సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నెలరోజులు గడుస్తున్నా జిల్లా కలెక్టర్ నియామకం కొలిక్కి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పథకాల అమలు లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కలెక్టర్‌గా పని చేసిన పీఎస్ ప్రద్యుమ్నను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనతో పాటు బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను కూడా బదిలీ అయ్యారు. మరుసటి రోజే ఆయన స్థానంలో కరీంనగర్ ఆర్వీఎం పీవోగా పనిచేస్తున్న జి.శ్యాంప్రసాద్‌లాల్‌ను బోధన్ ఆర్డీవోగా నియమించారు.
కలెక్టర్‌ను బది లీ చేసిన ప్రభుత్వం ప్రద్యుమ్న స్థానంలో ఎవరినీ నియమించకుండా.. జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్‌రావుకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జాయింట్ కలెక్టర్‌గా ప్రజాపంపిణీ, భూసేకరణ, పునరావాసం తదితర కీలకమైన శాఖల పర్యవేక్షణలో ఉండే ఆయనకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన ప్రణాళిక’ అమలులో వెంకటేశ్వర్‌రావు బిజీ కావడంతో మిగతా శాఖల కార్యక్రమాల అమలు మందగించే అవకాశం ఉందన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది. మన ఊరు - మన ప్రణాళికతో పాటు మేనిఫెస్టోలోని రైతు రుణమాఫీ, రెండు పడక గదులతో ఇళ్ల నిర్మా ణం తదితర పథకాలను అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో సర్వేలు, సమీక్షల వేగం పెరిగింది.
కలెక్టర్ ప్రద్యుమ్న బదిలీ తర్వాత నె ల వ్యవధిలో మూడు పర్యాయాలు పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, కలెక్టర్లను బదిలీ చేసి.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేశారు. కానీ.. నిజామాబాద్‌కు మాత్రం కలెక్టర్‌ను నియమించలేదు. తాజాగా శనివారం ఎనిమిదిమంది ఐఏఎస్‌లు బదిలీ కాగా.. జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ ప్రద్యుమ్నను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. జిల్లాలో ‘మన ఊరు - మన ప్రణాళిక’ అమలుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డిని నియమించారు. అంతే తప్ప జిల్లా కల్టెక్టర్‌ను మాత్రం నియమించకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
రఘునందన్, గిరిజాశంకర్,విజయ్‌కుమార్ పేర్లు?
నిజామాబాద్ కొత్త కలెక్టర్ల జాబితాలో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌గా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు టీఆర్‌ఎస్ సీనియర్‌లను, ప్రజాప్రతినిధులను కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేలను ఎవరికీ వారుగా సంప్రదించినట్లు సమాచారం. కృష్టా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గిరిజా శంకర్, మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరిని నియమిస్తారా..? లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..? అసలు కలెక్టర్ నియామకం ఎప్పుడు జరుగుతుంది..? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో..లేదో చూడాలి మరి.
ఇన్‌చార్జి పాలనఎన్నాళ్లు?
Published Mon, Jul 14 2014 3:08 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement