సాక్షి,చిత్తూరు(రేణిగుంట): ఏ కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. ఆగి ఉన్న గూడ్సు కింద పట్టాలపై తలపెట్టి పడుకుంది.. అదే సమయంలో రైలు కదిలేందుకు సిగ్నల్ పడింది.. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన రైల్వే పోలీసులు పరుగులు పెట్టారు.. పట్టాలపై నుంచి వృద్ధురాలిని పక్కకు లాగి కాపాడారు. ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉరుకులు పెట్టించిన ఈ ఘటన ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్‌లో జరిగింది. జీఆర్‌పీ ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. రేణిగుంట బాలాజీ కాలనీకి చెందిన వరదరాజులు భార్య పాండియమ్మ(76) సాయంత్రం 6.30గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్ చివరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ కింద తలపెట్టింది.
ఈ విషయం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ సీసీ కెమెరాలో గమనించారు. వెంటనే ఆయన జీఆర్‌పీ స్టేషన్ సమాచారం అందించారు. అప్పటికే రైలుకు సిగ్నల్ పడడంతో ఎస్‌ఐ అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి పరుగుపరుగున పట్టాలపై పడుకున్న వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెను బలవంతంగా పక్కకు లాగేయడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వృద్ధురాలిని కాపాడిన కొద్దిక్షణాల్లోనే రైలు కదలింది. అనంతరం రైల్వే పోలీసులు పాండియమ్మ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలితో ఇంటికి పంపించారు.
చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్
Comments
Please login to add a commentAdd a comment