కర్రపెత్తనం చెల్లదిక : సుప్రీంకోర్టు | Supreme Court tells government how it should govern bureaucrats | Sakshi
Sakshi News home page

కర్రపెత్తనం చెల్లదిక : సుప్రీంకోర్టు

Published Fri, Nov 1 2013 1:45 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

కర్రపెత్తనం చెల్లదిక : సుప్రీంకోర్టు - Sakshi

కర్రపెత్తనం చెల్లదిక : సుప్రీంకోర్టు

ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి సివిల్ సర్వెంట్లకు విముక్తి
  సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

 
 న్యూఢిల్లీ: అధికారులపై ప్రభుత్వాల కర్ర పెత్తనం ఇకపై చెల్లబోదు. సర్కారు పెద్దల కబంధ హస్తాల బారి నుంచి సివిల్ సర్వెంట్లకు సర్వోన్నత న్యాయస్థానం విముక్తి కల్పించింది! పాలకులు తమతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, బదిలీలు-పదోన్నతులు-క్రమశిక్షణ చర్యల వంటివాటిని ‘దారికి తెచ్చుకునే అస్త్రాలుగా’ వాడుతున్నారని కొంతకాలంగా వారు చేస్తున్న వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఆలిండియా సర్వీసు అధికారులను చీటికీమాటికీ ఇష్టానుసారంగా బదిలీ చేసే పెడ పోకడకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసింది. ‘‘రాజకీయ జోక్యం బారి నుంచి సివిల్ సర్వెంట్లకు పూర్తి రక్షణ ఉండాలి. అందుకు వీలుగా ఏ పదవిలోనైనా వారిని నిర్దిష్ట కాలం పాటు కదపకుండా విధిగా కొనసాగించాల్సిందే’’ అంటూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.
 
  సివిల్ సర్వెంట్లను ఒక్కో పోస్టింగ్‌లో కనీసం ఎంత కాలం కొనసాగించాలో (ఫిక్స్‌డ్ టెన్యూర్) నిర్ధారించేందుకు వీలుగా మూడు నెలల్లోగా నిర్దేశకాలను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది! వారి పోస్టింగులు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తదితరాలను నియంత్రించేందుకు సివిల్ సర్వీసుల బోర్డు (సీఎస్‌బీ)ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఒక చట్టం చేయాలని ఆదేశించింది. అప్పటిదాకా ఆ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల, యూటీల స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి, చట్టబద్ధ అధికారాలతో కూడిన బోర్డులను మూడు నెలల్లోపు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. తద్వారా పాలన వ్యవస్థ, ఉద్యోగిస్వామ్యాల పనితీరులో పెను సంస్కరణలకు సుప్రీంకోర్టు బాటలు పరిచింది. అంతేగాక అధికారులు కూడా రాజకీయ బాసుల మౌఖిక ఆదేశాలను అసలే స్వీకరించరాదని స్పష్టం చేసింది. ‘‘వారు కేవలం తమకందే లిఖితపూర్వక ఆదేశాలకు, లేదా సమాచారానికి అనుగుణంగా మాత్రమే నడచుకోవాలి.
 
 ఏ చర్యలనైనా వాటి ఆధారంగానే తీసుకోవాలి’’ అని విస్పష్టంగా పేర్కొంది. తద్వారా ప్రభుత్వ ఉన్నతోద్యోగుల పనితీరులో రాజకీయ జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం శాశ్వతంగా చెక్ పెట్టింది. ప్రభుత్వంలో పలు అత్యున్నత స్థాయిల్లో పని చేసి రిటైరైన 83 మంది సివిల్ సర్వెంట్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ పి.సి.ఘోష్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు 47 పేజీల తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పలు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అధికారుల, మొత్తంగా ఉద్యోగిస్వామ్యం తాలూకు పనితీరు క్షీణించడానికి చాలావరకు రాజకీయ జోక్యమే కారణమంటూ పాలకులకు పలుగు రాళ్లతో నలుగు పెట్టింది. ‘‘బదిలీలు, పోస్టింగులను ప్రజా ప్రయోజనాల దృష్టితో కాక రాష్ట్ర ప్రభుత్వాధినేత ఇష్టానుసారం, రాజకీయ తదితర ప్రయోజనాల కోసం చేసేస్తున్న వైనం మా దృష్టికి వచ్చింది. కాబట్టి సివిల్ సర్వెంట్లకు ప్రతి పోస్టింగ్‌లోనూ కనీస పదవీకాలాన్ని ఖాయం చేయడం వారిలో వృత్తి నిబద్ధత (ప్రొఫెషనలిజం), సామర్థ్యాలతో పెంపొందించడమే గాక సుపరిపాలనకు కూడా బాటలు పరుస్తుంది. పేదలు, సమాజంలోని అణగారిన వర్గాలకు ఉద్దేశించిన సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యల అమలుకు ప్రాధాన్యత లభిస్తుంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
 
 అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎస్సీ)కున్న సంప్రదింపుల అధికారాలకు కొంతకాలంగా కత్తెర పడుతోందని ఆవేదన వెలిబుచ్చింది. ఇక రాజకీయ బాసులు, పై అధికారుల మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా పని చేసే సివిల్ సర్వెంట్లు రిస్కు తీసుకుంటున్నట్టేనని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఎందుకంటే ఆ నిర్ణయం తను సొంతంగా తీసుకున్నది కాదని రుజువు చేసుకునే అవకాశముండదు. పైగా అలా చేయడం ద్వారా ఆర్టీఐ చట్టం కింద పౌరులకు హామీ ఇచ్చిన అధికారాలు కూడా అపహాస్యం పాలవుతాయి. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నా, వ్యవస్థాగతమైన సమగ్రతను కాపాడాలన్నా ఆ ఆదేశాలను లిఖితపూర్వకంగా నమోదు చేయడం తప్పనిసరి. సివిల్ సర్వెంట్లు రాజకీయ కార్యనిర్వాహక విభాగానికి జవాబుదారీగా ఉండాలన్నది వాస్తవమే అయినా, వారు ప్రజలకూ జవాబుదారీగా ఉండి తీరాల్సిందే. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిందే’’ అని పేర్కొంది.
 
 వేధింపుల నేపథ్యంలో...: సీనియర్ పోలీసు అధికారులకు ఫిక్స్‌డ్ టెన్యూర్‌ను కల్పించాలంటూ ప్రకాశ్‌సింగ్ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే. రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌తో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ దందాలను వెలుగులోకి తెచ్చిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, ఉత్తరప్రదేశ్‌లో భూ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ దుర్గాశక్తి నాగ్‌పాల్‌లపై ప్రభుత్వాలు ఇటీవల కక్షసాధింపు చర్యలకు దిగిన నేపథ్యంలో వెలువడ్డ ఈ తీర్పు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.  
 
 అధికారుల న్యాయ పోరాట ఫలితం...
 సుప్రీంకోర్టు తాజా తీర్పు సివిల్ సర్వెంట్ల న్యాయ పోరాట ఫలితమేనని చెప్పాలి. ఈ పిల్ దాఖలు చేసిన వారిలో మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్, అమెరికాలో భారత మాజీ రాయబారి అబీద్ హుసేన్, మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు ఎన్.గోపాలస్వామి, టీఎస్ కృష్ణమూర్తి, సీబీఐ మాజీ డెరైక్టర్లు జోగీందర్‌సింగ్, డీఆర్ కార్తికేయన్ తదితరులున్నారు. సివిల్ సర్వెంట్ల బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు తదితర సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం పారదర్శకత పూర్తిగా లోపించిందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికన, ప్రభుత్వాల ఇష్టానుసారం జరిగిపోతున్నాయని నివేదించారు. అందుకే పోస్టింగులు, బదిలీ ప్రతిపాదనలన్నింటినీ పర్యవేక్షించి అమలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలోనూ స్వతంత్ర ప్రతిపత్తి, చట్టబద్ధతతో కూడిన ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
 
  ‘‘ప్రభుత్వం మారిందంటే చాలు... అధికారుల బదిలీలు భారీగా జరిగిపోతాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులంతా తమ మద్దతుదారులైన అధికారులను అందలమెక్కిస్తారు. కీలక పదవుల్లో ‘తమవారిని’ నియమించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ బదిలీల వ్యవహారం ఓ పెద్ద పరిశ్రమగా మారింది. అవినీతి అధికారులకు, నేతలకు భారీగా నల్లధనాన్ని ఆర్జించి పెడుతోంది. దాంతో స్వార్థపూరిత శక్తులు, బలమైన లాబీలు ఈ వ్యవహారానికి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నాయి’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సర్వెంట్లను మరింత జవాబుదారీగా, సమస్యల పరిష్కారం దిశగా వారు మరింత చురుగ్గా స్పందించేలా చేయడం ప్రస్తుతం తక్షణావసరమని వార పేర్కొన్నారు. అప్పుడు అన్ని స్థాయిల్లోనూ ఎంతో మేలు జరుగుతుందన్నారు. ‘‘కానీ బదిలీలను తాయిలాలుగా, కానుకలుగానో, లేదంటే దండనగానో దుర్వినియోగం చేస్తుండటం తరచూ జరుగుతోంది.
 
 పాలకుల ఇష్టాయిష్టాలు, చాపల్యాలే గాక చోటా మోటా స్థానిక రాజకీయ నాయకుల వ్యక్తిగత అవసరాలు, స్వార్థ ప్రయోజనాల ఆధారంగా కూడా బదిలీ చేసేస్తున్నారు. అధికారులకు, ముఖ్యంగా రాష్ట్రాల్లో పని చేస్తున్న ఆలిండియా సర్వీసుల అధికారులకు పోస్టింగులకు సంబంధించి స్థిరత్వం గానీ, భద్రత గానీ అసలే లేవు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఈ జాడ్యానికి చెక్ పెట్టేందుకు సివిల్ సర్వెంట్లను ఏ పోస్టింగులో అయినా కనీసం మూడేళ్ల పాటు కొనసాగించా లి. అంతకంటే ముందే జరిగే బదిలీలకు సివిల్ సర్వీస్ బోర్డు/కమిషన్ అనుమతిని తప్పనిసరి చేయాలి. పైగా బదిలీకి దారితీసిన ప్రత్యేక పరిస్థితులను విధిగా లిఖితపూర్వకంగా పేర్కొనాలి. అప్పుడే అధికారులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పని చేయగలుగుతారు’’అన్నారు. అధికారులను రాజకీయ జోక్యం బారి నుంచి తప్పించాలని కనీసం నాలుగు ఉన్నత స్థాయి ప్యానళ్లు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంస్కరణలను అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాపోయారు.
 
 ఇదో మైలురాయి
 ఈ  తీర్పు ఓ మైలురాయి. రాజ్యాంగంపై మాకున్న విశ్వాసం దీనితో మరింతగా బలపడింది. ఎందుకంటే సమస్య తీవ్రతను అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.
 - మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్
 
 మేమంతా బాధితులమే
 బదిలీలు, పదోన్నతులు, పోస్టింగులు, విదేశీ బాధ్యతల వంటి నిర్ణయాలన్నింట్లో పాలకు ల చపలచిత్తం తరచూ తీవ్ర ప్రభావం చూపుతుంది. మాలో చాలా మందిమి కెరీర్లో దీన్ని లెక్కలేనన్నిసార్లు చవిచూశాం. అందుకే ఈ తీర్పు నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
 - మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణమూర్తి
 
 తీర్పు సంతోషకరం
 తీర్పుపై నేను సంతోషంగా ఉన్నాను. అయితే పోలీసు అధికారుల స్థిర కాలావధికి సంబంధించి 2006 సెప్టెంబరు 20న సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు
 - సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్ సింగ్
 స్వాగతిస్తున్నాం
 
 తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు దేశంలో సుపరిపాలనకు మార్గం సుగమం చేస్తుంది. అయితే, అది తీర్పుకే పరిమితం కాకుండా ఆచరణలోకి కూడా రావాల్సిన అవసరం ఉంది.    
 - ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి
 ఎస్.ఆర్ బూసి రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement