హైదరాబాద్ మీద మోజుతో ఐఏఎస్‌ల కేడర్ పీకులాట
తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతుంటే అందరి కంటే ఎక్కువ బాధపడిపోతున్న వారు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఎఫ్ఎస్ అధికారులంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఎఫ్ఎస్ దొరలు అంతగా ఇదైపోవడానికి రాష్ట్రం మీద ప్రీతి, ప్రజల పట్ల అక్కర, సమైక్యాంధ్ర అంటే మక్కువ... వగైరాలేమీ కాదు. తమ సుఖం, సౌఖ్యాలకి సంబంధించిన అంశాలే వారి ఆందోళనకి మూలం. అన్నిటికీ కేంద్రమైన హైదరాబాద్ అంటే ఉన్న తగని ఆకర్షణే వారి గాబరాకి కారణం.
తన పబ్బం గడుపుకోడానికి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తగవులు పెట్టే తెరాస అధినేత కల్వకుర్తి చంద్రశేఖరరావు హుకుం జారీ చేసినట్టు సీమాంధ్ర ఉద్యోగులు తట్టా బుట్ట తీసుకొని, పెట్టే బేడా సర్దుకొని తమ ప్రాంతాలకి తరలి వెళ్లిపోవాలి. ఎక్కడ పెరిగినా, పుట్టిన గడ్డ బట్టి ప్రజలనైతే ఖండఖండాలుగా చీల్చవచ్చుగానీ; "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇలా ఆంధ్రప్రదేశ్ కేడర్ అనే ముద్ర వల్ల ఇక్కడికి వచ్చాం గానీ,ఈ ప్రాంతంతో, ప్రజలతో, వాళ్ల బాధలతో, మనోభావాలతో, ఉద్వేగాలతో మాకేం పని? సీమాంధ్రలో ఉద్యోగం చేస్తున్న 'పాపానికి ' మేము సీమాంధ్ర కేడర్‌గా మిగిలి పోవాలా? కనీసం ‘గుడ్డిలో మెల్ల’ అన్నట్టు హైదరాబాదైతే మేము ఏదోలా సరిపెట్టుకోగలంగానీ," అంటూ సీమాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు నానా హైరానా పడితోతున్నారట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, తమ ఆక్రోశాన్ని బాసుదేవుడు చీఫ్ సెక్రటరికి మొరపెట్టుకున్నారని తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా గడిపే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు,పబ్బులూ హైదరాబాదులో తప్ప మరెక్కడా లేక పోవడం వల్ల, ఈ కనీస సౌకర్యాలకి కూడా వారిని నోచుకోకుండా తమని శాశ్వతంగా పరాయి ప్రాంతాల పాలుచేయడం సబబు కాదని వారు వాపోయారు.
హోదా, అధికారం, ఆదాయం కూడా అధికంగా ఉండే టుబాకో బోర్డు చైర్మనుగా గుంటూరు వెళ్లినప్పటికీ, కార్పోరేషన్ స్థాయి ఉన్న గుంటూరు కంటికి ఆనక, వారి కుటుంబాల్ని మాత్రం 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదులో ఉంచిన ఐఏఎస్‌లు ఎందరో.
ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ విషయానికొస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన 1982 బ్యాచ్ ఆఫీసర్. ఆయన కేంద్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లారు. 2009లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కన్వీనర్‌గా పని చేశారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి హోదాలో నక్సలైట్ మేనేజ్‌మెంట్ - అదనపు కార్యదర్శిగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల కేంద్రం నియమించిన టాస్కుఫోర్సు బృందంలో కూడా సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.
ఆయన డిప్యుటేషన్ కాలపరిమితి ముగిసి, ఆయన రాష్ట్రానికి తిరిగి రావల్సి ఉండగా, ఆయన ప్రత్యేక తెలంగాణ తకరారుని దృష్టిలో ఉంచుకొనే ఢిల్లీలో కొనసాగేందుకు తన స్థాయిలో లాబీయింగు చేసుకుంటున్నారని, ఎంఎంటిసి లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టరు పదవి కోసం ఆయన పైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తం మీద, ఆంధ్ర- తెలంగాణ కేడర్ అంటూ ఒక ప్రత్యేకమైన జాయింట్ కేడర్ కల్పించి, తమని అందులో చేర్చడమే ఈ సమస్యకి పరిష్కారమని వారు సూచిస్తున్నారు. అస్సాం- మేఘాలయ, మణీపూర్- త్రిపుర వంటి ఉభయ రాష్ట్రాలకి సంబంధించిన కేడర్లు దేశాంలో ఇప్పటికే ఉన్నాయి కాబట్టి, ఆ దిశలోనే ఆంధ్ర- తెలంగాణ కేడర్ సృష్టించాలని వారు మొర పెట్టుకుంటున్నారు. విభజన చిచ్చుతో రాష్ట్రం రావణకాష్ఠంలా రగిలిపోతుంటే, అదేమీ పట్టనట్టు ఉన్నతాధికారులు సొంతలాభాలు చూసుకోవడం అన్యాయమని వారి కింద ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.