Civil servants
-
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
గాంగ్టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్ -
చిక్కుల్లో సివిల్ సర్వెంట్.. ఆఫీస్‌లో స్మోక్ చేసినందుకు రూ.8 లక్షల ఫైన్!
మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారా? స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటోంది జపాన్ దేశం. ఆఫీస్ ఆవర్స్‌లో వర్క్ పక్కన పెట్టి స్మోక్ చేసేవారికి కఠిన శిక్షలు విధిస్తోంది. 14 ఏళ్ల సర్వీసులో 4,500 కంటే ఎక్కువ సార్లు ధూమపానం చేసినందుకు జపాన్ సివిల్ సర్వెంట్ ఇబ్బందుల్లో పడ్డాడు. పనివేళల్లో సిగరెట్లు కాల్చినందుకు అతడికి 11వేల డాలర్లు ( రూ. 894915) ఫైన్ విధించింది అక్కడి స్థానిక ప్రభుత్వం. ఒసాకాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన చట్టాలు ఉన్నాయి. 2008లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించింది. 2019లో ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో ధూమపానం చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..ఒసాకా నగరంలో 61 ఏళ్ల సివిల్ సర్వెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు సహోద్యోగులు పదేపదే ధూమపానం చేసినట్లు తేలింది. దీంతో వారి ఆరు నెలల పాటు జీతంలో 10 శాతం కోత విధించారు. 2022 సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురూ రహస్యంగా సిగరెట్లు దాచిపెడుతున్నారంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు మళ్లీ ధూమపానం చేస్తూ పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ముగ్గురికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, ముగ్గురు మళ్లీ ధూమపానం చేయడం ప్రారంభించారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులు జరిపిన విచారణలో స్మోకింగ్ గురించి అబద్ధం చెప్పారు. స్థానిక పబ్లిక్ సర్వీస్ చట్టం ప్రకారం 61 ఏళ్ల సివిల్ సర్వెంట్ విధులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వేతన తగ్గింపుతో పాటు, అతని జీతంలో 1.44 మిలియన్ యెన్లను తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యక్తి డ్యూటీలో 355 గంటల 19 నిమిషాల పాటు పొగ తాగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్‌లోనే అధికమని మొన్న ఏప్రిల్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్‌కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
సివిల్స్‌రిజర్వ్ జాబితాలోని 53 మందికి సర్వీస్
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్ ఫలితాల్లోని రిజర్వ్ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. సివిల్స్–2018 పరీక్షా ఫలితాలను యూïపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. అందులో 759 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బీ పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్ సర్వీస్ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్ లిస్ట్ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు. -
సంయమనమే మన విధి
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీస్ అధికారులు(సివిల్ సర్వెంట్లు) ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారితే ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఎవరెంత రెచ్చగొట్టినా సంయమనం పాటిద్దామని అన్నారు. జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఒక్క బంతి సరిగ్గా ఆడకపోయినా ఔట్ అయినట్లేనని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లో అయితే ఒక బంతి అడటంలో విఫలమైనా మరోసారి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని, క్రికెట్లో అలా ఉండదని గుర్తుచేశారు. సివిల్ సర్వెంట్ ఉద్యోగం లాంగ్‌టర్మ్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని, వివాదాలకు, తప్పులకు తావివ్వకుండా పని చేయాలని సూచించారు. సివిల్ సర్వెంట్ డే సందర్బంగా శనివారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత సర్వీస్ అధికారులను ఉద్దేశించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అధికారులు ఎలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఉద్బోధించారు. ఏం చేయాలో? ఏం చేయకూడదో విశదీకరించారు. విలువలను కాపాడడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని, సీనియర్ అధికారులు మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ స్థానంలో నిలిపేలా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ‘‘మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలి. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారి ఉద్యోగాలు పోగొట్టుకున్న అధికారులు నాకు తెలుసు. ఒకటో బ్లాక్‌లో చేసినా, రెండో బ్లాక్‌లో చేసినా తేడా ఏమీ ఉండదు.(స్పెషల్ సీఎస్‌గా ఉన్నా, సీఎస్‌గా పనిచేసినా అని పరోక్షంగా చెప్పారు) ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమాజ సర్వతోముఖాభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అఖిల భారత సర్వీస్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలి. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ, మానవత్వం, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలుగా పని చేయాలి. వారసత్వ సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, ప్రోత్సాహానికి సివిల్ సర్వెంట్లు అన్ని విధాలా కృషి చేయాలి. విలువలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాలి. జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా నిలవాలి’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు. చైనాలో సివిల్ సర్వెంట్ల విధానం మనకంటే ముందుగానే అమల్లోకి వచ్చిందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వపు డైరెక్టర్ జనరల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.ప్రశాంత మహాపాత్ర తెలిపారు. మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. అవినీతి నియంత్రణకు కృషి చేయాలి సివిల్ సర్వెంట్లు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని గుజరాత్ రాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్ జనరల్ పి.కె.తనేజ సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో న్యాయబద్ధమైన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు ధైర్యంగా కృషి చేయాలన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఫీజుల్లేని పాఠశాల..!
అంధ, బదిర పిల్లల అభివృద్ధే ధ్యేయంగా, సమాజంలో వారికి మంచి గుర్తింపు రావాలన్నదే ఆశయంగా ఓ పాఠశాల పాటుపడుతోంది. వ్యక్తిగత అనుభవాలను రంగరించి విద్యాబోధనకు జోడించి వారి భవితకు సహకరిస్తోంది. పరీక్షలు మార్కులే ధ్యేయంగా పోటీ తత్తంలో నిర్వహిస్తున్న పాఠశాలలున్న నేటి తరుణంలో... ఇబ్బడి ముబ్బడి ప్రవేశాలకు దూరంగా... ఒక్క రూపాయి కూడ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఆ విద్యాలయం కొనసాగుతోంది. 1998 లో ఆచార్య రకుమ్ స్థాపించిన ఆ సంస్థ.. నేడు ఎంతోమంది పౌరులను దేశానికి అందిస్తోంది. ఆచార్య శ్రీ రకుమ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్... బెంగళూరులో 1998 లో స్థాపించి ప్రస్తుతం మూడు శాఖలను నిర్వహిస్తోంది. ఎటువంటి ప్రభుత్వ, విదేశీ సంస్థలనుంచీ ఆర్థిక సాయం ఆశించకుండా... పిల్లలకు ఉచిత శిక్షణతోపాటు, ఆహారం, దుస్తులు, వృత్తి శిక్షణ అందిస్తోంది. ప్రజల సహాయ సహకారాలతో విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా సాకుతోంది. ప్రస్తుతం ఆరు వందలమంది విద్యార్థులతో ఆ విద్యాలయం దిన దిన ప్రవర్థమానమౌతోంది. మారు మూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలనుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ చేరుతుంటారు. ఎటువంటి ఆర్థిక సాయం లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో ప్రతిరోజూ తమకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, పాలు వంటి వస్తువుల జాబితాను విద్యార్థులు బ్లాక్ బోర్డ్ పై రాసి బయట పెడతారు. స్థానిక ప్రజలు, దయ కలిగిన వారు బోర్డును చూసి స్పందించి వారికి తోచిన సహాయం అందిస్తుంటారు. మిగిలిన అవసరాలు మాత్రం పిల్లల జీవిత పోరాటంలో భాగమేనని నిర్వాహకుడు రకుమ్ చెప్తారు. 1988 లో రికార్డు నెలకొల్పిన కరాటే ఛాంపియన్ రకుమ్. పలురకాల విద్యల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆయన... జపనీస్ సహా పలు భాషల్లో మాట్లాడగలడు. నేచురోపతి వైద్యంలో కూడ ప్రావీణ్యం కలిగిన వాడు. విద్యార్థులను ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నంతోపాటు, వారికి మార్షల్ ఆర్ట్స్ లో కూడ తర్ఫీదునిస్తున్నారు. సెలవుదినాల్లో వంట, కార్పెంటరీ, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ రిపేర్లు నేర్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి దాటిన పిల్లలకు సైక్లింగ్, డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. జీవితంలో వారు ఏ పరిస్థితిలోనైనా ధీమాగా బతకగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠశాల వయసునుంచే వారికి అందిస్తున్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలో ఎంతోమంది యోగాలో ప్రావీణ్యం పొంది, కరాటేలో బ్లాక్ బెల్ట్ పొంది ప్రపంచంలో ఎక్కడైనా తమ విద్యను వినియోగించుకునే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివిన పిల్లలు సివిల్ సర్వెంట్స్ అవ్వాలన్నది పాఠశాల నిర్వాహకుడు రకుమ్ ఆకాంక్ష. అందుకే విద్యార్థులకు ఆరోక్లాసునుంచే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడ రాశారు. అయితే ఈ పాఠశాలలో ఇటీవల పిల్లల అవసరాలు తీరడం కొంత కష్టంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బోర్డుపై తమ అవసరాలను రాసే విద్యార్థులు, ఇప్పడు ఫేస్ బుక్ పేజీల్లో కూడ పెడుతున్నారు. దీనికి స్పందించి అందించిన సహాయంతో కాలం గడుపుతున్నారు. ఇటువంటి పిల్లల బాధ్యత తన ఒక్కడిదే కాదని, సమాజానికి కూడ బాధ్యత ఉందని రకుమ్ అంటున్నారు. అయితేనేం అనుకున్నది సాధించేందుకు రకుమ్ పాటు పడుతున్నారు. దయగలవారెవరైనా ఇటువంటి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని సూచిస్తున్నారు. -
63 మంది అధికారుల 'బలవంతపు' పదవీవిరమణ
శ్రీనగర్: అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులపై జమ్ముకశ్మీర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తోన్న 63 మంది అధికారులు తక్షణమే స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రికిరాత్రే ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పేరుతో సదరు అధికారులకు లేఖలు పంపారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని రూపుమాపేందుకు కొద్ది నెలలుగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగానే అధికారుల తొలిగింపు ప్రక్రియకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత మార్చి నెలలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ కందాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవినీతి ప్రక్షాళన కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలకు దిగింది. -
అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం
సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) గురించి పెద్ద రగడే జరుగు తోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న సీశాట్‌ను తొలగించవలసిందని ఢిల్లీలో నిరస నలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రతిభాస్వామ్యానికి వ్యతిరేకు లుగా చిత్రిస్తున్నారు. ప్రాంతీయ భాషలలో చదువుకున్న వారికి కూడా ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యం ఇవ్వా లంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయమని కోరుతున్నం దుకే ఇలా విమర్శలు కురిపిస్తున్నారన్న మాట వాస్తవం. సీశాట్‌ను తొలగించ మని కోరే వారంతా ఆంగ్ల భాషకు శత్రువులైనట్టు, సొంత భాష మీద విపరీత ప్రేమను చూపిస్తున్న చాందసులన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తు న్నారు. ప్రాంతీయ భాషలలో కూడా ప్రశ్న పత్రం అందించాలని కోరడమే నేరంగా పేర్కొంటున్నారు. మౌఖిక పరీక్షలో ప్రాంతీయ మాధ్య మాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న సంగతి చెబితే, ఇంగ్లిష్ మాట్లాడేవారే సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా రని వింత వాదన వినిపిస్తున్నారు. సేవాగుణానికీ, పాలనా సామర్థ్యానికి భాషతో సంబంధం లేదన్న వాదనలను పెడచెవిన పెడుతున్నారు. నిజంగానే సీశాట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా ప్రతిభాస్వామ్యానికి బద్ధ శత్రువులేనా? యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే ప్రతిభాస్వామ్యానికి కొలమానమా? ఇప్పుడు నిర్వహిస్తున్నది నిజంగానే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టేనా? సీశాట్ పరీక్ష అనంతరం తలెత్తిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. సీశాట్ ఎందుకు వచ్చింది? యూపీఎస్సీ దృష్టిలో సివిల్ సర్వీసెస్ పట్ల అభ్యర్థి అభిరుచికి కొలమానం ఏమిటి? లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారంలో నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, మౌఖిక భావ ప్రకటనా నైపుణ్యం, ప్రాథమిక స్థాయి గణితం, జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - అని యూపీఎస్సీ సిలబస్‌ను బట్టి తెలు స్తుంది. ఈ అంశాలలో వెనుకబడిన వారు సివిల్ సర్వీసెస్‌కు అనర్హులని యూపీఎస్సీ నిర్ధారిస్తున్నది. యూపీఎస్సీ 2011లో సీశాట్‌ను ప్రవేశపెట్టిన పుడు అంతా పురోగమన చర్యగా భావించారు. 2010 సంవత్సరం వరకు అభ్యర్థులు అనేక ఐచ్ఛికాంశాల నుంచి ఒకదానిని ఎంచుకునేవారు. అయితే అన్ని ఐచ్ఛికాంశాల ప్రశ్నపత్రాలను ఒకే స్థాయిలో రూపొందించడం అసాధ్యం కావడం, ఐచ్ఛికాంశాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండడం, ఆ జాబితాలో రెండు మూడు ఐచ్ఛికాంశాలను ఎంచుకున్న వారే అధికంగా కృతార్థులు కావడం వంటి సమస్యలను తరు వాత గమనించారు. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్కేలింగ్ విధా నం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఐచ్ఛికాంశం స్థానంలో అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే ఉమ్మడి పరీక్షను ప్రవేశపెట్టింది. అదే సీశాట్. ఐచ్ఛికాంశాలను తొలగించడం వల్ల సమతౌల్యం సాధించే అవకాశం ఉందని అప్పుడు అభ్యర్థులంతా భావించారు. శాపంగా మారిన పరీక్ష అయితే సీశాట్‌తో అనుభవాలు వేరుగా ఉన్నాయి. భాషాపరంగా వివిధ రకాల చదువుల నేపథ్యాల నడుమ 1979 నుంచి కాపాడుకుంటూ వచ్చిన తటస్థ వైఖరిని నాశనం చేసే విధంగా సీశాట్ రూపు దాల్చింది. యూపీఎస్ సీయే సీశాట్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ప్రవేశపె ట్టడం వెనుక ఉన్న హేతువును బలహీనపరిచింది. సివిల్ సర్వీసెస్ పట్ల అభి రుచితో పాటు, సరైన దృక్పథం ఉన్నవారు కూడా వైదొలగే రీతిలో ప్రశ్నలను రూపొందించడం శోచనీయం. సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. ప్రాంతీయ భాషల మీద వేటు ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నట్టు సీశాట్ మీద నిరసన అంటే సాధారణ ఇంగ్లిష్ మీద పోరాటం కాదని అంతా అర్థం చేసుకోవాలి. సీశాట్ ను వ్యతిరేకిస్తున్నవారంతా ఇంగ్లిష్‌లో రాయగల కనీస పరిజ్ఞానం ఉన్నవారే. మెయిన్స్‌లో ఉండే తప్పనిసరి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని సమర్థంగా ఎదుర్కొనగ లిగినవారే కూడా. అసలు ఈ కారణంతోనే ఇలాంటి వారిని ప్రాథమిక పరీ క్షలో గట్టెక్కనీయకుండా తప్పిస్తున్నారు. ఇతర విభాగాలలో మంచి పట్టు ఉన్న అభ్యర్థులు కూడా కాంప్రహెన్షన్‌లో తక్కువ మార్కులు సాధించడం వల్ల అపజయం పాలవుతున్నారు. సీశాట్‌లో ఇచ్చే ప్రశ్నలు, అభ్యర్థికి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్న అభిరుచి ఏపాటిదో వెల్లడించేందుకు ఉపకరించేవి కా కుండా, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంత అన్నది తేల్చడానికే సరిపోతాయన్న రీతిలో ఉంటున్నాయి. జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు తెచ్చుకునేలా రూపొం దిస్తూ ఉంటే, సీశాట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనువుగా రూపొం దుతోంది. సీశాట్‌లో అర్హత సాధించిన వారి మార్కులను పరిశీలిస్తే, మూడింట రెండువంతులు ఇందులోనే సాధిస్తున్నారు. జనరల్ స్టడీస్‌లో తెచ్చుకుంటున్న మార్కులు కేవలం మూడింట ఒక వంతు. 2010లో హిందీతో పాటు, ఇతర ప్రాంతీయ భాషలను మెయిన్స్‌లో రాత పరీక్ష మాధ్యమంగా ఎంచుకుని రాసిన అభ్యర్థులు 4,156 మంది. సీశాట్ ప్రవేశ పెట్టిన 2011లో ఆంగ్లేతర భాషలలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 1,682. కటాఫ్‌ను తగ్గించిన ఆప్టిట్యూడ్ ఇంతకీ ఇంత ‘ఆప్టిట్యూడ్’ ఉన్న అభ్యర్థులు మెయిన్స్‌లో చూపించిన ప్రతిభ ఎంతటిది? సీశాట్‌ను ప్రవేశ పెట్టాక మెయిన్స్‌లో కటాఫ్ మార్కును దారు ణంగా దించవలసి వచ్చింది. ఉదాహరణకు 2014లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1750 మార్కులకు గాను, కనిష్టంగా 564 (32 శాతం) మార్కులు మాత్రమే సాధించారు. 2014 ‘టాపర్’ జనరల్ స్టడీస్‌లో సాధించిన మార్కులు కేవలం 33.8 శాతం. సీశాట్ ప్రవేశపెట్టక ముందు టాపర్లుగా నిలిచిన నాగరాజన్, అద్దంకి శ్రీధర్‌బాబు వంటి వారు జనరల్ స్టడీస్‌లో 70 శాతం మార్కులు సాధించారు. సివిల్ సర్వీసెస్‌కు కీలక మైన జనరల్ స్టడీస్‌లో ప్రతిభ లేని వారు ఇప్పుడు టాపర్లుగా నిలుస్తున్నా రంటే అందుకు కారణం, ఇంగ్లిష్, గణితాలేనని చెప్పకతప్పదు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతానికి దేశ సమస్యలపై అవగాహన లేదని యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్ కొంత కాలం క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, సామాజిక సమస్యల కంటె, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీశాట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సీశాట్ అమలులోకి వచ్చిన తరు వాత వచ్చిన గణనీయమైన మార్పు - విజేతలలో ఇంజనీరింగ్, మెడిసిన్ నేపథ్యం ఉన్న వారి సంఖ్య విశేషంగా పెరిగింది. 2004 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2011 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది. ఆ చదువుల నేపథ్యంతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మూడింట రెండు వంతుల వరకు ఉంది. సీశాట్‌తో మారిన యూపీఎస్సీ ఎంపిక తీరు 2004 2011 ఇంజనీరింగ్ 23.40 41.76 మెడిసిన్ 8.39 13.11 సైన్స్ 5.30 4.90 హ్యుమానిటీస్ 16.56 9.21 సీశాట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రహస్య ప్రణాళిక ఉంది. డీపీ అగర్వాల్ 2008లో యూపీఎస్సీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీలో బోధిస్తూ ఈ పద విని చేపట్టిన అగర్వాల్ అన్ని అంశాలను ఇంజనీరింగ్ నేపథ్యంతో ఆలోచిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్, ఐఐఎంల నుంచి సివిల్స్ వైపు అభ్యర్థులను ఆకర్షించే విధంగా పరీక్ష విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఖన్నా కమిటీ సిఫారసుల మేరకే జరిగాయని ఆయన అంటున్నారు. ఆ కమిటీ అగర్వాల్ సూచనల మేరకే పని చేసింది. ఏ విధంగా చూసినా సీశాట్ గురించి పునరాలోచించవలసిన సమయం వచ్చింది. ప్రేమ విఘ్నేశ్వరరావు. కె. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
నేడు ప్రత్యూష్‌సిన్హా కమిటీ భేటీ
-
హైదరాబాద్ మీద మోజుతో ఐఏఎస్‌ల కేడర్ పీకులాట
తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతుంటే అందరి కంటే ఎక్కువ బాధపడిపోతున్న వారు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఎఫ్ఎస్ అధికారులంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఎఫ్ఎస్ దొరలు అంతగా ఇదైపోవడానికి రాష్ట్రం మీద ప్రీతి, ప్రజల పట్ల అక్కర, సమైక్యాంధ్ర అంటే మక్కువ... వగైరాలేమీ కాదు. తమ సుఖం, సౌఖ్యాలకి సంబంధించిన అంశాలే వారి ఆందోళనకి మూలం. అన్నిటికీ కేంద్రమైన హైదరాబాద్ అంటే ఉన్న తగని ఆకర్షణే వారి గాబరాకి కారణం. తన పబ్బం గడుపుకోడానికి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తగవులు పెట్టే తెరాస అధినేత కల్వకుర్తి చంద్రశేఖరరావు హుకుం జారీ చేసినట్టు సీమాంధ్ర ఉద్యోగులు తట్టా బుట్ట తీసుకొని, పెట్టే బేడా సర్దుకొని తమ ప్రాంతాలకి తరలి వెళ్లిపోవాలి. ఎక్కడ పెరిగినా, పుట్టిన గడ్డ బట్టి ప్రజలనైతే ఖండఖండాలుగా చీల్చవచ్చుగానీ; "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇలా ఆంధ్రప్రదేశ్ కేడర్ అనే ముద్ర వల్ల ఇక్కడికి వచ్చాం గానీ,ఈ ప్రాంతంతో, ప్రజలతో, వాళ్ల బాధలతో, మనోభావాలతో, ఉద్వేగాలతో మాకేం పని? సీమాంధ్రలో ఉద్యోగం చేస్తున్న 'పాపానికి ' మేము సీమాంధ్ర కేడర్‌గా మిగిలి పోవాలా? కనీసం ‘గుడ్డిలో మెల్ల’ అన్నట్టు హైదరాబాదైతే మేము ఏదోలా సరిపెట్టుకోగలంగానీ," అంటూ సీమాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు నానా హైరానా పడితోతున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, తమ ఆక్రోశాన్ని బాసుదేవుడు చీఫ్ సెక్రటరికి మొరపెట్టుకున్నారని తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా గడిపే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు,పబ్బులూ హైదరాబాదులో తప్ప మరెక్కడా లేక పోవడం వల్ల, ఈ కనీస సౌకర్యాలకి కూడా వారిని నోచుకోకుండా తమని శాశ్వతంగా పరాయి ప్రాంతాల పాలుచేయడం సబబు కాదని వారు వాపోయారు. హోదా, అధికారం, ఆదాయం కూడా అధికంగా ఉండే టుబాకో బోర్డు చైర్మనుగా గుంటూరు వెళ్లినప్పటికీ, కార్పోరేషన్ స్థాయి ఉన్న గుంటూరు కంటికి ఆనక, వారి కుటుంబాల్ని మాత్రం 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదులో ఉంచిన ఐఏఎస్‌లు ఎందరో. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ విషయానికొస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన 1982 బ్యాచ్ ఆఫీసర్. ఆయన కేంద్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లారు. 2009లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కన్వీనర్‌గా పని చేశారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి హోదాలో నక్సలైట్ మేనేజ్మెంట్ - అదనపు కార్యదర్శిగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల కేంద్రం నియమించిన టాస్కుఫోర్సు బృందంలో కూడా సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన డిప్యుటేషన్ కాలపరిమితి ముగిసి, ఆయన రాష్ట్రానికి తిరిగి రావల్సి ఉండగా, ఆయన ప్రత్యేక తెలంగాణ తకరారుని దృష్టిలో ఉంచుకొనే ఢిల్లీలో కొనసాగేందుకు తన స్థాయిలో లాబీయింగు చేసుకుంటున్నారని, ఎంఎంటిసి లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టరు పదవి కోసం ఆయన పైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద, ఆంధ్ర- తెలంగాణ కేడర్ అంటూ ఒక ప్రత్యేకమైన జాయింట్ కేడర్ కల్పించి, తమని అందులో చేర్చడమే ఈ సమస్యకి పరిష్కారమని వారు సూచిస్తున్నారు. అస్సాం- మేఘాలయ, మణీపూర్- త్రిపుర వంటి ఉభయ రాష్ట్రాలకి సంబంధించిన కేడర్లు దేశాంలో ఇప్పటికే ఉన్నాయి కాబట్టి, ఆ దిశలోనే ఆంధ్ర- తెలంగాణ కేడర్ సృష్టించాలని వారు మొర పెట్టుకుంటున్నారు. విభజన చిచ్చుతో రాష్ట్రం రావణకాష్ఠంలా రగిలిపోతుంటే, అదేమీ పట్టనట్టు ఉన్నతాధికారులు సొంతలాభాలు చూసుకోవడం అన్యాయమని వారి కింద ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. -
పౌర సేవకు సరికొత్త తోవ
రాజకీయ నాయకుల జోక్యం నుంచి ఐఏఎస్ అధికారులను కాపాడి, నియమ పాలనకు వారి పాలన ఉపకరించేట్లు చేయాల న్న తపన సుప్రీంకోర్టు (అక్టోబర్ 31) తీర్పులో వ్యక్తమైంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ‘ఐదేళ్లపా టు మాకు తిరుగులేదు. మేమ న్నమాటే చెల్లాల’ని అంటూ నేత లు ‘రూల్స్ ఒప్పుకోవ’ని చెప్పే అధికారులను బదిలీ(లు) చేసే దుర్మార్గాన్ని నిరోధించా లన్న ఆరాటం ఈ తీర్పులో కనిపిస్తుంది. భారత పాలనా సేవకులు అని ఇండియన్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్‌ను తెలుగులో చెప్పవచ్చు. కాని ‘సివిల్ సర్వెంట్’- పౌర సేవకులు అనడమే సరైనది. కాని వారు తమకు తాము ప్రజాధికారులము అనుకుంటే ప్రజలకూ ప్రజాస్వామ్యానికీ న్యాయం జరగదు. పౌరులకు సేవలు చేయడమా లేక రాజకీయ నాయకుల ఆజ్ఞలు పాటించి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కీడు చేయడమా అనేది ఇప్పుడు అప్పుడూ ఐఏఎస్‌ల ముందున్న ప్రశ్న. న్యాయస్థానం గుర్తుచేయాలా? ఇదంతా నీతి, విలువకు సంబంధించిన విషయం. కాని చట్టపరమైన నియమాల రూపంలో లేదు. పార్లమెంటు చట్టం చేయాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఆర్టికల్ 309 కింద పార్లమెంటు సొంతంగా సివిల్ సర్వీసెస్ చట్టం చేయవలసిన అధికారం ఉండి ఆ అధికారం వినియోగిం చుకోకుండా వదిలేస్తే, ఆ పని చేయండి మహాప్రభో అని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయవలసి రావడం ఎంత వింత? పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రత్యామ్నాయం గా ఈ తీర్పులో ఆదేశాలు చట్టం వలె పనిచేయాలన్నది సుప్రీంకోర్టు సంకల్పం. అధికారుల నియామకం, బదిలీ, వారిపైన ఫిర్యాదుల విచారణ, క్రమశిక్షణ చర్య తీసుకోవ డం వంటి అధికారాలు కలిగిన ఒక సివిల్ సర్వీసెస్ బోర్డు (సీఎస్బీ)ను కేంద్రంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపా లిత ప్రాంతంలోనూ మూడు నెలలలోగా రూపొందించా లని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిలబడనీయకుంటే ఎలా? ఎక్కడ ఎన్నాళ్లు పనిచేస్తారో తెలియదు. ఏ పోస్టింగూ లేకుండా ఎన్నాళ్లుండాలో తెలియదు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి దయలేకపోతే ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఊరికే ఉం డాలి. అడిగిన పనులన్నీ చేసి ఎక్కడబడితే అక్కడ ఏ ఫైలు మీదైనా సంతకం చేస్తే చాలు. ఎంపీలను చేస్తాం, మంత్రు ల్ని చేస్తాం, గవర్నర్ పదవులిస్తాం అనే స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోతే దేశం ఏమైపోతుందనే ప్రశ్న జనం ముందున్నది. ఈ అధికారులకు కనీస పదవీ కాలం ఉండా లన్న అంశంపైన 13 రాష్ట్రాల వరకు అంగీకరించాయి. కనీ సం రెండేళ్లో మూడేళ్లో ఉంటామని ముందే తెలిస్తే ఆ మేరకు అధికారులు తమ వృత్తి పరమైన ధర్మం నిర్వ హించి, లక్ష్యాలు నెరవేర్చి, జనులకు మేలు చేసి వెళ్లవచ్చు. ఏడాదికి లేదా ఆర్నెల్లకే బదిలీ చేస్తే ఏం చేయగలరు? కర్ణాటకలో ధనంజయ్ పిళ్లై అని ఒక మునిసిపల్ ఇంజనీరు. ఆయనకు అనుభవం అర్హతల ఆధారంగా పదో న్నతి ఇవ్వాలి. కాని ఇవ్వలేదు. ఆయన కనీసం పదకొండు సార్లు ట్రిబ్యునల్లను, కోర్టులను ఆశ్రయించాడు. ఎన్ని తీర్పులు వచ్చినా కక్షగట్టినటు ప్రభుత్వం అప్పీలుకు వెళ్లేది. సుప్రీంకోర్టు సైతం ఆయనకు ‘పదోన్నతి ఇవ్వండి’ అని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించి, గడువు కూడా విధిం చింది. ఇవ్వలేదు. ఆయన కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇచ్చిన గడువులో ఆదేశాన్ని పాటించనందుకు నెలరోజుల జైలు శిక్ష విధించింది. చాలా బాగుంది. కాని ఎవరికి? ఆనాటి ముఖ్యమంత్రి దేవెగౌడ కు కాదు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వాసుదే వన్‌కు పడింది ఆ శిక్ష. పాపం, ఆయన నెల్లాళ్లు జైలుకు పోక తప్పలేదు. ఆయన చేసిన తప్పేమిటంటే, ‘తర్వాత చూద్దాం’ అని దేవెగౌడ నోటి మాటగా చెప్పిన దాన్ని నోట్ గా మార్చి సంతకం తీసుకోకపోవడమే. ఎవరో ఒకరికి శిక్ష పడాలి, కనుక వాసుదేవన్ జైలుకు వెళ్లారు. నోటి మాటను నోట్‌గా మార్చేలోగా తీవ్ర నష్టం జరగవచ్చు. నోటిమాటలే జీవోలు కావాలి డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ‘నా మాటే ఒక జీవో’ అన్నారు. కాని ఆ మాట అన్న తరు వాతనైనా జీవో ఒకటి రావడం ఫైళ్లో చేరడం అవసరం కదా! ఎస్ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్ వంటి అధి కారుల పాలనా విధానం స్ఫూర్తినిస్తుంది. కాని వినేదెవరు? వారు ఎందరికి గుర్తున్నారు? వారి దారిలో ఉండి నానా కష్టాలు పడే వారిని ఎవరు ఆదుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు చదివి కొంత ఆనందిస్తారేమో గాని వారికి జరిగిన అన్యాయాలు ఎవరు తీరుస్తారు? సుప్రీం కోర్టు సూచించిన రీతిలో సివిల్ సర్వీసు చట్టం చేసినా రాజ్యాంగ పీఠాల్లో ఉన్న రాజకీయ నాయకుల నోటి మాట ఆదేశాలను పాటించకూడదు అని నిర్దేశించడం సాధ్యం కాదు. కాని అధికారులు తమకు అందిన మౌఖిక ఆదేశా లను కాగితం మీద పెట్టి తీరాలని 2004లో హొతా కమిటీ, 1962లో సంతానం కమిటీ సూచించాయి. అఖిల భారత సర్వీసు నియమాలు రూల్ 3(3)3లో పైఅధికారుల ఉత్త ర్వులు సర్వసాధారణంగా రాతపూర్వకంగా ఉండాలని స్పష్టంగా ఉంది. మరి ఎందుకు పాటించడం లేదు? అత్య వసర పరిస్థితిలో, ఆ మాటల ఆనతులు పాటించిన తరు వాత వాటిని ధృవీకరిస్తూ రాతపూర్వకంగా కూడా ఆదే శాలు ఇవ్వడంపై అధికారి బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తు చేయవలసి వచ్చింది. ఆదేశాలు తీసుకున్న కింది అధికారి కూడా వీలైనంత తొందరగా నోటి మాట ఆదేశాలను నోట్ మాటగా మార్చడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు వివరించింది. అంతా నమోదు చేయాలి అధికారికి ఎవరు ఏ తేదీ, ఏ సమయంలో ఏం చెప్తే అది, ఏ తేదీ ఏ సమయంలో తను ఏం చేశాడోఊడా రాసి పెట్టు కోవాలి అని కూడా సుప్రీంకోర్టు సూచించింది. తాము తీసుకున్న చర్యలకు కారణాలను, పై అధికారి ఆదేశాలను పత్రబద్ధం చేయకపోతే, దానికి సంబంధించిన సమాచారా న్ని అడిగిన వారికి ఆ తరువాత ఏ విధంగా ఇవ్వగలుగు తారు? సమాచార హక్కు చట్టం కింద కోరిన వారికి ఇవ్వ వలసిన సమాచారం కాగితాల మీద పెట్టకపోతే సమా చార హక్కు చట్టం లక్ష్యమే దెబ్బతింటుంది. రూల్ 3(3)3 వంటి నియమాలను నిర్దేశిక సూత్రాలుగా మూడు నెల ల్లోగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 83 మంది పౌర సేవాధికారులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. బలహీనమైన ప్రభుత్వం, బలహీనమైన పౌర సేవలు, విపరీతమైన క్రమబద్ధీకరణ, వ్యక్తిగత లాభాల కోసం ఇష్టం వచ్చిన రీతిలో జోక్యం చేసుకోవడం, వృథా ఖర్చు లు, పారదర్శకతలో లోపాలు, జవాబుదారీ తనం లేకపో వడంవల్ల ప్రభుత్వం తలపెట్టిన మంచి పథకాలు, విధా నాలు, పనులు కూడా ప్రభావం చూపడం లేదని పిటిష నర్లు ఈ పిల్లో పేర్కొన్నారు. సుపరిపాలన లేకపోతే పౌర జీవన నాణ్యత దెబ్బతింటుందని ఆ మేరకు ఆర్టికల్ 21 భంగపడినట్టే కనుక తమకు న్యాయం చేయాలని కోరారు. వేధింపులు అనంతం రాబర్ట్ వధేరా భూముల వ్యవహారాలను విచారించినం దుకు అశోక్ ఖెమ్కాను బదిలీలతో వేధించడం ఇటీవలి చరిత్రే. మతపరమైన జాగ్రత్తలు తీసుకున్నందుకు దుర్గా శక్తి నాగపాల్‌ను ఎంత వేధించారో తెలుసు. చివరకు మత కల్లోలాలలో మామూలు జనం ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని రుజువైపోయింది. ఇటువంటి ఉదాహరణల మధ్య సుప్రీంకోర్టు విలువైన తీర్పు ఇచ్చిం ది. ఉన్నదున్నట్టు చెప్పాలంటే అధికారులదే అధికారం అంతా. రాజ్యాంగం ఎన్ని చెప్పినా, పాలనా శాస్త్రం ఎంత నిక్కచ్చిగా నియమాలు చేసినా, సమాచార హక్కు చట్టం గుట్టురట్టు చేయాలని చట్టబద్ధంగా చెప్పినా, ఐఏఎస్ అధి కారుల చేతిలో కలం బలం, ఐపీఎస్ అధికారుల చేతిలో తుపాకీ బలం విస్తారంగా ఉన్నాయి. సరైన సలహాలు తీ సుకుని వారు అవినీతి వైపు మళ్లకుండా జాగ్రత్తపడే తెలి వైన నాయకుడు ఉంటే దేశం బాగుపడుతుంది. లేకపోతే వారూవీరూ కలిసి ‘బాగు’ పడతారు. దేశం నష్టపోతుంది. తప్పును ఏ చట్టమూ ఒప్పుకోదు చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటించాలని అధికారులకు ఏ చట్టమూ ఏ నియమాలూ చెప్పవు. ఆ ఆదేశం నోటి మాట రూపంలో ఉన్నా లిఖిత పూర్వకంగా ఉన్నా సరే చట్ట బద్ధంగాని ఆదేశాలను చట్టవ్యతిరేకమైన ఆదేశాలను పాటి స్తే అధికారులు తప్పుకోలేరు. పై అధికారులు ఇచ్చిన చట్ట బద్ధమైన ఉత్తర్వులు పాటించినప్పుడే కింది అధికారులకు నేరపరమైన చర్యల నుంచి తప్పుకునే మినహాయింపులు వర్తిస్తాయి, లేకపోతే వర్తించవని ఐపీసీలో ఉంది. ఈ విష యం చెప్పడానికి న్యాయ నిపుణుల అవసరం లేదు. రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలు ఇవ్వకూడదనే నీతిని రాజ కీయ నాయకులు ఎంతగా పాటించాలో, అటువంటి ఆదే శాలను పాటించకూడదనే నీతినీ పాటించాలి. -ఆచార్య మాడభూషి శ్రీధర్, నల్సార్ విశ్వవిద్యాలయం -
కర్రపెత్తనం చెల్లదిక : సుప్రీంకోర్టు
ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి సివిల్ సర్వెంట్లకు విముక్తి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు న్యూఢిల్లీ: అధికారులపై ప్రభుత్వాల కర్ర పెత్తనం ఇకపై చెల్లబోదు. సర్కారు పెద్దల కబంధ హస్తాల బారి నుంచి సివిల్ సర్వెంట్లకు సర్వోన్నత న్యాయస్థానం విముక్తి కల్పించింది! పాలకులు తమతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, బదిలీలు-పదోన్నతులు-క్రమశిక్షణ చర్యల వంటివాటిని ‘దారికి తెచ్చుకునే అస్త్రాలుగా’ వాడుతున్నారని కొంతకాలంగా వారు చేస్తున్న వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఆలిండియా సర్వీసు అధికారులను చీటికీమాటికీ ఇష్టానుసారంగా బదిలీ చేసే పెడ పోకడకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసింది. ‘‘రాజకీయ జోక్యం బారి నుంచి సివిల్ సర్వెంట్లకు పూర్తి రక్షణ ఉండాలి. అందుకు వీలుగా ఏ పదవిలోనైనా వారిని నిర్దిష్ట కాలం పాటు కదపకుండా విధిగా కొనసాగించాల్సిందే’’ అంటూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సివిల్ సర్వెంట్లను ఒక్కో పోస్టింగ్‌లో కనీసం ఎంత కాలం కొనసాగించాలో (ఫిక్స్డ్ టెన్యూర్) నిర్ధారించేందుకు వీలుగా మూడు నెలల్లోగా నిర్దేశకాలను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది! వారి పోస్టింగులు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తదితరాలను నియంత్రించేందుకు సివిల్ సర్వీసుల బోర్డు (సీఎస్బీ)ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఒక చట్టం చేయాలని ఆదేశించింది. అప్పటిదాకా ఆ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల, యూటీల స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి, చట్టబద్ధ అధికారాలతో కూడిన బోర్డులను మూడు నెలల్లోపు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. తద్వారా పాలన వ్యవస్థ, ఉద్యోగిస్వామ్యాల పనితీరులో పెను సంస్కరణలకు సుప్రీంకోర్టు బాటలు పరిచింది. అంతేగాక అధికారులు కూడా రాజకీయ బాసుల మౌఖిక ఆదేశాలను అసలే స్వీకరించరాదని స్పష్టం చేసింది. ‘‘వారు కేవలం తమకందే లిఖితపూర్వక ఆదేశాలకు, లేదా సమాచారానికి అనుగుణంగా మాత్రమే నడచుకోవాలి. ఏ చర్యలనైనా వాటి ఆధారంగానే తీసుకోవాలి’’ అని విస్పష్టంగా పేర్కొంది. తద్వారా ప్రభుత్వ ఉన్నతోద్యోగుల పనితీరులో రాజకీయ జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం శాశ్వతంగా చెక్ పెట్టింది. ప్రభుత్వంలో పలు అత్యున్నత స్థాయిల్లో పని చేసి రిటైరైన 83 మంది సివిల్ సర్వెంట్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ పి.సి.ఘోష్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు 47 పేజీల తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పలు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అధికారుల, మొత్తంగా ఉద్యోగిస్వామ్యం తాలూకు పనితీరు క్షీణించడానికి చాలావరకు రాజకీయ జోక్యమే కారణమంటూ పాలకులకు పలుగు రాళ్లతో నలుగు పెట్టింది. ‘‘బదిలీలు, పోస్టింగులను ప్రజా ప్రయోజనాల దృష్టితో కాక రాష్ట్ర ప్రభుత్వాధినేత ఇష్టానుసారం, రాజకీయ తదితర ప్రయోజనాల కోసం చేసేస్తున్న వైనం మా దృష్టికి వచ్చింది. కాబట్టి సివిల్ సర్వెంట్లకు ప్రతి పోస్టింగ్‌లోనూ కనీస పదవీకాలాన్ని ఖాయం చేయడం వారిలో వృత్తి నిబద్ధత (ప్రొఫెషనలిజం), సామర్థ్యాలతో పెంపొందించడమే గాక సుపరిపాలనకు కూడా బాటలు పరుస్తుంది. పేదలు, సమాజంలోని అణగారిన వర్గాలకు ఉద్దేశించిన సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యల అమలుకు ప్రాధాన్యత లభిస్తుంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎస్సీ)కున్న సంప్రదింపుల అధికారాలకు కొంతకాలంగా కత్తెర పడుతోందని ఆవేదన వెలిబుచ్చింది. ఇక రాజకీయ బాసులు, పై అధికారుల మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా పని చేసే సివిల్ సర్వెంట్లు రిస్కు తీసుకుంటున్నట్టేనని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఎందుకంటే ఆ నిర్ణయం తను సొంతంగా తీసుకున్నది కాదని రుజువు చేసుకునే అవకాశముండదు. పైగా అలా చేయడం ద్వారా ఆర్టీఐ చట్టం కింద పౌరులకు హామీ ఇచ్చిన అధికారాలు కూడా అపహాస్యం పాలవుతాయి. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నా, వ్యవస్థాగతమైన సమగ్రతను కాపాడాలన్నా ఆ ఆదేశాలను లిఖితపూర్వకంగా నమోదు చేయడం తప్పనిసరి. సివిల్ సర్వెంట్లు రాజకీయ కార్యనిర్వాహక విభాగానికి జవాబుదారీగా ఉండాలన్నది వాస్తవమే అయినా, వారు ప్రజలకూ జవాబుదారీగా ఉండి తీరాల్సిందే. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిందే’’ అని పేర్కొంది. వేధింపుల నేపథ్యంలో...: సీనియర్ పోలీసు అధికారులకు ఫిక్స్డ్ టెన్యూర్‌ను కల్పించాలంటూ ప్రకాశ్‌సింగ్ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ దందాలను వెలుగులోకి తెచ్చిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, ఉత్తరప్రదేశ్‌లో భూ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ దుర్గాశక్తి నాగ్‌పాల్‌లపై ప్రభుత్వాలు ఇటీవల కక్షసాధింపు చర్యలకు దిగిన నేపథ్యంలో వెలువడ్డ ఈ తీర్పు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల న్యాయ పోరాట ఫలితం... సుప్రీంకోర్టు తాజా తీర్పు సివిల్ సర్వెంట్ల న్యాయ పోరాట ఫలితమేనని చెప్పాలి. ఈ పిల్ దాఖలు చేసిన వారిలో మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్, అమెరికాలో భారత మాజీ రాయబారి అబీద్ హుసేన్, మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు ఎన్.గోపాలస్వామి, టీఎస్ కృష్ణమూర్తి, సీబీఐ మాజీ డెరైక్టర్లు జోగీందర్‌సింగ్, డీఆర్ కార్తికేయన్ తదితరులున్నారు. సివిల్ సర్వెంట్ల బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు తదితర సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం పారదర్శకత పూర్తిగా లోపించిందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికన, ప్రభుత్వాల ఇష్టానుసారం జరిగిపోతున్నాయని నివేదించారు. అందుకే పోస్టింగులు, బదిలీ ప్రతిపాదనలన్నింటినీ పర్యవేక్షించి అమలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలోనూ స్వతంత్ర ప్రతిపత్తి, చట్టబద్ధతతో కూడిన ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ‘‘ప్రభుత్వం మారిందంటే చాలు... అధికారుల బదిలీలు భారీగా జరిగిపోతాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులంతా తమ మద్దతుదారులైన అధికారులను అందలమెక్కిస్తారు. కీలక పదవుల్లో ‘తమవారిని’ నియమించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ బదిలీల వ్యవహారం ఓ పెద్ద పరిశ్రమగా మారింది. అవినీతి అధికారులకు, నేతలకు భారీగా నల్లధనాన్ని ఆర్జించి పెడుతోంది. దాంతో స్వార్థపూరిత శక్తులు, బలమైన లాబీలు ఈ వ్యవహారానికి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నాయి’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సర్వెంట్లను మరింత జవాబుదారీగా, సమస్యల పరిష్కారం దిశగా వారు మరింత చురుగ్గా స్పందించేలా చేయడం ప్రస్తుతం తక్షణావసరమని వార పేర్కొన్నారు. అప్పుడు అన్ని స్థాయిల్లోనూ ఎంతో మేలు జరుగుతుందన్నారు. ‘‘కానీ బదిలీలను తాయిలాలుగా, కానుకలుగానో, లేదంటే దండనగానో దుర్వినియోగం చేస్తుండటం తరచూ జరుగుతోంది. పాలకుల ఇష్టాయిష్టాలు, చాపల్యాలే గాక చోటా మోటా స్థానిక రాజకీయ నాయకుల వ్యక్తిగత అవసరాలు, స్వార్థ ప్రయోజనాల ఆధారంగా కూడా బదిలీ చేసేస్తున్నారు. అధికారులకు, ముఖ్యంగా రాష్ట్రాల్లో పని చేస్తున్న ఆలిండియా సర్వీసుల అధికారులకు పోస్టింగులకు సంబంధించి స్థిరత్వం గానీ, భద్రత గానీ అసలే లేవు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఈ జాడ్యానికి చెక్ పెట్టేందుకు సివిల్ సర్వెంట్లను ఏ పోస్టింగులో అయినా కనీసం మూడేళ్ల పాటు కొనసాగించా లి. అంతకంటే ముందే జరిగే బదిలీలకు సివిల్ సర్వీస్ బోర్డు/కమిషన్ అనుమతిని తప్పనిసరి చేయాలి. పైగా బదిలీకి దారితీసిన ప్రత్యేక పరిస్థితులను విధిగా లిఖితపూర్వకంగా పేర్కొనాలి. అప్పుడే అధికారులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పని చేయగలుగుతారు’’అన్నారు. అధికారులను రాజకీయ జోక్యం బారి నుంచి తప్పించాలని కనీసం నాలుగు ఉన్నత స్థాయి ప్యానళ్లు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంస్కరణలను అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాపోయారు. ఇదో మైలురాయి ఈ తీర్పు ఓ మైలురాయి. రాజ్యాంగంపై మాకున్న విశ్వాసం దీనితో మరింతగా బలపడింది. ఎందుకంటే సమస్య తీవ్రతను అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. - మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ మేమంతా బాధితులమే బదిలీలు, పదోన్నతులు, పోస్టింగులు, విదేశీ బాధ్యతల వంటి నిర్ణయాలన్నింట్లో పాలకు ల చపలచిత్తం తరచూ తీవ్ర ప్రభావం చూపుతుంది. మాలో చాలా మందిమి కెరీర్లో దీన్ని లెక్కలేనన్నిసార్లు చవిచూశాం. అందుకే ఈ తీర్పు నాకెంతో సంతోషం కలిగిస్తోంది. - మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణమూర్తి తీర్పు సంతోషకరం తీర్పుపై నేను సంతోషంగా ఉన్నాను. అయితే పోలీసు అధికారుల స్థిర కాలావధికి సంబంధించి 2006 సెప్టెంబరు 20న సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు - సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్ సింగ్ స్వాగతిస్తున్నాం తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు దేశంలో సుపరిపాలనకు మార్గం సుగమం చేస్తుంది. అయితే, అది తీర్పుకే పరిమితం కాకుండా ఆచరణలోకి కూడా రావాల్సిన అవసరం ఉంది. - ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఎస్.ఆర్ బూసి రెడ్డి -
నిర్ణీత కాలవ్యవధి తర్వాతే బదిలీ చేయాలి: సుప్రీం
తరచూ వివాదాస్పదమవుతున్న సివిల్ సర్వీస్ అధికారుల బదిలీ విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారుల్ని బదిలీ చేసేటపుడు నిర్దిష్ట మార్గ దర్శకాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడానికి నిర్ణీత కాలవ్యవధి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మూడు నెలల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇటీవల 44 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పాటు ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. రెండేళ్లు సర్వీస్ పూర్తి కాని వారిని కూడా బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. నాలుగు నెలల్లోనే కర్పూల జిల్లా ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డిని హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు.