
నిర్ణీత కాలవ్యవధి తర్వాతే బదిలీ చేయాలి: సుప్రీం
తరచూ వివాదాస్పదమవుతున్న సివిల్ సర్వీస్ అధికారుల బదిలీ విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారుల్ని బదిలీ చేసేటపుడు నిర్దిష్ట మార్గ దర్శకాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడానికి నిర్ణీత కాలవ్యవధి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మూడు నెలల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
రాష్ట్రంలో ఇటీవల 44 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. పోస్టింగ్ల విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పాటు ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. రెండేళ్లు సర్వీస్ పూర్తి కాని వారిని కూడా బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. నాలుగు నెలల్లోనే కర్పూల జిల్లా ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డిని హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు.