చంద్రబాబు కోసం బరితెగించొద్దు! | Warning of IAS and IPS officers to yellow media | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కోసం బరితెగించొద్దు!

Published Sat, Apr 6 2024 2:23 AM | Last Updated on Sat, Apr 6 2024 10:54 AM

Warning of IAS and IPS officers to yellow media - Sakshi

పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వార్నింగ్‌

‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి 

ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు 

దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం 

అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం 

‘వీళ్లా ఐపీఎస్‌లు’ కథనంపై మండిపడ్డ చీఫ్‌ సెక్రటరీ..  పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ 

తమ కౌంటర్‌ను ‘ఈనాడు’ బ్యానర్‌గా వెయ్యాలని డిమాండ్‌.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల అసంతృప్తి 

ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం 

రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు 

ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? 

ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం 

ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు  సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్‌.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ 

సాక్షి, అమరావతి:  ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్‌? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్‌ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్‌ అధికారులు, ఇటు ఐపీఎస్‌ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్‌ అధికారులు వార్నింగ్‌ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి మండిపడ్డారు.

ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్‌ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐపీఎస్‌ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్‌ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి.

ఎలక్షన్‌ కమిషన్‌ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి.   
 
అది రాజకీయ దురుద్ధేశమే 
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు.

పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు.  
 
సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం 
పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్‌ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్‌ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

పలువురు ఐఏఎస్‌ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు.  
 
ఈసీ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు 
ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్‌ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు.

ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్‌ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు.

జవహర్‌ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్‌ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు.  
 
రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. 
చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్‌ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు.

తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట.

ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది.

అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్‌ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.  
 
పరాజయానికి సాకులు  
త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్‌’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ‘వన్స్‌ మోర్‌ జగన్‌’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా  అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు.

మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్‌ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు.

ఓ వైపు చంద్రబాబు, లోకేశ్‌.. మరోవైపు పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా.  
 
బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్‌ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్‌సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది.  
 
కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? 
బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్‌ శివార్లలో ఉన్న ఫిల్మ్‌ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం.

పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తూ సీఎస్‌ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్‌.ఎస్‌. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది.

ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్‌ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్‌ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్‌ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు.

తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్‌ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్‌ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు.  
 
కాదనడానికి మీరెవరు రామోజీ? 
దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు.

టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు మీకు జీ హుజూర్‌ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు.

కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement