2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) లోక్‌సభ ఎన్నికల మొదటి దశలోపోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలను అందించింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం తొలి దశలో మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించగా, ఏడుగురు అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేనందున వాటిని విశ్లేషించలేకపోయినట్లు తేలిపింది. మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన 1,618 మంది అభ్యర్థులలో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ తెలిపింది. 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా, ఈ అభ్యర్థుల సగటు సంపద రూ.4.51 కోట్లు.
1618 మంది అభ్యర్థుల్లో 161 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 15 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉండగా, ఏడుగురు అభ్యర్థులపై హత్యకు సంబంధించిన కేసులు (ఐపీసీ-302) నమోదయ్యాయి. 18 మంది అభ్యర్థులపై మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే ఉద్రేకపూరిత ప్రసంగాలతో ముడిపడిన కేసులలో చిక్కుకున్న 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తొలి దశలో పోటీ చేసే 1618 మంది అభ్యర్థుల్లో 28 శాతం అంటే 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. 77 మంది బీజేపీ అభ్యర్థుల్లో 69 మంది, 56 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 49 మంది, ఆర్జేడీ అభ్యర్థులు 36 మంది, ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో 35 మంది, డీఎంకే అభ్యర్థులు 22 మందిలో 21 మంది, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో నలుగురు, బీఎస్పీ అభ్యర్థుల్లో 86 మందిలో 18 మంది కోటీశ్వరులు. ఎన్నికల అఫిడవిట్‌లలో ఈ అభ్యర్థులు తమ ఆస్తుల విలువ కోటికి పైగా ఉన్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.4.51 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.
తొలి దశలో అత్యధిక ఆస్తులను ప్రకటించిన అభ్యర్థి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్. చింద్వారా నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన ఇతని మొత్తం ఆస్తుల విలువ రూ.716 కోట్లు. ఈ జాబితాలో ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కుమార్ తన అఫిడవిట్‌లో రూ.662 కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. మూడవ అత్యంత సంపన్న అభ్యర్థి బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్. తమిళనాడులోని శివగంగై స్థానం నుంచి పోటీ చేస్తున్న దేవనాథన్ ఆస్తుల విలువ రూ.304 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment