పీఎస్ ప్రద్యుమ్న
సాక్షి, అమరావతి: ఎటువంటి ఆధారాలు, పేర్లు లేకుండా రాష్ట్రంలోని ఐఏఎస్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి పేరు పేర్కొనకుండా ‘వసూల్ రాజా’ పేరుతో రాష్ట్రంలోని ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా సత్యదూరమైన కథనాలను ప్రచురించడాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న ఖండించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలనలో పూర్తి పారదర్శకంగా ఐఏఎస్‌ల సంఘం వ్యవహరిస్తుందని, ఈ విషయంలో మీడియా పాత్రను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నారు. కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహాజనితమైన కథనాలను ప్రచురిస్తోందన్నారు. దీనివల్ల ఇతర ఐఏఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందన్నారు.
ఆగస్టు 6న సమావేశమైన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ల జనరల్ బాడీ సమావేశం ఆంధ్రజ్యోతి ప్రచురించిన వరుస వార్తా కథనాలను ఏకగ్రీవంగా ఖండించిందన్నారు. పరిపాలనలో చిత్తశుద్ధి, మంచితనంతో అధికారులు పనిచేస్తారని మరోసారి అసోసియేషన్ స్పష్టం చేస్తోందన్నారు. అలాగే ఆదివారం ప్రచురించిన ‘బెడిసి కొట్టిన భేటీ’ కథనాన్ని కూడా అసోసియేషన్ ఖండించింది. 6వ తేదీ సమావేశంలో ఈ కథనాలపై అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు లేవని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నది అవాస్తవమని, ఏకగ్రీవ నిర్ణయంతోనే అసోసియేషన్ ఈ తీర్మానం చేసిందని ప్రద్యుమ్న స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment