పౌర సేవకు సరికొత్త తోవ | Supreme court shields civil servants | Sakshi
Sakshi News home page

పౌర సేవకు సరికొత్త తోవ

Published Fri, Nov 8 2013 4:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

పౌర సేవకు సరికొత్త తోవ - Sakshi

పౌర సేవకు సరికొత్త తోవ

రాజకీయ నాయకుల జోక్యం నుంచి ఐఏఎస్ అధికారులను కాపాడి, నియమ పాలనకు వారి పాలన ఉపకరించేట్లు చేయాల న్న తపన సుప్రీంకోర్టు (అక్టోబర్ 31) తీర్పులో వ్యక్తమైంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ‘ఐదేళ్లపా టు మాకు తిరుగులేదు. మేమ న్నమాటే చెల్లాల’ని అంటూ నేత లు ‘రూల్స్ ఒప్పుకోవ’ని చెప్పే అధికారులను బదిలీ(లు) చేసే దుర్మార్గాన్ని నిరోధించా లన్న ఆరాటం ఈ తీర్పులో కనిపిస్తుంది.
భారత పాలనా సేవకులు అని ఇండియన్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్‌ను తెలుగులో చెప్పవచ్చు. కాని ‘సివిల్ సర్వెంట్’- పౌర సేవకులు అనడమే సరైనది. కాని వారు తమకు తాము ప్రజాధికారులము అనుకుంటే ప్రజలకూ ప్రజాస్వామ్యానికీ న్యాయం జరగదు. పౌరులకు సేవలు చేయడమా లేక రాజకీయ నాయకుల ఆజ్ఞలు పాటించి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కీడు చేయడమా అనేది ఇప్పుడు అప్పుడూ ఐఏఎస్‌ల ముందున్న ప్రశ్న.
 
న్యాయస్థానం గుర్తుచేయాలా?
ఇదంతా నీతి, విలువకు సంబంధించిన విషయం. కాని చట్టపరమైన నియమాల రూపంలో లేదు. పార్లమెంటు చట్టం చేయాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఆర్టికల్ 309 కింద పార్లమెంటు సొంతంగా సివిల్ సర్వీసెస్ చట్టం చేయవలసిన అధికారం ఉండి ఆ అధికారం వినియోగిం చుకోకుండా వదిలేస్తే, ఆ పని చేయండి మహాప్రభో అని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయవలసి రావడం ఎంత వింత? పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రత్యామ్నాయం గా ఈ తీర్పులో ఆదేశాలు చట్టం వలె పనిచేయాలన్నది సుప్రీంకోర్టు సంకల్పం. అధికారుల నియామకం, బదిలీ, వారిపైన ఫిర్యాదుల విచారణ, క్రమశిక్షణ చర్య తీసుకోవ డం వంటి అధికారాలు కలిగిన ఒక సివిల్ సర్వీసెస్ బోర్డు (సీఎస్‌బీ)ను కేంద్రంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపా లిత ప్రాంతంలోనూ మూడు నెలలలోగా రూపొందించా లని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
నిలబడనీయకుంటే ఎలా?
ఎక్కడ ఎన్నాళ్లు పనిచేస్తారో తెలియదు. ఏ పోస్టింగూ లేకుండా ఎన్నాళ్లుండాలో తెలియదు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి దయలేకపోతే   ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఊరికే ఉం డాలి. అడిగిన పనులన్నీ చేసి ఎక్కడబడితే అక్కడ ఏ ఫైలు మీదైనా సంతకం చేస్తే చాలు. ఎంపీలను చేస్తాం, మంత్రు ల్ని చేస్తాం, గవర్నర్ పదవులిస్తాం అనే స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోతే దేశం ఏమైపోతుందనే ప్రశ్న జనం ముందున్నది. ఈ అధికారులకు కనీస పదవీ కాలం ఉండా లన్న అంశంపైన 13 రాష్ట్రాల వరకు అంగీకరించాయి. కనీ సం రెండేళ్లో మూడేళ్లో ఉంటామని ముందే తెలిస్తే ఆ మేరకు అధికారులు తమ వృత్తి పరమైన ధర్మం నిర్వ హించి, లక్ష్యాలు నెరవేర్చి, జనులకు మేలు చేసి వెళ్లవచ్చు. ఏడాదికి లేదా ఆర్నెల్లకే బదిలీ చేస్తే ఏం చేయగలరు?
 
కర్ణాటకలో ధనంజయ్ పిళ్లై అని ఒక మునిసిపల్ ఇంజనీరు. ఆయనకు అనుభవం అర్హతల ఆధారంగా పదో న్నతి ఇవ్వాలి. కాని ఇవ్వలేదు. ఆయన కనీసం పదకొండు సార్లు ట్రిబ్యునల్‌లను, కోర్టులను ఆశ్రయించాడు. ఎన్ని తీర్పులు వచ్చినా కక్షగట్టినటు ప్రభుత్వం  అప్పీలుకు వెళ్లేది.  సుప్రీంకోర్టు సైతం ఆయనకు ‘పదోన్నతి ఇవ్వండి’ అని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించి, గడువు కూడా విధిం చింది. ఇవ్వలేదు. ఆయన కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇచ్చిన గడువులో ఆదేశాన్ని పాటించనందుకు నెలరోజుల జైలు శిక్ష విధించింది. చాలా బాగుంది. కాని ఎవరికి?  ఆనాటి ముఖ్యమంత్రి దేవెగౌడ కు కాదు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వాసుదే వన్‌కు పడింది ఆ శిక్ష. పాపం, ఆయన నెల్లాళ్లు జైలుకు పోక తప్పలేదు. ఆయన చేసిన తప్పేమిటంటే,  ‘తర్వాత చూద్దాం’ అని దేవెగౌడ నోటి మాటగా చెప్పిన దాన్ని నోట్ గా మార్చి సంతకం తీసుకోకపోవడమే. ఎవరో ఒకరికి శిక్ష పడాలి, కనుక వాసుదేవన్ జైలుకు వెళ్లారు. నోటి మాటను నోట్‌గా మార్చేలోగా తీవ్ర నష్టం జరగవచ్చు.
 
నోటిమాటలే జీవోలు కావాలి
డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు  ‘నా మాటే ఒక జీవో’ అన్నారు. కాని ఆ మాట అన్న తరు వాతనైనా జీవో ఒకటి రావడం ఫైళ్లో చేరడం అవసరం కదా! ఎస్‌ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్ వంటి అధి కారుల పాలనా విధానం స్ఫూర్తినిస్తుంది. కాని వినేదెవరు? వారు ఎందరికి గుర్తున్నారు? వారి దారిలో ఉండి నానా కష్టాలు పడే వారిని ఎవరు ఆదుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు చదివి కొంత ఆనందిస్తారేమో గాని వారికి జరిగిన అన్యాయాలు ఎవరు తీరుస్తారు? సుప్రీం కోర్టు సూచించిన రీతిలో సివిల్ సర్వీసు చట్టం చేసినా రాజ్యాంగ పీఠాల్లో ఉన్న రాజకీయ నాయకుల నోటి మాట ఆదేశాలను పాటించకూడదు అని నిర్దేశించడం సాధ్యం కాదు. కాని అధికారులు తమకు అందిన మౌఖిక ఆదేశా లను కాగితం మీద పెట్టి తీరాలని 2004లో హొతా కమిటీ, 1962లో సంతానం కమిటీ సూచించాయి. అఖిల భారత సర్వీసు నియమాలు రూల్ 3(3)3లో పైఅధికారుల ఉత్త ర్వులు సర్వసాధారణంగా రాతపూర్వకంగా ఉండాలని స్పష్టంగా ఉంది. మరి ఎందుకు పాటించడం లేదు? అత్య వసర పరిస్థితిలో, ఆ మాటల ఆనతులు పాటించిన తరు వాత వాటిని ధృవీకరిస్తూ రాతపూర్వకంగా కూడా ఆదే శాలు ఇవ్వడంపై అధికారి బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తు చేయవలసి వచ్చింది. ఆదేశాలు తీసుకున్న కింది అధికారి కూడా వీలైనంత తొందరగా నోటి మాట ఆదేశాలను నోట్ మాటగా మార్చడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు వివరించింది.
 
అంతా నమోదు చేయాలి
అధికారికి ఎవరు ఏ తేదీ, ఏ సమయంలో ఏం చెప్తే అది,  ఏ తేదీ ఏ సమయంలో తను  ఏం చేశాడోఊడా రాసి పెట్టు కోవాలి అని కూడా సుప్రీంకోర్టు సూచించింది. తాము తీసుకున్న చర్యలకు కారణాలను, పై అధికారి ఆదేశాలను పత్రబద్ధం చేయకపోతే, దానికి సంబంధించిన సమాచారా న్ని అడిగిన వారికి ఆ తరువాత ఏ విధంగా ఇవ్వగలుగు తారు?  సమాచార హక్కు చట్టం కింద కోరిన వారికి ఇవ్వ వలసిన సమాచారం కాగితాల మీద పెట్టకపోతే సమా చార హక్కు చట్టం లక్ష్యమే దెబ్బతింటుంది. రూల్ 3(3)3 వంటి నియమాలను నిర్దేశిక సూత్రాలుగా మూడు నెల ల్లోగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 83 మంది పౌర సేవాధికారులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. బలహీనమైన ప్రభుత్వం, బలహీనమైన పౌర సేవలు, విపరీతమైన క్రమబద్ధీకరణ, వ్యక్తిగత లాభాల కోసం ఇష్టం వచ్చిన రీతిలో జోక్యం చేసుకోవడం, వృథా ఖర్చు లు, పారదర్శకతలో లోపాలు, జవాబుదారీ తనం లేకపో వడంవల్ల ప్రభుత్వం తలపెట్టిన మంచి పథకాలు, విధా నాలు, పనులు కూడా ప్రభావం చూపడం లేదని పిటిష నర్లు ఈ పిల్‌లో పేర్కొన్నారు. సుపరిపాలన లేకపోతే పౌర జీవన నాణ్యత దెబ్బతింటుందని ఆ మేరకు ఆర్టికల్ 21 భంగపడినట్టే కనుక తమకు న్యాయం చేయాలని కోరారు.
 
వేధింపులు అనంతం
రాబర్ట్ వధేరా భూముల వ్యవహారాలను విచారించినం దుకు అశోక్ ఖెమ్కాను బదిలీలతో వేధించడం ఇటీవలి చరిత్రే. మతపరమైన జాగ్రత్తలు తీసుకున్నందుకు దుర్గా శక్తి నాగపాల్‌ను ఎంత వేధించారో తెలుసు. చివరకు మత కల్లోలాలలో మామూలు జనం ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని రుజువైపోయింది. ఇటువంటి ఉదాహరణల మధ్య సుప్రీంకోర్టు విలువైన తీర్పు ఇచ్చిం ది. ఉన్నదున్నట్టు చెప్పాలంటే అధికారులదే అధికారం అంతా. రాజ్యాంగం ఎన్ని చెప్పినా, పాలనా శాస్త్రం ఎంత నిక్కచ్చిగా నియమాలు చేసినా, సమాచార హక్కు చట్టం గుట్టురట్టు చేయాలని చట్టబద్ధంగా చెప్పినా, ఐఏఎస్ అధి కారుల చేతిలో కలం బలం, ఐపీఎస్ అధికారుల చేతిలో తుపాకీ బలం విస్తారంగా ఉన్నాయి. సరైన సలహాలు తీ సుకుని వారు అవినీతి వైపు మళ్లకుండా జాగ్రత్తపడే తెలి వైన నాయకుడు ఉంటే దేశం బాగుపడుతుంది. లేకపోతే వారూవీరూ కలిసి ‘బాగు’ పడతారు. దేశం నష్టపోతుంది.
 
తప్పును ఏ చట్టమూ ఒప్పుకోదు
చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటించాలని అధికారులకు ఏ చట్టమూ ఏ నియమాలూ చెప్పవు. ఆ ఆదేశం నోటి మాట రూపంలో ఉన్నా లిఖిత పూర్వకంగా ఉన్నా సరే చట్ట బద్ధంగాని ఆదేశాలను చట్టవ్యతిరేకమైన ఆదేశాలను పాటి స్తే అధికారులు తప్పుకోలేరు. పై అధికారులు ఇచ్చిన చట్ట బద్ధమైన ఉత్తర్వులు పాటించినప్పుడే కింది అధికారులకు నేరపరమైన చర్యల నుంచి తప్పుకునే మినహాయింపులు వర్తిస్తాయి, లేకపోతే వర్తించవని ఐపీసీలో ఉంది. ఈ విష యం చెప్పడానికి న్యాయ నిపుణుల అవసరం లేదు. రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలు ఇవ్వకూడదనే నీతిని రాజ కీయ నాయకులు ఎంతగా పాటించాలో, అటువంటి ఆదే శాలను పాటించకూడదనే నీతినీ పాటించాలి.
 -ఆచార్య మాడభూషి శ్రీధర్, నల్సార్ విశ్వవిద్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement