మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారా? స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటోంది జపాన్ దేశం. ఆఫీస్ ఆవర్స్‌లో వర్క్ పక్కన పెట్టి స్మోక్ చేసేవారికి కఠిన శిక్షలు విధిస్తోంది.
14 ఏళ్ల సర్వీసులో 4,500 కంటే ఎక్కువ సార్లు ధూమపానం చేసినందుకు జపాన్ సివిల్ సర్వెంట్ ఇబ్బందుల్లో పడ్డాడు. పనివేళల్లో సిగరెట్లు కాల్చినందుకు అతడికి 11వేల డాలర్లు ( రూ. 894915) ఫైన్ విధించింది అక్కడి స్థానిక ప్రభుత్వం.
ఒసాకాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన చట్టాలు ఉన్నాయి. 2008లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించింది. 2019లో ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో ధూమపానం చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో
ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..ఒసాకా నగరంలో 61 ఏళ్ల సివిల్ సర్వెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు సహోద్యోగులు పదేపదే ధూమపానం చేసినట్లు తేలింది. దీంతో వారి ఆరు నెలల పాటు జీతంలో 10 శాతం కోత విధించారు.
2022 సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురూ రహస్యంగా సిగరెట్లు దాచిపెడుతున్నారంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు మళ్లీ ధూమపానం చేస్తూ పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ముగ్గురికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, ముగ్గురు మళ్లీ ధూమపానం చేయడం ప్రారంభించారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులు జరిపిన విచారణలో స్మోకింగ్ గురించి అబద్ధం చెప్పారు.
స్థానిక పబ్లిక్ సర్వీస్ చట్టం ప్రకారం 61 ఏళ్ల సివిల్ సర్వెంట్ విధులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వేతన తగ్గింపుతో పాటు, అతని జీతంలో 1.44 మిలియన్ యెన్‌లను తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యక్తి డ్యూటీలో 355 గంటల 19 నిమిషాల పాటు పొగ తాగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment