
పోలింగ్ శాతం పెంచండి: భన్వర్‌లాల్
తక్కువ పోలింగ్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టండి: భన్వర్‌లాల్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎన్నికలపై విసృ్తత ప్రచారం కల్పించాలన్నారు. ఈ మేరకు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్దిష్టమైన సూచనలు చేశారు.
- గత ఎన్నికల్లో 72 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని, ఈసారి కనీసం 85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని, దీనికి సంబంధించిన ప్రచారం కల్పించాలని కోరారు.
- ఓటరు ఇంటికి వెళ్లి స్లిప్పు ఇచ్చి ఓటు వేసేందుకు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ కామినీ చౌహాన్ రతన్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో అమలుచేసిన స్వీప్ సిస్టమ్ విధానం ద్వారా పోలింగ్ శాతం పెరిగేలా చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మన అధికారులకు వివరించారు.
- యువత, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ శాతం మంది పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నట్టు చౌహాన్ తెలిపారు. స్లోగన్ పోటీలు, కార్టూన్, పతంగుల పండుగ, మానవహారాలు, సంతకాల సేకరణ, ఓటుహక్కు వినియోగించుకుంటామనే ప్రతిజ్ఞ, ఓటువిలువ తెలిసేలా కార్యక్రమాలు అమలు చేశామన్నారు.