ తిలావత్ చర్చల్లో అధికారులను కోరారు. లంబాడీలు ఎస్టీలు కాదనే హక్కు ఎవరికీ లేదని అన్నారు. వలస లంబాడీలకు తాము కూడా వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో లంబాడీ నేతలు జాదవ్ రమణానాయక్, రామారావు, భరత్ తదితరులు ఉన్నారు.
సద్దుమణిగిన ఘర్షణలు..
ఏజెన్సీలో సోమవారం ఘర్షణలు సద్దుమణిగాయి. పాత జిల్లా పరిధిలో పోలీసు పహారా కొనసాగుతుంది. ముగ్గురు ఐజీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఎలాంటి సంఘటన చోటుచేసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment