గాంగ్‌టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment