హైటెక్‌ "కాల్‌" కేయులు: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి.. | Police Arrested A Fake International Calls Gang In Tirupati | Sakshi
Sakshi News home page

హైటెక్‌ "కాల్‌" కేయులు: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి..

Published Fri, Jul 30 2021 8:40 PM | Last Updated on Fri, Jul 30 2021 9:06 PM

Police Arrested A Fake International Calls Gang In Tirupati - Sakshi

సాక్షి,తిరుపతి క్రైం:  తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నెట్‌వర్క్‌ల ఆదాయానికి గండికొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్లో తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, టెలికామ్‌ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్‌ జీవీ మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాలు..అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి కొందరు సంస్థకు నష్టం కలిగిస్తున్నట్లు దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ టెలికం సంస్థ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీస్‌ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేసరికి హైటెక్‌ ‘కాల్స్‌’ కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. వీరికి టెలికాం సంస్థలో పనిచేస్తున్న కొందరు మార్కెటింగ్‌ అధికారులు సహకరించినట్లు తేలింది.  
ఎలా చేశారంటే.. 
ఫోన్‌ వినియోగదారులకు తెలియకుండా వందల సంఖ్యలో వారి ఆధార్‌ కార్డులతో అక్రమంగా సిమ్‌ కార్డులు పొందారు. ఈకేవైసీ సరిగా పడలేదని ఎన్నోసార్లు వేలిముద్రలు వేయించారు. ఆ తర్వాత ఓటీపీ ద్వారా నగరంలోని కస్టమర్ల నుంచి నాలుగు నుంచి పది వరకు అక్రమంగా సిమ్‌ కార్డులు పొంది అక్రమాలకు తెరలేపారు. ఇలా పొందిన సిమ్‌లతో విదేశాల నుంచి +91 ఇన్‌కమింగ్‌ లోకల్‌ కాల్స్‌ ద్వారా మళ్లించి  అధిక ఆదాయం పొందేవారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలా చేస్తుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్, వివిధ ప్రైవేటు సంస్థల సెల్యులర్‌ నెట్‌వర్క్‌ సంస్థల ఆదాయానికే కాకుండా ప్రభుత్వానికి జీఎస్టీ, టాక్స్‌ల రూపంలో తీవ్రం నష్టం వాటిల్లింది.

టెలికం సంస్థ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాల్స్‌ కూపీ లాగితే డొంక కదిలింది. ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడిచేసి సుమారు 1000 సిమ్‌ కార్డులు, డిన్‌స్టార్‌ గేట్‌వే 64, సీపీయూ, ల్యాప్‌టాప్, మొబైల్, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కన్నం రవికుమార్, తిరుపతిలో నివసిస్తున్న హరిప్రకా‹Ù, నీలం కిరణ్‌కుమార్, శేషాఫణి, నారాయణ పార్థసారథి, ఓరుగొండ శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. దీనికంతా వీరే సూత్రధారులని తేలింది. వీరంతా ఎంబీఎ, బీటెక్, డిగ్రీ చదివిన వారే. వీఓఐపీ టెక్నాలజీ సాయంతో వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి వినియోగదారులకు కనెక్టివిటీ ఇచ్చి పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. 

మరింత లోతుగా దర్యాప్తు 
ఈ కేసులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణకు పూనుకుంటున్నారు. నిబంధనలు పాటించని సిమ్‌ కార్డు డీలర్లు, సంస్థలను గుర్తించి లీగల్‌ నోటీసులు ఇస్తామని టెలికామ్‌ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్‌ జీవీ మనోజ్‌కుమార్‌ తెలిపారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement