సంజీవ (ఫైల్)
సాక్షి, కురబలకోట :రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్ల్లడిల్లిపోయారు. అసలే నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. తన కొడు కు మాత్రం తమలా కష్టపడకూడదని, ఇంజినీరింగ్ చదివించారు. కోర్సు అయిపోయిందని, త్వరలోనే ఇంటికొస్తానని కొడుకు చెప్పడంతో ఆ పేద తండ్రికి కాస్త ఊరట కలిగింది. అంతలోనే కొడుకు చావు కబురు రావడంతో గుండెలుపగిలేలా రోదించారు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలం అంగళ్లులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం మేరకు, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన రామచంద్రుడు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజీవ (21), చిన్న కుమారుడు సతీష్(15). రామచంద్రుడు గౌడౌన్‌లో హమాలీగా పనిచేస్తున్నారు. సావిత్రి రోజు కూలీ. అయితే, మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటాలో బిటెక్ (మెకానికల్)లో సీటు సాధించిన సంజీవ ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు పూర్తయ్యాయి. మిత్రులందరూ ఇళ్లకు బయల్దేరుతున్నా, ఇతను మాత్రం ఒక రోజు హాస్టల్లోనే ఉండి ఇంటికెళతానని చెప్పి అక్కడే ఉన్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హోస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తర లించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంజీవ మొబైల్‌ను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయేమో అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుని చేతులపై రక్తపు మరకలున్నాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ సుకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment