63 మంది అధికారుల 'బలవంతపు' పదవీవిరమణ
శ్రీనగర్: అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులపై జమ్ముకశ్మీర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తోన్న 63 మంది అధికారులు తక్షణమే స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రికిరాత్రే ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పేరుతో సదరు అధికారులకు లేఖలు పంపారు.
ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని రూపుమాపేందుకు కొద్ది నెలలుగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగానే అధికారుల తొలిగింపు ప్రక్రియకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత మార్చి నెలలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ కందాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవినీతి ప్రక్షాళన కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలకు దిగింది.