రుయా ఆవరణలో తనిఖీలు నిర్వహిస్తున్న కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న
తిరుపతి అర్బన్: మీ ఇళ్లలోనూ పారిశుధ్యం ఇలాగే ఉంటుందా.. అంటూ తిరుపతిలోని రుయా వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న కన్నెర్ర చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా అత్యవసర వైద్య విభాగంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్, అక్కడ బెడ్‌కవర్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎంఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విభాగంలో మెడికల్ వేస్ట్ నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. అదేవిధంగా రోగులతోపాటు వారికి సహాయంగా వచ్చేవారు కూర్చునేందుకు తక్షణం సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్బన్ గ్రీన్ కార్పొరేషన్‌తో పచ్చదనం
రుయాకు రోజూ వచ్చే రోగులకు మరింత ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేలా అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పరిసరాల్లో పచ్చదనం కల్పించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీసీ) సమావేశాలను ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహించా లన్నారు. గత సమావేశంలో నిర్ణయించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
భద్రతకు ప్రాధాన్యం..
రుయా, మెటర్నిటీ, చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద భద్రతకు అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందులో భాగంగా 40 అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. రుయాలో సహాయకుల విశ్రాంతి భవనాన్ని ప్రసూతి ఆస్పత్రి రోగుల కోసం విని యోగించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులకు కలిపి సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రుయా పరిపాలనా భవనంలో హెచ్‌డీసీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, హెచ్‌డీసీ సభ్యులు డాక్టర్ సుధారాణి, చినబాబు, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment