ps pradyumna
-
అవి అసత్య కథనాలు
సాక్షి, అమరావతి: ఎటువంటి ఆధారాలు, పేర్లు లేకుండా రాష్ట్రంలోని ఐఏఎస్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి పేరు పేర్కొనకుండా ‘వసూల్ రాజా’ పేరుతో రాష్ట్రంలోని ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా సత్యదూరమైన కథనాలను ప్రచురించడాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలనలో పూర్తి పారదర్శకంగా ఐఏఎస్‌ల సంఘం వ్యవహరిస్తుందని, ఈ విషయంలో మీడియా పాత్రను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నారు. కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహాజనితమైన కథనాలను ప్రచురిస్తోందన్నారు. దీనివల్ల ఇతర ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 6న సమావేశమైన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ల జనరల్ బాడీ సమావేశం ఆంధ్రజ్యోతి ప్రచురించిన వరుస వార్తా కథనాలను ఏకగ్రీవంగా ఖండించిందన్నారు. పరిపాలనలో చిత్తశుద్ధి, మంచితనంతో అధికారులు పనిచేస్తారని మరోసారి అసోసియేషన్ స్పష్టం చేస్తోందన్నారు. అలాగే ఆదివారం ప్రచురించిన ‘బెడిసి కొట్టిన భేటీ’ కథనాన్ని కూడా అసోసియేషన్ ఖండించింది. 6వ తేదీ సమావేశంలో ఈ కథనాలపై అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు లేవని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నది అవాస్తవమని, ఏకగ్రీవ నిర్ణయంతోనే అసోసియేషన్ ఈ తీర్మానం చేసిందని ప్రద్యుమ్న స్పష్టం చేశారు. -
మరీ ఇంత అధ్వానమా..?
తిరుపతి అర్బన్: మీ ఇళ్లలోనూ పారిశుధ్యం ఇలాగే ఉంటుందా.. అంటూ తిరుపతిలోని రుయా వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న కన్నెర్ర చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా అత్యవసర వైద్య విభాగంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్, అక్కడ బెడ్‌కవర్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎంఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విభాగంలో మెడికల్ వేస్ట్ నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. అదేవిధంగా రోగులతోపాటు వారికి సహాయంగా వచ్చేవారు కూర్చునేందుకు తక్షణం సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ గ్రీన్ కార్పొరేషన్‌తో పచ్చదనం రుయాకు రోజూ వచ్చే రోగులకు మరింత ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేలా అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పరిసరాల్లో పచ్చదనం కల్పించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీసీ) సమావేశాలను ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహించా లన్నారు. గత సమావేశంలో నిర్ణయించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. భద్రతకు ప్రాధాన్యం.. రుయా, మెటర్నిటీ, చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద భద్రతకు అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందులో భాగంగా 40 అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. రుయాలో సహాయకుల విశ్రాంతి భవనాన్ని ప్రసూతి ఆస్పత్రి రోగుల కోసం విని యోగించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులకు కలిపి సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రుయా పరిపాలనా భవనంలో హెచ్‌డీసీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, హెచ్‌డీసీ సభ్యులు డాక్టర్ సుధారాణి, చినబాబు, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ భాషలో కారణాలు చెప్పొద్దు
చిత్తూరు అర్బన్: ‘‘గతేడాది జిల్లాలో 46 మాతాశిశు సంభవించాయి. ఈ సంవత్సరం ఐదుగురు చనిపోయారు. ఇందుకు మెడికల్ భాషలో మీరు చెప్పే వాటికి తలూపి వెళ్లిపోవడానికి నేను పేషెంట్‌ను కాదు. మీ పరిపాలన అధికారిని. మరణాలకు కారణాలు చెప్పొద్దు. ఎందుకు ముందే మరణాలను నివారించలేకపోయారో చెప్పండి. ఆస్పత్రిలో అపోలో యాజమాన్యం, ప్రభుత్వ వైద్యాధికారులు ఒకరికొకరు సర్దుకుని సమన్వయంతో పని చేయాలి’’ అంటూ జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి సంస్థ (హెచ్‌డీఎస్) సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సంస్థతో కలిసి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అపోలోకు క్లినికల్ అటాచ్మెంట్ కింద ఆస్పత్రిలో చోటు ఇచ్చిందన్నారు. మెమొరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ప్రకారం ఇక్కడ మౌలిక వసతులు, సదుపాయాలను వీలైనంత త్వరగా కల్పించా లన్నారు. డయాలసిస్ యంత్రాన్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేద ని కలెక్టర్ అపోలో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. నెలవారీ నిర్వహణపై స్పష్ట త లేదని వారు చెప్పడంతో హెచ్‌డీఎస్ నిధుల నుంచి నెలసరి నిర్వహణ భరిస్తామని జూన్ 2 నుంచి డయాలసిస్ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే చనిపోయినవారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వర్తించడానికి మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తానే ఓ వాహనాన్ని సమకూరుస్తానన్నారు. ఆగస్టు 15వ తేదీకి నిర్మాణంలో ఉన్న ఓపీ భవనం పూర్తవ్వాలన్నారు. మాతాశిశు కేంద్రంలో ఏసీలు ఉంచాలన్నారు. ఇక కోతుల బెడద లేకుండా వార్డుల చుట్టూ కమ్మీలను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో అపోలో సైతం రాత్రి వేళల్లో ఇద్దరు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు భవన నిర్మాణం సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అజెండాలోని అంశాలను కలెక్టర్ ఆమోదించారు. జేసీ–2 చంద్రమౌళి, డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయగౌరి, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఆస్పత్రి పర్యవేక్షకులు పాండురంగయ్య. అపోలో అధికారి నరేష్‌కుమార్‌రెడ్డి, హెచ్‌డీఎస్ సభ్యులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి పాలనఎన్నాళ్లు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నెలరోజులు గడుస్తున్నా జిల్లా కలెక్టర్ నియామకం కొలిక్కి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పథకాల అమలు లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కలెక్టర్‌గా పని చేసిన పీఎస్ ప్రద్యుమ్నను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనతో పాటు బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను కూడా బదిలీ అయ్యారు. మరుసటి రోజే ఆయన స్థానంలో కరీంనగర్ ఆర్వీఎం పీవోగా పనిచేస్తున్న జి.శ్యాంప్రసాద్‌లాల్‌ను బోధన్ ఆర్డీవోగా నియమించారు. కలెక్టర్‌ను బది లీ చేసిన ప్రభుత్వం ప్రద్యుమ్న స్థానంలో ఎవరినీ నియమించకుండా.. జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావుకు ఇన్చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జాయింట్ కలెక్టర్‌గా ప్రజాపంపిణీ, భూసేకరణ, పునరావాసం తదితర కీలకమైన శాఖల పర్యవేక్షణలో ఉండే ఆయనకు ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన ప్రణాళిక’ అమలులో వెంకటేశ్వర్రావు బిజీ కావడంతో మిగతా శాఖల కార్యక్రమాల అమలు మందగించే అవకాశం ఉందన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది. మన ఊరు - మన ప్రణాళికతో పాటు మేనిఫెస్టోలోని రైతు రుణమాఫీ, రెండు పడక గదులతో ఇళ్ల నిర్మా ణం తదితర పథకాలను అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో సర్వేలు, సమీక్షల వేగం పెరిగింది. కలెక్టర్ ప్రద్యుమ్న బదిలీ తర్వాత నె ల వ్యవధిలో మూడు పర్యాయాలు పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, కలెక్టర్లను బదిలీ చేసి.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేశారు. కానీ.. నిజామాబాద్‌కు మాత్రం కలెక్టర్‌ను నియమించలేదు. తాజాగా శనివారం ఎనిమిదిమంది ఐఏఎస్‌లు బదిలీ కాగా.. జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ ప్రద్యుమ్నను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. జిల్లాలో ‘మన ఊరు - మన ప్రణాళిక’ అమలుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డిని నియమించారు. అంతే తప్ప జిల్లా కల్టెక్టర్‌ను మాత్రం నియమించకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రఘునందన్, గిరిజాశంకర్,విజయ్‌కుమార్ పేర్లు? నిజామాబాద్ కొత్త కలెక్టర్ల జాబితాలో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌గా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు టీఆర్ఎస్ సీనియర్లను, ప్రజాప్రతినిధులను కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేలను ఎవరికీ వారుగా సంప్రదించినట్లు సమాచారం. కృష్టా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గిరిజా శంకర్, మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరిని నియమిస్తారా..? లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..? అసలు కలెక్టర్ నియామకం ఎప్పుడు జరుగుతుంది..? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో..లేదో చూడాలి మరి. -
తడిసిన ధాన్యమూ కొనుగోలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: తడిసిన ధాన్యంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ. 1,345 చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు. జిల్లాలో కురిసిన అకా ల వర్షాల వల్ల కొన్ని ప్రాం తాల్లో రబీ ధాన్యం తడిసి ముద్దయ్యిందన్నారు. అదేవిధంగా వారం రోజులుగా రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంపై వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు టోల్‌ఫ్రీ 18004256644, ల్యాండ్ 08462-221801 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 28,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో వంద కొనుగోలు కేంద్రాలు మోర్తాడ్ : వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మరో వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్ రావు తెలిపారు. ఆదివారం మోర్తాడ్, దోన్పాల్లలో తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఇందిర క్రాంతి పథం ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఆయన తెలిపారు. అవసరం ఉన్న చోట ఆయా గ్రామాల మిహ ళా సమాఖ్యలు ప్రతిపాదనలు పంపితే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా లారీల కొరత, గన్నీ సంచుల కొరత ఉన్నా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సెల్ నంబర్ 7702003545కు ఫోన్ చేయాలన్నారు. 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని ఆయన కోరారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. నిజామాబాద్ ఎంపీ స్థానానాకి పోటీలో ఉన్న అభ్యర్థులతో శనివారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి , ప్రచార కార్యక్రమం, నిర్వహణ, అభ్యర్థుల ఖర్చు, చెల్లింపువార్తలు, వీడియో ప్రసారం తదితర విషయాలను వివరించారు. అభ్యర్థులంతా ఎలక్షన్ ఏజెంట్లను నియమించుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగతంగా సమావేశానికి హాజరుకాలేనప్పుడు ఏజెంట్లను పంపించవచ్చన్నారు. ఖర్చు వివరాల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, వాహనాల కోసం తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రూపొందిస్తే ప్రింటింగ్ ప్రెస్ యజమాన్యం మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో ప్రచురణ సామగ్రి ప్రతులను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రచారం చేసుకోవాలంటే మూడు రోజుల ముందుగానే అనుమతి కోసం నిర్దేశించిన అనెక్జర్-ఏ పట్టికలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఆమోదించిన పిదపనే ప్రచారం చేసుకోవలసి ఉంటుందన్నారు. హోర్డింగ్‌లు, బ్యానర్లు అనుమతి ఇచ్చిన చోటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2,058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చి 15వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి అందిస్తామని, ఇతర పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులు జాబితాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు గాని వచ్చి ఓటింగ్ ప్రక్రియను చూసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులంతా సహకరించాలని కోరారు. అనుమతి తప్పనిసరి... సమావేశంలో ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ... లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ఇతర పార్టీల వారు గాని, అభ్యర్థులు గాని ఆటంకం కలిగించడం, అడ్డుకోవడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చట్టారీత్యా చర్యలు తప్పవన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోండి... సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు సూర్యనారాయణసోని మాట్లాడుతూ... అభ్యర్థులకు అనుమానాలు, ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, తననుగాని సంప్రదించాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే లిఖిత పూర్వకంగా అందించవచ్చని, సెల్ నం.94918 60465కు కాల్ చేయవచ్చన్నారు. సమావేశంలో అభ్యర్థులు మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కోటపాటినర్సింహనాయుడు, తలారి రాములు (స్వంతంత్రులు), రాపెల్లి శ్రీనివాస్ (ఆమ్ఆద్మీ పార్టీ) పాల్గొన్నారు. -
పరిషత్ పోలింగ్ 77.14 %
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు స్వల్వ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతగా 18 మండలాల్లోని 18 జడ్పీటీసీ, 289 ఎం పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 77.14 శాతం నమోదైంది. పోలింగ్ సరళి ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం వరకు నిదానంగా సాగింది. మొదటి రెండు గంటలలో ఉదయం9 గంటలకు 14.19 శాతం, ఉదయం 11 గంటలకు 33.18 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.15 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 66.32 శాతంగా నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 18 మండలాలలో కలిపి 77.14 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని మండలాల్లో ఓటర్లు ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరగా, మరి కొన్ని చోట్ల అంతగా బయటకు రాలేకపోయారు. బిచ్కుంద, బోధన్, నిజాంసాగర్, రెంజల్, బీర్కూర్, ఎడపల్లి మండలాల్లో అత్యధికంగా 80 నుంచి 83 శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. బాన్సువాడ, డిచ్పల్లి, మండలాల్లో 71.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 7,28,809 మంది ఓటర్లలో 5,62,199 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆకుల కొండూర్‌లో పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ శనివారం అర్ధరాత్రి నిజామాబాద్ మండలం ఆకుల కొండూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారనే సమాచారం మేరకు రూరల్ టౌన్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపులుగా ఉన్న గ్రామస్తులను లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అతనిపైనా చేయి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అక్కడున్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పోలింగ్ బూత్‌లోని ఎన్నికల ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ తరుణ్ జోషి వివరాలు తెలుసుకున్నారు. కాగా గ్రామ సర్పంచ్‌తో పాటు, పలువురు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు మండలాలలో స్వల్ప ఉద్రిక్తత పోలింగ్ రోజు కొన్ని మండలాలలో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో ఓటర్లపై పోలీసులు చేయి చేసుకున్నందుకు గ్రామస్తులు ఆందోళన చేశారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్పల్లిలో ఓటర్లను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను అక్కడున్న పోలీసులు చితకబాదారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేనందుకు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోం గార్డు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సరళిని పరిశీలించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న డిచ్పల్లి, బోర్గాం, మంచిప్ప, మోపాల్ తదితర గ్రామాలను సందర్శించారు. ఎన్నికల పరిశీలకులు భారతీ లక్పతి నాయక్ బాన్సువాడ, బిచ్కుంద, వర్ని తదితర మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, డీఎస్పీలు కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఓటేసిన ప్రముఖులు... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంపూర్‌లో ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకోగా, మద్నూర్‌లో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నవీపేట మండలం పోతంగల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు వేశారు. -
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. ‘పరిషత్’ ఎన్నికలకు సంబంధించి మంగళవారం జిల్లాకేంద్రం లోని అంబేద్కర్ భవనంలో సూక్ష్మ పరిశీలకుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూక్ష్మ పరిశీలకులంతా జనరల్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జరుగుతున్న తీరు, అధికారుల విధి నిర్వహణ తీరు, పోలింగ్ సిబ్బంది వ్యవహర శైలిని పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతలు నిర్వర్తించాలని తెలియజేశారు. పోలింగ్ రోజున పోలింగ్‌కు గంట ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకుల నివేదిక ఆధారంగా అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, నిష్ఫక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులందరికి సార్వత్రిక ఎన్నికలకు త్వరలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు. అంతకు ముందు డీఆర్డీఏ పీడీ వెంకటేశం మాట్లాడుతూ... పోలింగ్ రోజున బ్యాలట్ బాక్సులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలకు తప్పక పాటించాలన్నారు. ఈసీ సూచనలకు అనుగుణంగా పోలింగ్ అధికారులు ఓటర్ల చేతివేళ్లపై మార్కింగ్ వేస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఓటర్లు కానివారు ఓటింగ్ కోసం వస్తున్నారా, కమిషన్ జారీచేసిన పాసులు లేకుండా పోలింగ్ కేంద్రాలకు ఎవరైనా వస్తున్నారా, ఏవైన లోపాలు దృష్టికి వస్తే ఎన్నికల పరిశీలకులకు సమాచారం అందిస్తుండాలని సూచించారు. పోలింగ్ అయిన పిదప నిర్ధేశించిన పట్టికలో వివరాలు నమోదు చేసి అబ్జర్వర్లకు అందచేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన పలు నిబంధనలను మైక్రో అబ్జర్వర్లకు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు వివరించారు. అవగాహన సదస్సులో 278 మంది మైక్రో అబ్జర్వర్లు, పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
ఖరారైన రిజర్వేషన్లు
ఇందూరు, న్యూస్‌లైన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థా నిక సంస్థల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా ను (గెజిట్ నోటిఫికేషన్) వి డుదల చేశారు. అయితే మ హిళలకు జడ్పీటీసీ స్థానాల్లో 50 శాతం రిజర్వు కాగా ఎం పీటీసీ స్థానాల్లో 50 శాతం కంటే ఎక్కువగా స్థానాలు కేటాయించారు. జిల్లాలో జ డ్పీటీసీ స్థానాలు 36 ఉండగా ఇందులో 18 స్థా నాలు, ఎంపీటీసీ స్థానాలు 583 ఉండగా ఇం దులో 297 స్థానాలు మహిళలకు రిజర్వు అ య్యాయి. మహిళలకు స్థానాలు ఎక్కువగా ఉ న్నందున ఈసారి జడ్పీ చైర్మన్ పీఠం కూడా మహిళలకే రిజర్వు కావచ్చని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి రేపే నోటిఫికేషన్
సాక్షి, నిజామాబాద్: నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ పోస్టుల భర్తీ షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. అభ్యర్థులు జనవరి 12లోగా పరీక్ష ఫీజును చెల్లించి, 13లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షను ఫిబ్రవరి 2న నిర్వహిస్తామని, పది రోజుల్లో మెరిట్ జాబితా ప్రకటిస్తామని అన్నారు. ఫిబ్రవరి 25 వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఫిబ్రవరి నెలాఖరులోగా వారికి పోస్టింగ్‌లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 65 వీఆర్ఓ, 94 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాత పరీక్షను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించగా, దరఖాస్తుల ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ ద్వారా కొనసాగుతుందని అన్నారు. గత ఏడాది నియామకాలను బట్టి పరిశీలిస్తే ఈసారి జిల్లాలో 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లాలోని పట్టణ కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన ఇన్విజిలెటర్లు, రూట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్ల నియామకం చేపడతామన్నారు. అభ్యర్థులు రూ. 300 చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, వికలాంగుల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోస్టులకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుందని, అభ్యర్థులు ఈ సైట్లో చూసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవా కేంద్రాలు తీసుకోవాల్సిన రుసుమును త్వరలో ప్రకటిస్తామని ప్రద్యుమ్న పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు.